లక్నో: ఆసియా గేమ్స్‌లో స్వర్ణం సాధించిన జోష్‌లో ఉన్న టీమిండియా సొంతగడ్డపై వెస్టిండీస్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఘనవిజయంతో ఆరంభించింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (43 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్స్‌లతో 102 నాటౌట్) అజేయ శతకంతో రెచ్చిపోయిన వేళ మంగళవారం జరిగిన తొలి మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో విండీస్‌ను చిత్తు చేసింది. ఆ జట్టు నిర్దేశించిన 172 పరుగుల లక్ష్యాన్ని భారత్ 14.4 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి దంచేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అయ్యర్‌కు ఇషాన్ కిషన్ (37 నాటౌట్) అండగా నిలిచాడు. తొలుత విండీస్ 19.1 ఓవర్లలో 171 రన్స్‌కు ఆలౌట్ అయింది. రూథర్‌ఫర్డ్ (34 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 56), కెప్టెన్ షై హోప్ (37 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 52) అర్ధ శతకాలతో రాణించారు. అరంగేట్ర బౌలర్ నమన్ ధీర్ (3/31),అక్షర్ (2/26), కుల్దీప్ (2/33) సత్తా చాటారు. శుక్రవారం రాంచీలో రెండో టీ20 జరగనుంది.
మోస్తరు ఛేదనలో 35 పరుగులకే ఓపెనర్లను కోల్పోయినా కెప్టెన్ శ్రేయస్ ధనాధన్ మెరుపులు మెరిపించడంతో టీమిండియా విజయం నల్లేరుపై నడకే అయింది. వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్ ఇషాన్‌తో కలిసి కరీబియన్ బౌలర్లపై సర్పంచ్ సాబ్ పిడుగులా విరుచుకుపడ్డాడు. ఛేదనలో మొదటి ఓవర్లోనే 6, 4, 4తో రెచ్చిపోయిన అభిషేక్ (21)ను ఛేజ్ ఔట్ చేసి ఆ జట్టుకు తొలిబ్రేక్ ఇచ్చాడు. ఆ వెంటనే శాంసన్ (11).. అకీల్ బౌలింగ్‌లో అతడికే రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దాంతో ఇషాన్‌కు జతకలిసిన అయ్యర్ మొదట్నుంచే దంచుడు మంత్రాన్ని జపించాడు. షమార్ జోసెఫ్ ఆరో ఓవర్లో హ్యాట్రిక్ ఫోర్లతో బాదుడుకు శ్రీకారం చుట్టిన అతడు.. ఆ తర్వాతా ఎక్కడా తగ్గలేదు. ఇషాన్ అతడికి పూర్తి సహకారమందిస్తూ స్ట్రైక్‌ను రొటేట్ చేశాడు.
షెఫర్డ్ 9వ ఓవర్లోనూ శ్రేయస్ మరోసారి హ్యాట్రిక్ ఫోర్లతో అలరించాడు. 28 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదిన సారథి ఆ తర్వాత విధ్వంసాన్ని తారాస్థాయికి చేర్చాడు. ఫోర్డె విసిరిన 14వ ఓవర్లో మూడు సిక్స్‌లు, ఒక బౌండరీతో 24 రన్స్ రాబట్టి 90ల్లోకి వచ్చాడు. ఛేజ్ 15వ ఓవర్లో మూడో బంతిని లాంగాన్ మీదుగా భారీ సిక్స్ బాది తన కెరీర్లో తొలి టీ20 శతకాన్ని నమోదుచేశాడు. 42 బంతుల్లోనే అతడి సెంచరీ సాధించగా ఆ తర్వాత సింగిల్‌తో భారత గెలుపు లాంఛనమూ పూర్తయింది.
ఇన్నింగ్స్‌ను దూకుడుగా ఆరంభించిన విండీస్ ఆ తర్వాత తడబాటుకు గురై క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయినా మళ్లీ ఆఖర్లో మెరుపులతో ప్రత్యర్థి ఎదుట పోరాడగలిగే స్కోరును నిలుపగలిగింది. మొదట్లో కెప్టెన్ హోప్ బౌండరీలతో భారత బౌలర్లపై విరుచుకుపడితే ఆఖర్లో రూథర్‌ఫర్డ్ మెరపులు మెరిపించాడు.ఫోర్‌తోనే వేట మొదలెట్టిన హోప్, మయాంక్ వేసిన రెండో ఓవర్లో నాలుగుసార్లు బంతిని బౌండరీ లైన్ దాటించాడు. అర్ష్‌దీప్ విసిరిన ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో ఆఫ్‌స్టంప్‌నకు ఆవలగా వెళ్తున్న బంతిని ఆడబోయిన ఓపెనర్ కమిల్ పూరన్ (12) ఇన్సైడ్ ఎడ్జ్‌తో క్లీన్‌బౌల్డ్ అవడంతో విండీస్ తొలి వికెట్ కోల్పోయింది.
ఆ వెంటనే అక్షర్ ఓవర్లో రెండో బంతికి హెట్మయర్ (5) రనౌట్ అవడమే గాక ఐదో బంతికి పావెల్ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. దీంతో ధాటిగా ఇన్నింగ్స్‌ను ఆరంభించిన కరీబియన్ జట్టు 44/3తో పవర్ ప్లేను ముగించింది. తర్వాత ఆ జట్టు స్కోరు వేగం కూడా నెమ్మదించింది. నమన్ వేసిన రెండో ఓవర్లో సిక్స్‌తో అర్ధ శతకాన్ని పూర్తిచేసిన హోప్.. అదే ఓవర్లో అక్షర్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఆ తర్వాత వరుస ఓవర్లలో కుల్దీప్.. ఛేజ్ (5), ఫొర్డె (2)ను పెవిలియన్‌కు పంపగా రొమారియా (7), స్ప్రింగర్ (9)ను నమన్ ఔట్ చేశాడు. ఒకవైపు సహచర బ్యాటర్లంతా విఫలమవుతున్నా రూథర్‌ఫర్డ్ మాత్రం నిలబడ్డాడు. మయాంక్ 17వ ఓవర్లో రెండు ఫోర్లతో జూలు విదిల్చిన అతడు.. 31 బంతుల్లోనే ఫిఫ్టీ సాధించాడు. కానీ మయాంక్ 19వ ఓవర్లో నమన్‌కు క్యాచ్ ఇచ్చి తొమ్మిదో వికెట్‌గా వెనుదిరిగాడు.
వెస్టిండీస్: 19.1 ఓవర్లకు 171 ఆలౌట్ (రూథర్‌ఫర్డ్ 56, హోప్ 52, నమన్ 3/31, అక్షర్ 2/26);
భారత్: 14.4 ఓవర్లకు 172/2 (శ్రేయస్ 102*, ఇషాన్ 37, ఛేజ్ 1/37, అకీల్ 1/37)