ఆలివ్ రిడ్లే జాతికి చెందిన సముద్రపు తాబేళ్ల సంరక్షణకు వెలాస్ గ్రామం ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ఇక్కడి సముద్రంలో వేల సంఖ్యలో ఆలివ్ రిడ్లే తాబేళ్లు విహరిస్తాయి. ఏటా శీతాకాలంలో ఆడ తాబేళ్లు తీరానికి వచ్చి గుడ్లు పెట్టి.. సముద్రంలోకి వెళ్లిపోతాయి.

ఇసుకలో పొదిగిన గుడ్ల నుంచి చిన్నచిన్న తాబేలు పిల్లలు బయటికి వచ్చి.. పాకుతూ సముద్రంలోకి వెళ్లే దృశ్యాన్ని చూసి తీరాల్సిందే! ఈ అద్భుతమైన ఘట్టాన్ని తిలకించడానికి దేశ విదేశాల నుంచి పర్యాటకులు, ప్రకృతి ప్రేమికులు, ఫొటోగ్రాఫర్లు వెలాస్కు తరలివస్తారు. ఈ సందర్భంగా ‘సహ్యద్రి నిసర్గ మిత్ర’ అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏటా ‘వెలాస్ టర్టిల్ ఫెస్టివల్’ నిర్వహిస్తున్నారు. సాధారణంగా ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ నెలల మధ్య ఈ పండుగ జరుగుతుంది. అయితే, తాబేళ్ల గుడ్లు పొదిగే సమయాన్ని బట్టి తేదీలు మారుతుంటాయి.

వెలాస్లో టర్టిల్ ఫెస్టివల్‌తోపాటు చూడదగ్గ ప్రదేశాలు మరెన్నో ఉన్నాయిక్కడ. గ్రామానికి సమీపంలోనే సావిత్రి నది.. అరేబియా సముద్రంలో కలుస్తుంది. ఇక్కడే చారిత్రక బంకోట్ కోట ఉంది. ఇక్కడి నుంచి సముద్రం, పరిసర ప్రాంతాల అందాలు అద్భుతంగా కనిపిస్తాయి. ఇక కొంకణి ప్రకృతి సౌందర్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అరేబియా తీరంలోని పచ్చని కొండలు, కొబ్బరి తోటలు, ప్రశాంతమైన వాతావరణం.. నగర జీవన ఒత్తిడి నుంచి ఉపశమనం ఇస్తాయి.
తాబేళ్లతో తమ గ్రామానికి ప్రత్యేక గుర్తింపు రావడంతో.. స్థానికులు కూడా వాటి సంరక్షణకు కృషి చేస్తున్నారు. సముద్రం నుంచి తీరంలోకి వచ్చే తాబేళ్లను వేటగాళ్లు, స్మగ్లర్ల బారి నుంచి కాపాడుతున్నారు. ఇక వెలాస్ గ్రామంలో పెద్దపెద్ద హోటళ్లు, రిసార్ట్స్ ఉండవు. బదులుగా పర్యాటకులకు గ్రామవాసులు తమ ఇళ్లలో ‘హోమ్‌స్టే’ వసతి కల్పిస్తారు. రుచికరమైన మహారాష్ట్ర కొంకణి శైలి శాకాహార, మాంసాహార వంటకాలు వడ్డిస్తారు. ముఖ్యంగా ఇక్కడి సీఫుడ్ వంటకాలను రుచి చూడాల్సిందే!

ముంబై నుంచి 200, పూణె నుంచి 180 కిలోమీటర్ల దూరంలో వెలాస్ ఉంటుంది. ముంబై నుంచి శ్రీవర్ధన్ మీదుగా లేదా మాంగావ్ మీదుగా రోడ్డు మార్గంలో వెలాస్ చేరుకోవచ్చు. ఈ గ్రామానికి సమీప రైల్వే స్టేషన్ మాంగావ్. ఇక్కడి నుంచి టాక్సీలు బస్సుల ద్వారా వెలాస్ గ్రామానికి వెళ్లొచ్చు.