రాజీవ్..రాహుల్..రేవంత్..! ఒక్కోసారి కొన్ని కాకతాళీయాలు చిత్రంగా ఉంటాయి. ఈ ముగ్గురూ కాంగ్రెస్ నాయకులు. ముగ్గురి పేర్లూ ‘ర’ కారంతో మొదలవుతాయి. ఒక ముఖ్యమైన విషయంలో ముగ్గురికీ సంబంధం ఉంది. అయితే, ఆ సందర్భం వచ్చినపుడు ఎవరేమి మాట్లాడి ఏమి చేశారన్నది ఆసక్తికరమైన సంగతి. అది కాంగ్రెస్ రాజకీయాల గురించి, ఆ పరిణామ క్రమం గురించి చెప్పేది చాలా ఉంది. ఇక్కడ మాట్లాడుతున్నది పార్టీ ఫిరాయింపుల గురించి. అది 1985వ సంవత్సరం.
రాజీవ్‌గాంధీ అపుడు ప్రధానమంత్రి. అంతకుముందు ఏడాది 1984లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఆయన పార్టీకి మొత్తం 543 స్థానాల్లో 415 లభించాయి. అంతటి మెజారిటీ లోగడ ఎప్పుడూ రాలేదు. అందుకు కారణం ఆయన తల్లి అయిన మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్య వల్ల వెల్లువెత్తిన సానుభూతి అయితే కావచ్చుగాక. కానీ అంతటి మెజారిటీ అన్నది వాస్తవం. రాజీవ్‌గాంధీ మాత్రం అటువంటి ఆధిక్యతను సద్వినియోగపరుస్తూ కొన్ని మంచి పనులు చేశారు. 1985లో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని చేయటం వాటిలో ఒకటి.
అంతకు సరిగా 18 సంవత్సరాల క్రితం 1967లో హర్యానాలో ఒక ఉదంతం జరిగింది. గయాలాల్ అనే ఒక స్వతంత్ర ఎమ్మెల్యే ఒకేరోజులో మూడుసార్లు పార్టీలు మారాడు. మొదట కాంగ్రెస్‌లో చేరి, యునైటెడ్ ఫ్రంట్‌లోకి మారి, తిరిగి కాంగ్రెస్‌లోకి వెళ్లి, మళ్లీ యునైటెడ్ ఫ్రంట్‌లోకి. ఆ మధ్యలో ఆయన కాంగ్రెస్‌లోకి వచ్చినపుడు అప్పటి పార్టీ నాయకుడు రావు బీరేంద్రసింగ్, ‘గయారాం ఇక గయారాం కాడు, ఆయారాం’ అని పత్రికల వారితో హాస్యంగా వ్యాఖ్యానించారు. అప్పటినుంచి భారత రాజకీయాల్లో ‘ఆయారాం గయారాం’ ఒక పరిభాషగా మారింది.
దీనితో ప్రత్యక్ష సంబంధం లేదు గాని, ఇదేవిధమైన ఆసక్తికర విషయం ఒకటి చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆంధ్ర జనత అనే దినపత్రిక ఒకటి నడుపుతుండేది. 1970లలో మూతపడటానికి ముందు దాని సంపాదకుడు రాజగోపాలరావు. ఆయనకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని కోరిక కలిగింది. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వలేదు. మరేదో పార్టీలోకి మారితే వారూ ఇవ్వలేదు. తిరిగి కాంగ్రెస్‌లోకి వచ్చినా దొరకలేదు. అపుడు పార్టీ అధ్యక్షుడిని బతిమిలాడుకుని సంపాదకునిగా కొనసాగారు. ఇదంతా ఒక్కరోజులోనే జరిగిపోయింది. అపుడు నేను ఆ పత్రికలో సబ్-ఎడిటర్‌ను. మేము హర్యానా గురించి మాట్లాడుకునేవాళ్లం.
హర్యానా ఉదంతానికి, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి (1985) మధ్య కాంగ్రెస్ పార్టీకి లోక్‌సభలో ఆధిక్యత రానిది 1977లో మాత్రమే. కానీ అది ఎమర్జెన్సీ (1975-77) వల్ల ఎదురైన ప్రత్యేక పరిస్థితి. మొత్తానికి ఈ నేపథ్య పరిణామాల మధ్య 1984లో ప్రధాని అయిన రాజీవ్‌గాంధీ మరుసటి సంవత్సరం పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని చేశారు. ఆయన చేసిన పలు మంచి పనుల్లో అది ఒకటి. అపుడాయన యువకుడు. రాజకీయాల్లో ప్రవేశించటమే తల్లి హత్య పర్యవసానంగా అనూహ్యంగా జరిగింది. అది కూడా పార్టీ పెద్దలు నచ్చజెప్పి ఒప్పించారంటారు. అపుడు రాజకీయరంగంలో చర్చనీయంగా ఉండిన వాటిలో పార్టీ ఫిరాయింపుల అంశం ఒకటి.
రాజీవ్‌గాంధీ పార్టీ ఫిరాయింపుల గురించి చేసిన వ్యాఖ్య ఈ విధంగా ఉంది. ‘ఇవి మన ప్రజాస్వామ్యపు పునాదులను, ఆ వ్యవస్థను నిలిపి ఉంచే సూత్రాలను భంగపరిచే అవకాశం ఉంది’ ఆ మాట అన్న ఆయన ఫిరాయింపుల నిరోధానికి 52వ రాజ్యాంగ సవరణను చేయటమేగాక, దానికి రక్షణ కల్పించేందుకు రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్లో చేర్చారు. దానిని బట్టి ఆయన నిజాయితీ, చిత్తశుద్ధి ఎటువంటివో అర్థం చేసుకోవచ్చు.
తర్వాత, కేవలం తన కుటుంబానికి, కుటుంబ మిత్రుడైన కాట్రోచ్చీకి నిమిత్తం గల బోఫోర్స్ కేసు ప్రభావంతో అధికారం కోల్పోయి, సలహాదారుల తప్పుడు సలహాలతో శ్రీలంకలో అక్కరలేని జోక్యాలు చేసుకుని ప్రాణాలు సైతం పోగొట్టుకున్న రాజీవ్‌గాంధీ ప్రధానిగా కానసాగి ఉంటే, పార్టీ ఫిరాయింపుల చట్టం పకడ్బందీగా అమలు జరిగి ఉండేదనాలి. ఆయన తర్వాత కాలంలో ఆ చట్టాన్ని అందరికన్నా ఎక్కువగా భ్రష్టుపట్టించింది కాంగ్రెస్ పార్టీయే. కేంద్రంలో, రాష్ర్టాల్లో కూడా. ఆ విధంగా, తిరిగి రాజీవ్‌గాంధీ వ్యాఖ్యలను ప్రస్తావించాలంటే, ‘మన ప్రజాస్వామ్యపు పునాదులను, ఆ వ్యవస్థను నిలిపి ఉంచే సూత్రాలను భంగపరిచే’ పుణ్యాన్ని మూటగట్టుకుంటూ వచ్చింది అత్యధికంగా తదనంతర కాంగ్రెస్‌వాదులే. ఇది నేటికీ కొనసాగుతున్నది.
రాజీవ్‌గాంధీ 1991లో హత్యకు గురికానట్లయితే, అపుడుగాని, మరొకసారిగాని తిరిగి ప్రధాని అయి ఉంటే, ఫిరాయింపుల విషయం ఎట్లుండేదో చెప్పలేము. కానీ వెనుకకు తిరిగి ఆలోచిస్తే, ఆశాభావానికి వీలుండేదనాలి. తదనంతర పరిణామాలను గమనించినపుడు, కార్యకారణ సంబంధం అనే మాట గుర్తుకువస్తుంది. అనగా, సులభంగా చెప్పాలంటే, జరిగే వాటికి కారణాలుంటాయని. తదనంతర పరిణామాలంటే రాజీవ్‌గాంధీ ఉత్తమమైన ఆదర్శంతో చేసిన చట్టం భ్రష్టుపడుతూ పోవడమని. అది కార్యం. అందుకు కారణాలేమిటి? కాంగ్రెస్‌వారే దానిని ఎందుకు భ్రష్టుపట్టించారు. తన పాలనా వైఫల్యాల వల్ల ప్రజాదరణ కోల్పోవటం మొదలైన కాంగ్రెస్‌కు మెజారిటీలు కూడా పోయే దశ ఒకటి మొదలైంది. అధికారం వివిధ ఫ్రంట్లకు, బీజేపీకి అధీనం కాసాగింది. 2004, 2009లో తిరిగి ప్రభుత్వాలు ఏర్పాటు చేసినా ఇతర పార్టీల మద్దతు, ఐక్య సంఘటనలు తప్పనిసరి అయాయి. 2014 వచ్చేసరికి ఏదీ పనిచేయలేదు. వరుసగా మూడుసార్లు సీట్ల సంఖ్య వంద అయినా దాటలేదు. తమ రాష్ట్ర ప్రభుత్వాల సంఖ్య 5 కన్నా తక్కువైంది.
విషయమేమంటే..ఈ పరిణామాల మధ్య రాజీవ్ కుమారుడు రాహుల్ రంగప్రవేశం (2004) జరిగింది. ఆయన ఒక ఘోర వైఫల్యమని కొద్దికాలం గడిచేసరికే తేలిపోయింది. అన్నివైపుల నుంచి గౌరవంతోపాటు తగు సమర్థత గల తల్లి సోనియాగాంధీ వెన్నుదన్ను సైతం క్రమంగా ఏమీ చేయలేకపోయింది. కాంగ్రెస్ పునరుద్ధరణకు అవసరమైన అవగాహనలు, ప్రణాళికలు, కార్యాచరణలు, సమర్థతలు లేని ఆయనకు, అధికార సాధన కోసం షార్ట్‌కట్‌లే దిక్కయాయి. వాటిలో ఒకటి, తండ్రి వద్దన్న ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ ఆయన చేసిన ఒక గొప్ప చట్టాన్ని నామరూపాలు లేకుండా ధ్వంసం చేయటం. తమవారితో ధ్వంసం చేయించటం. చట్టానికి చిత్రవిచిత్రమైన సృజనాత్మక నిర్వచనాలు చెప్పటం. స్పీకర్లతో చెప్పించటం. ఇది ఒక షార్ట్‌కట్ కాగా, మరొక రెండున్నాయి. ఒకటి, అధికారం సంపాదించేందుకు ఓటర్లకు తెలిసి తెలిసి అబద్ధపు హామీలిప్పించటం. హామీలివ్వటం ఎప్పుడూ ఉన్నదే. అందరూ చేసేదే. కానీ రాహుల్ నాయకత్వాన అది కొత్త పతనాలను చూసింది. వైఫల్యాలు ఎంత పెరిగి, ప్రజాదరణ ఎంత తగ్గి, అధికారం ఎంత దూరంలో కనిపిస్తే, భయాలు అంత తీవ్రమై, అదే అనుపాతంలో అబద్ధపు హామీల స్థాయి పెరగటమన్నమాట. మరొకటి, ఇతరులతో పొత్తులు.
గతంలో తమది పెద్ద పార్టీ అయి ఇతర చిన్న పార్టీలతో పొత్తుల పద్ధతి ఉండేది. రాహుల్‌గాంధీ దశ వచ్చేసరికి పలు సందర్భాల్లో తామే జూనియర్లుగా మారిపోయారు. అయినా పలుమార్లు వ్రతం చెడ్డా ఫలం దక్కటం లేదు. ‘ఇండియా’ కూటమిని గందరగోళంగా మార్చటం రాహుల్ అసమర్థతకు ఒక పెద్ద ఉదాహరణ.
పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని చేసి తండ్రి ఎంతగా దేశ విదేశాల్లో ప్రశంసలు అందుకున్నారో, దానిని అంతగా ధ్వంసం చేసిన కుమారుడు ఆ చట్టాన్ని అపహాస్యం చేసి అంతగా నవ్వులపాలవుతున్నారు. ఇటువంటి కార్యకారణ సంబంధాల్లో, పతన పరిణామ క్రమంలో రేవంత్‌రెడ్డి వంటివారు ఒక చిన్నపావు మాత్రమే. అందులో స్వంత లాభం కొంత వెతుక్కుని ఆనందించే పాత్రధారి మాత్రమే. సూత్రధారి, పాత్రధారి ఒకరికొకరు అవసరం. ఆ విధంగా, పతన నాటక క్రమం రక్తికడుతున్నది. కాకపోతే, భారత ప్రజాస్వామిక విలువలను, రాజ్యాంగ పునాదులను కాపాడజూసిన మొదటి ‘ర’ కారాన్ని, తర్వాతి రెండు ‘ర’ కారాలు వెన్నుపోటు పొడవటం గురించే విచారమంతా.
-టంకశాల అశోక్