Rashmika | విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న భారీ పీరియాడిక్ యాక్షన్ చిత్రం ‘రణబాలి’పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. దసరా కానుకగా అక్టోబర్ 16న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండటంతో చిత్రబృందం ప్రమోషన్లను వేగవంతం చేసింది. అయితే సినిమా ప్రచార కార్యక్రమాల్లో రష్మిక చలాకీగా వ్యవహరిస్తున్న తీరుపై సోషల్ మీడియాలో కొంతకాలంగా చర్చ జరుగుతోంది. కొందరు నెటిజన్లు ఆమెను ‘ఓవరాక్షన్’, ‘క్రింజ్’ అంటూ ట్రోల్ చేస్తున్నారు. తాజాగా ఈ విమర్శలపై రష్మిక తనదైన శైలిలో స్పందించారు.సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో రష్మిక ఎంతో ఉత్సాహంగా కనిపిస్తుంటారు. తోటి నటీనటులతో సరదాగా మాట్లాడటం, నవ్వుతూ సందడి చేయడం ఆమెకు అలవాటు. అయితే ఇదే స్వభావాన్ని కొందరు నెటిజన్లు తప్పుబడుతున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇదే విషయంపై ప్రశ్న ఎదురవడంతో రష్మిక ఎలాంటి మొహమాటం లేకుండా తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
తాను ఎక్కడికి వెళ్లినా అక్కడి వాతావరణం సానుకూలంగా, ఆహ్లాదకరంగా ఉండాలని కోరుకుంటానని ఆమె తెలిపారు. అందరితో సరదాగా ఉండటం, నవ్వుతూ మాట్లాడటం తన సహజ స్వభావమని చెప్పారు. దాన్ని కొందరు ‘అతి’గా భావించినంత మాత్రాన తన వ్యక్తిత్వాన్ని మార్చుకునే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరినీ మెప్పించడం ఎవరి వల్లా కాదని, తాను ఎలా ఉండాలనుకుంటున్నానో అలాగే ఉంటానని రష్మిక చెప్పుకొచ్చారు. ఇతరుల కోసం తన అసలైన వ్యక్తిత్వాన్ని దాచుకోవాల్సిన అవసరం తనకు లేదని, ముసుగు వేసుకుని జీవించడం తనకు ఇష్టం లేదని స్పష్టం చేశారు. తన చుట్టూ ఉన్నవారిని సంతోషంగా ఉంచడం తనకు ఇష్టమని రష్మిక తెలిపారు. తన సహజమైన ప్రవర్తన వల్ల కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఆత్మీయులు ఆనందంగా ఉంటారని చెప్పారు.
సోషల్ మీడియాలో వచ్చే విమర్శల కోసం తనలోని సహజత్వాన్ని వదులుకునే ప్రసక్తే లేదని ఆమె తేల్చిచెప్పారు. రష్మిక ఇచ్చిన ఈ సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. తనను విమర్శించే వారికి నేరుగా ఘాటైన వ్యాఖ్యలు చేయకుండా.. తన వ్యక్తిత్వం విషయంలో తాను ఎంత స్పష్టంగా ఉన్నానో చెప్పడం అభిమానులను ఆకట్టుకుంటోంది. మరోవైపు ‘రణబాలి’ ప్రమోషన్ల విషయంలోనూ సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సినిమా కథ, యాక్షన్ సన్నివేశాలు, పీరియాడిక్ నేపథ్యం వంటి అంశాల గురించి మాట్లాడటం కంటే విజయ్ దేవరకొండ–రష్మికల వ్యక్తిగత బంధానికి సంబంధించిన ప్రశ్నలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారనే అభిప్రాయం కొందరిలో వ్యక్తమవుతోంది. వీరిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం గురించి ఇప్పటికే అభిమానుల్లో ఎన్నో చర్చలు ఉన్నాయి. దీంతో సినిమా ప్రమోషన్లలోనూ వారి వ్యక్తిగత విషయాలపై ప్రశ్నలు ఎక్కువగా రావడం సహజంగానే ఆసక్తిని రేకెత్తిస్తోంది.