Meet And Greet | మెల్బోర్న్: ఆస్ట్రేలియాలో బీఆర్ఎస్ శ్రేణుల్లో నూతనోత్సాహం వెల్లివిరిసింది. ఆస్ట్రేలియా పర్యటనకు విచ్చేసిన మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డితో బీఆర్ఎస్ ఆస్ట్రేలియా వ్యవస్థాపక అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమానికి భారీ స్పందన లభించింది. మెల్బోర్న్లోని తెలంగాణ, తెలుగు ప్రజలు, బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారాన్ని ప్రజలు గుడ్డిగా నమ్మవద్దని సూచించారు. కాళేశ్వరం సహా గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులు, కార్యక్రమాలపై వాస్తవాలను తెలుసుకున్న తర్వాతే స్పందించాలని ఆయన కోరారు.
బీఆర్ఎస్ ఆస్ట్రేలియా వ్యవస్థాపక అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి మాట్లాడుతూ.. సోషల్ మీడియా, యూట్యూబ్, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చే ప్రతీ వార్తను నిజమని నమ్మకుండా ఫ్యాక్ట్ చెకింగ్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ‘ఏది నిజం? ఏది అబద్ధం?’ అనే విషయాన్ని ప్రజలు స్వయంగా నిర్ధారించుకోవాలని కోరారు. రాజకీయ అంశాలపై వచ్చే ఫేక్ న్యూస్, నిరాధారమైన ప్రచారాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ప్రత్యేక ఆకర్షణగా కేటీఆర్ వీడియో కాల్..
కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వీడియో కాల్ ద్వారా మెల్బోర్న్లోని తెలంగాణ, తెలుగు ప్రజలను ఉద్దేశించి సందేశం అందించారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉన్నా తెలంగాణ ప్రజలు తమ కుటుంబ సభ్యులు, మిత్రులు, సమాజంలోని వారితో తెలంగాణకు సంబంధించిన అంశాలపై చర్చించాలని, ప్రజలకు జరుగుతున్న అన్యాయాలపై ప్రశ్నించాలని కేటీఆర్ కోరారు. అలాగే త్వరలో మెల్బోర్న్కు వచ్చి తెలంగాణ, తెలుగు ప్రజలతో ప్రత్యక్షంగా సమావేశమై వారిని కలుస్తానని కేటీఆర్ తెలిపారు. కేటీఆర్ వీడియో సందేశంతో కార్యక్రమంలో ఉత్సాహం మరింత పెరిగింది.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఆస్ట్రేలియా నాయకులు సాయిరాం ఉప్పు, వినయ్ సన్నీ గౌడ్, ఉదయసింహా రెడ్డి, విశ్వామిత్ర, మంత్రిపగడ, సూర్యారావు, జాబ్ అడ్డ సంజు, రాకేష్ యాదవ్‌లతో పాటు మేడ్చల్ బీఆర్ఎస్ నాయకుడు గుర్రం శ్రీధర్ రెడ్డి పలువురు నాయకులు పాల్గొన్నారు. మెల్బోర్న్లోని వివిధ తెలుగు, తెలంగాణ సంఘాల నాయకులు, మహిళలు, యువతీ యువకులు, ప్రవాస భారతీయులు, బీఆర్ఎస్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మాజీ మంత్రి మల్లారెడ్డితో జరిగిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం ఆస్ట్రేలియాలోని బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపిందని నిర్వాహకులు తెలిపారు.


Urvashi Rautela | ఊర్వశి రౌతేలా వర్సెస్ ఏఐ కంపెనీ.. రూ.7 వేల కోట్ల దావా, సీఈఓ ఘాటు కౌంటర్‌తో రచ్చ!