Urvashi Rautela | బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా పేరు ఇప్పుడు సినిమాల కంటే ఓ అంతర్జాతీయ టెక్ వివాదంతో హాట్ టాపిక్‌గా మారింది. లాస్ ఏంజెల్స్‌కు చెందిన ఓ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఊర్వశి బృందం ప్రకటించింది. తన అనుమతి లేకుండా తన పేరు, ఫొటోలు, వీడియోలను వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించారనేది ఆమె బృందం ఆరోపణ. ఈ వ్యవహారంలో నష్టపరిహారంగా సుమారు రూ.7,000 కోట్లు కోరుతున్నట్లు తాజాగా వెల్లడించింది..ఊర్వశి రౌతేలా బృందం సోషల్ మీడియాలో చేసిన ప్రకటనతో ఈ వివాదం వెలుగులోకి వచ్చింది.
ఈ సందర్భంగా ఊర్వశి బృందం ఏఐ సంస్థలకు గట్టి హెచ్చరిక చేసింది. ఎవరైనా తమ సొంత ఏఐ సంస్థను ఏర్పాటు చేసుకోవచ్చని, తమ బ్రాండ్‌ను అభివృద్ధి చేసుకోవచ్చని.. అయితే అనుమతి లేకుండా ఊర్వశి రౌతేలా పేరు, గుర్తింపు, చిత్రాలను తమ వ్యాపార ప్రయోజనాల్లో ఉపయోగించకూడదని స్పష్టం చేసింది.ప్రత్యేకంగా సెలబ్రిటీల పేరు, రూపం, వీడియోలు, డిజిటల్ గుర్తింపును ఏఐ ఆధారిత వాణిజ్య కార్యకలాపాల్లో ఉపయోగించే విషయంలో అనుమతి, హక్కులు వంటి అంశాలు ఎంత కీలకమో ఈ వివాదం మరోసారి చర్చకు తెచ్చింది.మరోవైపు ఊర్వశి బృందం చేసిన ఆరోపణలపై సంబంధిత ఏఐ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ షీరాజ్ హసన్ స్పందించారు. రూ.7,000 కోట్ల క్లెయిమ్‌ను ఆయన తీవ్రంగా ప్రశ్నించారు. ఊర్వశి గతంలో తమ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూను ప్రస్తావిస్తూ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బాలీవుడ్ భవిష్యత్తుపై ఆమె చేసిన వ్యాఖ్యలను ఆయన గుర్తుచేశారు.
ఆ ఇంటర్వ్యూలో ఏఐ వల్ల బాలీవుడ్ ఎదుర్కొంటున్న మార్పులపై ఊర్వశిని ప్రశ్నించగా.. ఆమె సమాధానంపై ఇప్పుడు షీరాజ్ హసన్ స్పందించారు. తమ సంస్థ ఆమె నోట మాటలు చెప్పించలేదని, ఏఐ, వినోద రంగ భవిష్యత్తు గురించి మాట్లాడే ముందు టెక్నాలజీపై మరింత అవగాహన పెంచుకోవాలని సూచించారు.వినోద రంగ భవిష్యత్తు ఏఐ సినిమాలు, డిజిటల్ నటీనటులు, వర్చువల్ పాత్రల వైపు సాగుతుందని షీరాజ్ హసన్ తన స్పందనలో పేర్కొన్నారు. వయసు పెరగని డిజిటల్ పాత్రలు, అనేక భాషల్లో పనిచేసే వర్చువల్ స్టార్స్ వంటి సాంకేతిక పరిణామాలు రానున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.అయితే ఈ స్పందనకు సంబంధించి ఊర్వశి బృందం నుంచి తదుపరి అధికారిక సమాధానం వెలువడిందా అనే దానిపై ప్రస్తుతం స్పష్టత లేదు. దీంతో ఇరు వర్గాల ప్రకటనలు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి.