తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తొమ్మిదిన్నరేండ్ల పాలనలో అన్నదాత జీవితాలకు భరోసాగా నిలిచిన రైతు బీమా పథకం కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో రద్దయి, వేలాది కుటుంబాల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. 2018 ఆగస్టు 14న నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రైతాంగ స్థితిగతులకు అనుగుణంగా, తన ఉద్యమ ప్రయాణ అనుభవాలను అర్థం చేసుకుని ఎంతో మహోన్నతమైన ఆలోచనలతో రూపుదిద్దిన పథకం రైతు బీమా.
రైతు పేరిట గుంట వ్యవసాయ భూమి ఉన్నా, ఈ పథకం వర్తింపజేసేలా రైతు బీమాకు కేసీఆర్ నాడు శ్రీకారం చుట్టారు. 18 ఏండ్ల నుంచి 59 ఏండ్ల మధ్య వయసున్న పట్టాదారు రైతులను పథకం పరిధిలోకి తెచ్చారు. రైతు మరణానికి గల కారణాలతో సంబంధం లేకుండా రూ.5 లక్షల బీమా సొమ్మును నామినీ ఖాతాలో వేశారు. ఇందుకోసం ప్రభుత్వమే రైతులపై ఒక్క రూపాయి భారం కూడా రైతులపై పడకుండా బీమా సంస్థకు ప్రీమియం చెల్లించింది. బీమా క్లెయిమ్ పరిష్కార ప్రక్రియ కూడా వేగవంతంగా జరిగేలా వ్యవస్థను రూపొందించింది. రైతు మరణించిన వారం నుంచి పది రోజుల్లోనే క్లెయిమ్ సెటిల్ అయ్యేలా ప్రణాళికలు పకడ్బందీగా తయారుచేసింది.
ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో రైతు బీమా అందక అసువులు బాసిన వారిలో హృదయాలను ద్రవించే ఘటనల్లో మచ్చుకు ఒకటి చూద్దాం. జనగామ జిల్లా, స్టేషన్‌ఘనపురం మండలంలోని శివునిపల్లికి చెందిన 45 ఏండ్ల తోట మోహన్ అనే పేద రైతు ఆగస్టు 29న అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించాడు. ఆయన భార్య సంధ్య మూడేండ్ల కిందటే మరణించింది. వారికి మతిస్థిమితం సరిగా లేని 15 ఏండ్ల కుమార్తె నిత్యశ్రీ ఉన్నది. మోహన్ పేరు మీద 20 గుంటల వ్యవసాయ భూమి ఉన్నది. తన తల్లిదండ్రులు తనను అర్ధాంతరంగా వదిలివెళ్లారని బాధపడే స్థితిలో కూడా లేని ఆ బాలిక జీవితమే ఇప్పుడు ప్రశ్నార్థకమైంది. అంతో ఇంతో ఆమె జీవితానికి తన తండ్రి రైతు బీమా డబ్బులు భరోసాగా ఉంటాయని భావించిన బంధువులకు ఊహించని షాక్ తగిలింది.
ఈ ఏడాది ఆగస్టు 13తో ముగిసిన రైతు బీమా పథకానికి రూ.1,400 కోట్ల ప్రీమియం చెల్లించకపోవడంతో ఆగస్టు 14 నుంచి పథకం నిలిచిపోయింది. బీమా సొమ్ము క్లెయిమ్ విషయంలో ప్రభుత్వం ఎలాంటి మార్గదర్శకాలు రూపొందించలేదు. నవంబర్ 19న కుటుంబ బీమా అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మరి ఆలోపు మరణించిన రైతుల పరిస్థితి ఏంది? వారికి ప్రభుత్వ పరంగా ప్రత్యేకంగా సాయం అందించే చర్యలు ఏమైనా ఉన్నాయా అంటే ఆ విషయంలో ఎలాంటి స్పష్టత లేదు.
ఆగస్టు 15 తర్వాత మరణించిన చాలా రైతు కుటుంబాల పరిస్థితి ఇదేనని, కేవలం మరణించిన రైతుల వివరాలను మాత్రమే తాము రికార్డ్డు చేస్తున్నామని విస్తరణ అధికారి చెప్పారు. ఈ సమాధానంతో అభం శుభం ఎరుగని మోహన్ కుమార్తె పరిస్థితిపై ఆమె బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది నాణేనికి ఒకవైపు కాగా, మరోవైపు కూడా చూద్దాం. 6 గుంటల వ్యవసాయ భూమి ఉన్న స్టేషన్‌ఘనపూర్‌కు చెందిన మరో పేద దళిత రైతు 2022 జనవరిలో మరణించగా ఆయన నలుగురు ఆడబిడ్డలు, ముసలామె అనాథలుగా మారే పరిస్థితి. కొన్ని రోజుల తర్వాత వ్యవసాయ శాఖ అధికారులు ఇచ్చిన రైతు బీమా బాండ్ పేపర్‌ను చూసి గ్రామస్తుల సహకారంతో సంప్రదించారు. ఆ కుటుంబానికి రైతు బీమా వర్తిస్తుందని చెప్పారు.
వెంటనే చేయాల్సిన ప్రక్రియను పూర్తి చేసి వారం రోజుల్లోపు మృతుడి భార్య ఖాతాలో రూ.5 లక్షలు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ సంస్థ ద్వారా జమయ్యేలా చేసింది నాటి కేసీఆర్ ప్రభుత్వం. ఆ రైతు బీమా సొమ్ము అనాథలమనుకున్న ఆ నలుగురు ఆడబిడ్డల కుటుంబాన్ని పెద్ద చేసింది. వృద్ధాప్యంలోని ఆ రైతు భార్యకు భరోసాగా నిలిచింది. ఈ రెండు ఘటనల్లోని రైతుల్లో ఇద్దరూ కరువు కాటకాలు తాండవం చేసిన ప్రాంతానికి చెందినవారే. ఇద్దరూ నిరుపేద దళిత కుటుంబాలవారే. కానీ ఒక కుటుంబానికి రైతు బీమా భరోసానిస్తే, మరో కుటుంబానికి అదే బీమా పథకం అందని ద్రాక్షగా మారింది.
రైతు బీమా పథకం కింద నమోదై ఉన్న రాష్ట్రంలోని 42.16 లక్షల మంది రైతుల పరిస్థితి నేడు దయనీయంగా మారింది. రాష్ట్ర ఆర్థిక, గణాంకాల శాఖ అధికారిక లెక్కల ప్రకారం. 2018 నుంచి 2023-2024 వరకు కేసీఆర్ ప్రభుత్వం 1,38,921 మంది రైతు కుటుంబాలకు రూ.6,900 కోట్ల పరిహారాన్ని బీమా సంస్థ ద్వారా అందించింది. కేవలం రూ.1,400 కోట్ల ప్రీమియం చెల్లింపుతో నిరాటంకంగా సాగాల్సిన ఈ అద్భుత పథకం పాలకుల స్వార్థ రాజకీయం కోసం మసకబారింది. రాష్ట్ర వ్యాప్తంగా 26,000-32,000 మంది రైతు కుటుంబాలు ప్రభుత్వ నిర్లక్ష్యానికి బలైపోయారు. రైతు గుండె ఆగితే..బీమా అతని కుటుంబానికి ధీమాగా ఉంటుందని భావించిన వారి ఆశలను కాంగ్రెస్ సర్కార్ ఆవిరి చేసింది.
(వ్యాసకర్త: జర్నలిజం విద్యార్థి, కాకతీయ యూనివర్సిటీ)
-విజయ్ కుమార్ పిన్నింటి ,90520 39109