ముంబై, అక్టోబర్ 6: రిజర్వుబ్యాంక్ తన ద్విమాస పరపతి సమీక్షను బుధవారం ప్రకటించనున్నది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా దేశ ద్రవ్యోల్బణంపై తీవ్ర ఒత్తిడి నెలకొన్న ప్రస్తుత తరుణంలో సెంట్రల్ బ్యాంక్ తన సమీక్షలో కీలక వడ్డీరేట్లను పావు శాతం పెంచే అవకాశాలున్నాయని ఆర్థిక నిపుణలు అంచనావేస్తున్నారు. రిజర్వు బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా బుధవారం ఉదయం 10 గంటలకు వడ్డీరేట్లపై ద్రవ్యపరపతి పాలసీ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని ప్రకటించనున్నారు.
ఒకవేళ వడ్డీరేట్లను పెంచితే మూడున్నరేండ్ల తర్వాత రేట్లను సవరించినట్టు కానున్నది. 2025 నుంచి ఇప్పటి వరకు వడ్డీరేట్లను 125 బేసిస్ పాయింట్లు తగ్గించిన విషయం తెలిసిందే. గతంలో ఫిబ్రవరి 2023లో సెంట్రల్ బ్యాంక్ రెపోరేట్‌ను పావు శాతం పెంచి 6.50 శాతానికి చేర్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆర్బీఐ రెపోరేటును 1.25 శాతం తగ్గించడంతో రుణ రేటు 5.25 శాతానికి దిగొచ్చింది. వడ్డీరేట్ల పెంపుపై పీటీఐ నిర్వహించిన పోల్‌లో అత్యధిక మంది ఆర్థికవేత్తలు పావుశాతం మేర పెంచే అవకాశం ఉన్నదని అంచనావేశారు. ప్రస్తుతం ద్రవ్యోల్బణం సెంట్రల్ బ్యాంక్ లక్ష్యంగా పెట్టుకున్న 4 శాతం కంటే అధికంగా 4.82 శాతంగా నమోదైంది.