శరీరావయవాల పునఃసృష్టి విషయంలో అందరికన్నా తోపు ఎవరంటే ప్లానేరియన్ ఫ్లాట్ వామ్ పేరే చెబుతుంది జీవజాలం. మన పురాణాల గుర్తుతో చెప్పాలంటే నేల మీద పడిన ఒక్కో రక్తపు బొట్టు నుంచి ఒక్కో వ్యక్తిగా పుట్టుకొచ్చే రక్త బీజుడు దీనికి సరిపోలుతాడు. కాకపోతే పాపం ఇదేం రాక్షసి కాదనుకోండి. ఇంతకీ విషయం ఏమిటంటే… శుభ్రమైన నీటిలో జీవించే ఈ పురుగును రెండు ముక్కలుగా చేస్తే రెండు జీవులుగా మారుతుంది. అదే పది ముక్కలు చేస్తే పది ప్రాణులుగా పుడుతుంది. ప్లూరిపొటెంట్ స్టెమ్ సెల్స్… అనే మూల కణాలు వీటిలో ఉంటాయి. వీటినే ‘మిరాకిల్ సెల్స్’ అనీ పిలుస్తారు. ఇవి అవసరాన్ని బట్టి ఒక్కో రకం కణాలుగా రూపాంతరం చెందుతాయి. అందుకే దాని శరీరం తెగిపోతే వెంటనే మరో మెదడు, కళ్లు, పూర్తి శరీరాన్ని సృష్టించుకుంటుంది. పెద్ద గాయాల నుంచి శరీరం కోలుకునేందుకే కాదు, అవయవాల పునఃసృష్టిని మానవులకూ చేరువ చేసే పెనుమార్పులకు శ్రీకారం చుట్టేందుకు యూకే, అమెరికా శాస్త్రవేత్తలు వీటి మీద పరిశోధనలు చేస్తున్నారు.
సముద్ర గర్భం మీద ఉండే ఇసుకలో నివసిస్తాయి సీ కుకుంబర్లు. పందిరి దోసకాయల ఆకృతిలో ఉండటం వల్ల వీటిని సీ కుకుంబర్ (సముద్ర దోసకాయ)లని పిలుస్తారు. అయితే ఏ జీవి అయినా వీటి మీద దాడి చేస్తే దాని దృష్టి మరల్చి తమని తాము కాపాడుకోవడానికి తమ అంతర్గత అవయవాలను బయటికి విసురుతాయి. అంటే ఉదాహరణకి జీర్ణాశయాన్ని లేదా శ్వాసకోశ వ్యవస్థని…ఇలా బయటికి విసురుతాయన్నమాట. దీన్ని శాస్త్రీయ పరిభాషలో ‘ఎవిసరేషన్’ అని పిలుస్తారు. ఎండ్రకాయలు, చేపల్లాంటివి ఏవైనా దాడికి వచ్చినప్పుడు ఇవి ఇలా చేస్తాయన్నమాట. అయితే తమలోపల ఉండే ప్రత్యేక కణజాలాల సాయంతో ఈ అవయవాలను కొద్ది వారాల్లోనే తిరిగి నిర్మించుకుంటాయి.
సముద్రం అడుగున ఉండే సీస్పాంజ్ల గురించి వినే ఉంటాం. రంధ్రాల శరీరంతో ఉండే ఈ జీవులు సముద్ర నీటి ఫిల్టర్లుగా ఉపయోగపడతాయి. చిన్న చేపల్లాంటి జీవులు దాక్కోవడానికి, గుడ్లు పెట్టడానికి సాయపడతాయి. ఇంతకు మించిన ప్రత్యేకత ఉందీ జీవిలో… ఈ సముద్ర స్పాంజ్ని మనం చిన్న చిన్న ముక్కలుగా చేసినా అవన్నీ ఒక దగ్గరికి చేరి మళ్లీ ఒకే జీవిగా మారిపోతాయి. ఏమీ జరగనట్టుగా సాధారణంగా జీవిస్తాయి. ముక్కలైన భాగాలన్నీ వాటంతట అవే ఒక దగ్గరికి చేరే శక్తి దీనికి ఉంది. చూసేందుకు బతికి ఉన్న జిగ్సా పజిల్లా కనిపిస్తుంది దీని పునర్నిర్మాణ ప్రక్రియను ‘రీఎగ్రిగేషన్’ అని పిలుస్తారు. దీనిలోని ఒక్కో ముక్కా ప్రత్యేక జీవరసాయన సంకేతాల ఆధారంగా ఒకదాన్ని ఒకటి గుర్తుపడుతుంది. కాబట్టి ఏ కారణాల వల్లయినా ముక్కగా మారితే మళ్లీ అది దగ్గరగా వచ్చి పూర్వపు జీవిని ఏర్పరుస్తుంది.
సముద్రంలో జీవించే వింతైన జీవుల్లో యాక్సోలోటల్ ఒకటి. కాళ్లు తోక కలిగి ఉండి నడిచే చేపలా కనిపించే ఇది ఓ ఉభయచర జీవి. తలమీద ప్రత్యేక నిర్మాణాలు ఉండి చూసేందుకు కార్టూన్ క్యారక్టర్లా కనబడుతుంది. అయితే ఏదైనా ప్రమాదవశాత్తూ దీనికి వెన్నెముక, చర్మంలాంటివి దెబ్బతిన్నా వాటిని సొంతంగా పునర్నిర్మించుకుంటుంది. అంతేకాదు మళ్లీ దాని మీద ఎలాంటి గీతా పడకుండా. కాళ్లూ చేతుల్ని కూడా ఇదే విధంగా మళ్లీ తెచ్చుకునే ఈ జీవి మీద పరిశోధనలు జరుగుతున్నాయి. మనుషుల్లో గాయాలు మానడం, చర్మం పునర్నిర్మాణంలాంటివి ఎలా మెరుగు పరచవచ్చు అన్న కోణంలో దీన్ని అధ్యయనం చేస్తున్నారు.

జింకలు మనకు బాగా తెలిసిన జంతువులే. అయితే వాటి కొమ్ములకు ఒక ప్రత్యేక లక్షణం ఉంటుంది. కొమ్ముకు ఎక్కడైనా దెబ్బతగిలి గాటు పడితే, అక్కడ మరో చిన్న పిలక లాంటిది వస్తుంది. మరో విషయం ఏమిటంటే కలయిక కాలాలు, శరీరంలోని హార్మోన్ల మార్పుల కారణంగా ప్రతి ఏడూ కొమ్ములు పూర్తిగా పోయి మళ్లీ కొత్త కొమ్ములు పుడతాయి. అలాంటప్పుడు ఈ దెబ్బతగిలిన చోట వచ్చిన కొత్త పిలకలు కూడా అచ్చంగా అదే చోటులో అలాగే వస్తాయట. దీన్నే ‘ట్రోఫిక్ మెమరీ’ అని పిలుస్తారు. అంటే ఆ భాగం పూర్తిగా పోయినా కూడా శరీరం దాన్ని ఉన్నది ఉన్నట్టు గుర్తు పెట్టుకుని అచ్చంగా అలాగే కొమ్ముని నిర్మించడం అన్నమాట. ఇలాంటి వాటి వల్లే జింకలు, దుప్పుల కొమ్ములు చిత్రమైన ఆకృతుల్లో కనిపిస్తాయి. సాధారణంగా ఎద్దుల్లాంటి వాటికి కెరాటిన్తో కొమ్ములు ఏర్పడితే, జింకలవి అచ్చంగా ఎముకలతో సిద్ధమవుతాయి.

సాలమాండర్ బల్లిలాగా కనిపించే ఉభయచర జీవి. ఏవైనా పోరాటాల్లో లేదా ప్రమాదాల్లో కాళ్లు, తోకలాంటివి కోల్పోయినా చక్కగా మళ్లీ అవి తిరిగి పెరుగుతాయి. అంతేకాదు, కొత్త కాళ్లు కూడా అచ్చం పుట్టుకతో వచ్చిన వాటిలాగే పనిచేస్తాయి కూడా. మన ఇళ్లలో ఉండే బల్లి తోకను వదిలి మళ్లీ కొత్త తోకను పొందడం గమనించే ఉంటాం కదూ. ఇక, సాలమాండర్లలో బల్లి, తొండలంత వాటి నుంచి ఆరడుగుల పొడవున్న వాటి వరకూ ఉంటాయివి. వీటిలో ఇలా కాళ్లు తోకల్లాంటివి తిరిగి పెరగడం అన్నది, శరీరంలోని సంక్లిష్ట కణ నిర్మాణాలు కూడా తిరిగి రూపుదిద్దుకోవడానికి ఉదాహరణగా తీసుకుంటారు.

మెక్సికన్ టెట్రా… ఒక మంచి నీటి చేప. దీని ప్రత్యేకత మనుషుల్ని అబ్బురపరుస్తుంది. ఎందుకంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు దీని గుండెను ఇదే బాగుచేసుకుంటుంది. దెబ్బతిన్న కణజాలాన్ని పునర్నిర్మించుకుంటుంది. కొన్నిసార్లు గుండెనూ మళ్లీ తయారు చేసుకుంటుంది. జీబ్రారకం చేపల్లోనూ ఇది చూడొచ్చు. మరో విషయం ఏమిటంటే కొత్తగా రూపుదిద్దుకున్న హృదయం మీద దాని రిపెయిర్కి సంబంధించిన ఎలాంటి గీతలూ ఉండవు. అంటే చక్కటి సరికొత్త గుండె ఊపిరిపోసుకుంటుంది అన్నమాట. అందుకే మనుషుల్లో సర్జరీలు అయినప్పుడు గుండె కోలుకోవడానికి సంబంధించిన సమాచారం కోసం దీని మీద అధ్యయనాలు జరుపుతున్నారు. గుండె కణజాలాన్ని పునరుత్పత్తి చేసేందుకు ఈ మాడల్ని ఉపయోగించుకునేందుకు, అలాగే హార్ట్ఎటాక్లను నియంత్రించే దిశలోనూ పరిశోధనలు చేస్తున్నారు.

శరీరంలో ఒక భాగం పోయినా మళ్లీ దాన్ని తిరిగి పెంచుకునే జీవులు మనకు కొద్దిగా తెలుసు. కానీ కేవలం ఒక భాగం నుంచి ఏకంగా శరీరం మొత్తాన్నీ తిరిగి సృష్టించుకోగల జీవి ఉంది. అదేదో కాదు, మనకు బాగా తెలిసిన స్టార్ ఫిష్. నక్షత్రాకృతిలో ఉండే ఈ సముద్ర జీవికి అయిదు చేతులు ఉంటాయి. అంతకు మిక్కిలి ఉండే రకాలూ ఉన్నాయి. అయితే దీని శరీరం మొత్తం పోయి కేవలం ఒకే ఒక్క చెయ్యి మిగిలినా దాని నుంచి అది మళ్లీ పుడుతుందట. ఇక చేతులు పోతే మళ్లీ వస్తాయని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదూ!