Temple : టెక్ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న గ్యాడ్జెట్.. టెంపుల్. దేశీయంగా రూపొందుతున్న హెల్త్ గ్యాడ్జెట్ ఇది. వచ్చే వారం నుంచి దీని ప్రీ బుకింగ్స్ ప్రారంభమవుతాయని సంస్థ వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ తెలిపారు. ఆరు రంగుల్లో అందుబాటులో ఉంటాయన్నారు. ఎటర్నల్ లిమిటెడ్ సంస్థకు చెందిన జొమాటో సంస్థ ఫౌండర్ దీపిందర్ గోయల్. ఈ యంగ్ టెక్ నిపుణుడికి చెందిన స్టార్టప్ సంస్థ రూపొందిస్తున్న గ్యాడ్జెట్ టెంపుల్. ఇది వేరబుల్ డివైజ్.
అంటే, శరీరానికి ధరించే గ్యాడ్జెట్. అలాగని, ఇతర గ్యాడ్జెట్లలాగా చేతి మణికట్టుకు వాచీలాగా లేదా వేలికి ఉంగరంలాగా ధరించే డివైజ్ కాదిది. నుదటిపై, కంటికి, చేవికి మధ్య ధరించే చిన్న గ్యాడ్జెట్. గతంలో పలు మీటింగ్స్‌లలో దీపిందర్ ఈ డివైజ్ ధరించి కనిపించారు. కానీ, దీనిపై ఆయన కానీ, ఆయన సంస్థ కానీ అధికారికంగా వెల్లడించలేదు. కానీ, దేశీయ సంస్థ డెవలప్ చేస్తున్న ఈ డివైజ్‌పై అనేక ఊహాగానాలు చెలరేగాయి. ఇప్పటికి ఈ విషయంలో ఒక స్పష్టత వచ్చింది.
శరీరానికి రక్త ప్రసరణను, మెదడుకు జరిగే రక్త ప్రసరణను, ఆక్సిజన్ స్థాయిని టెంపుల్ డివైజ్ అధ్యయనం చేస్తుంది. సాధారణ, నిరంతర రక్త ప్రసరణతోపాటు వేర్వేరు కార్యకలాపాలు నిర్వహించేటప్పుడు రక్త ప్రసరణ ఎలా ఉంది.. హెచ్చుతగ్గులు ఎలా ఉన్నాయి వంటి అంశాల్ని కూడా ఈ డివైజ్ పరిశీలిస్తుంది. హార్మోన్స్, స్లీప్ యాక్టివిటీ, ఇమ్యూనిటీ, రిపేర్ వంటి అంశాల్ని కూడా ఈ డివైజ్ అధ్యయనం చేసి, సమాచారాన్ని అందిస్తుంది. ఇప్పటికే ఈ డివైజ్‌ను అనేక రకాలుగా పరిశీలించగా విజయవంతమైనట్లు తెలుస్తోంది.
పీవీ సింధులాంటి ప్రముఖులు కూడా పలు సందర్భాల్లో ఈ డివైజ్ ధరించి కనిపించారు. ఈ నేపథ్యంలో త్వరలోనే ఈ డివైజ్ అందుబాటులోకి రానుంది. వచ్చే వారం నుంచి ప్రీ బుకింగ్స్ ప్రారంభం కానుండగా.. ఈ ఏడాది చివరి నుంచి వినియోగదారులకు అందే అవకాశం ఉంది. ఈ టెంపుల్ డివైజ్ ధర రూ.లక్ష లోపు (సుమారు 1,000 డాలర్లు) ఉండే అవకాశం ఉంది. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది.