ఈ సృష్టి రహస్యమే విచిత్రమైనది. భూమిపై కోట్లాది జీవరాశులున్నాయి. ఈ సృష్టిలో మనదే అత్యున్నత స్థానమనీ మురిసిపోతుంటాం. నిజమే, ఆ గొప్ప హోదాతో పాటే ఒక బరువైన బాధ్యత కూడా మన భుజస్కంధాల మీద పడింది. ఆ బాధ్యత కేవలం మన సొంత లీలలకో, మన పొట్ట నింపుకోవడానికో పరిమితం కాదు! ఈ భూమ్మీద మనతో పాటు బతుకుతున్న మూగజీవాల పట్ల, ఆ పచ్చటి ప్రకృతి పట్ల మనం ఎలా ప్రవర్తిస్తున్నాం అనే దానిపైనే మన అసలైన మనిషి తనం ఆధారపడి ఉంది. ఇస్లాం ధర్మం ఈ మూగజీవాల హక్కుల గురించి ఎప్పుడో చెప్పింది. ఖురాన్ గ్రంథం వాటిని సాధారణ వస్తువులుగా కాకుండా, మనలాంటిదే ఒక స్వతంత్ర సముదాయంగా గుర్తిస్తుంది: ‘భూమిపై సంచరించే ఏ జంతువునైనా, గాలిలో రెక్కలతో ఎగిరే ఏ పక్షినైనా చూడండి. ఇవన్నీ మీవంటి జీవరాసులే. వాటి విధి రాత ఉన్న గ్రంథంలో మేము ఏ కొరతా చెయ్యలేదు. తరువాత ఇవన్నీ తమ ప్రభువు వద్ద పోగుచెయ్యబడేవే’ (ఖురాన్ 6:38).
చూశారా? వాటికీ మనలాగే ఒక జీవన గమనం ఉంది. కాకపోతే అవి మనలా మాట్లాడలేవు అంతే! వాటికి ఆలోచించే మేధస్సు లేదు. అంత మాత్రాన వాటిని చులకన చేయవచ్చా? ఆకాశంలో ఎగిరే పక్షులు కావచ్చు, అడవిలో తిరిగే మృగాలు కావచ్చు, ఇండ్లలో పెంచుకునే జీవాలు కావచ్చు… అన్నీ ఆ దేవుణ్ని తమదైన శైలిలో కీర్తిస్తూనే ఉన్నాయి. ప్రవక్త నూహ్ (అలైహిస్సలాం) కాలంలో ఆ మహా ప్రళయం వచ్చినప్పుడు, కేవలం మనుషులను మాత్రమే కాపాడుకోమని ఆనతి రాలేదు; ప్రతి జాతి జంతువు నుండి రెండు జతలను ఆ ఓడ ఎక్కించమని ఆజ్ఞాపించారు. అంటే అర్థం ఏమిటి? ఈ జీవన చక్రంలో ప్రతి ప్రాణీ ఎంతటి కీలకమో ఆలోచించండి!
కానీ, కాలం మారుతున్న కొద్దీ, మనిషి స్వార్థం పెరిగిపోయింది. పశ్చిమ దేశాల్లో ఏదైనా జంతు సంక్షేమం గురించి మాట్లాడితే, కుక్కలు, పిల్లుల గురించే మాట్లాడుతారు. మిగతా పశుపక్ష్యాదులను కేవలం మాంసం ముక్కలుగానో, వేట ట్రోఫీలుగానో చూసే కసాయితనం పెరిగింది. ఇస్లాం మాత్రం దీనికి పూర్తి విరుద్ధంగా బోధిస్తుంది. మనం తినే జంతువులైనా సరే, వాటిని వధించేటప్పుడు కనీస కనికరం ఉండాలి. ఒక జంతువును కేవలం వినోదం కోసం, సరదా కోసం వేటాడటం మహా పాపం. ఎలాంటి సరైన కారణం లేకుండా ఒక చిన్న పక్షిని బలిగొన్నా, రేపు ఆ మూగజీవం దేవుడి ముందు నిలబడి న్యాయం అడుగుతుంది! ఒక వ్యభిచారిణి దప్పికగొన్న కుక్కకు నీళ్లు తాగిస్తే, ఆ ఒక్క చిన్న దయ వల్ల ఆమె పాపాలన్నీ పరిహారమయ్యాయని మనం చదువుతాం. దేవుని దృష్టిలో జీవుల పట్ల చూపించే కరుణ అంతటి గొప్పది. అందుకే ఆధునిక కాలంలో అంతర్జాతీయంగా ‘ఐదు స్వేచ్ఛలు’ అని చెబుతున్న సూత్రాలను మన ఇస్లాం ఎప్పుడో ఏడు వందల సంవత్సరాల ముందే ప్రవచించింది:
ఈ భూమి కేవలం మనుషుల ఒక్కరి సొత్తు కాదు. చెట్లు, చేమలు, పక్షులు, జంతువులు అన్నీ దేవుడు మనకు ఇచ్చిన అపురూపమైన బహుమతులే. ఈ విశాల ప్రపంచంలో మనమొక భాగం మాత్రమే. ఈ సృష్టిని మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటామనేదాన్ని బట్టే మన సంస్కారం ఉంది.