Heart Beat | సాధారణంగా విశ్రాంతి సమయంలో మనిషి గుండె నిమిషానికి 60 నుంచి 100 సార్లు కొట్టుకుంటుంది. అయితే గుండె స్పందనల వేగం నిమిషానికి 60 కంటే తక్కువగా ఉంటే దాన్ని బ్రాడీకార్డియా లేదా నెమ్మదిగా గుండె కొట్టుకోవడం అంటారు. కొంతమందిలో, ముఖ్యంగా క్రీడాకారుల్లో లేదా నిద్ర సమయంలో గుండె వేగం తగ్గడం సహజంగానే ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఇది గుండెలోని విద్యుత్ వ్యవస్థకు సంబంధించిన సమస్యకు సంకేతంగా ఉండే అవకాశం ఉంది. గుండె కొట్టుకునే వేగాన్ని సమన్వయం చేసే విద్యుత్ సంకేతాలు నెమ్మదిగా ఉత్పత్తి కావడం లేదా అవి గుండె ద్వారా సరిగ్గా ప్రయాణించకపోవడం వల్ల బ్రాడీకార్డియా ఏర్పడుతుంది. దీని కారణంగా శరీరంలోని ముఖ్యమైన అవయవాలకు అవసరమైనంత ఆక్సిజన్ కలిగిన రక్తం అందదు.
బ్రాడీకార్డియా ఉన్న ప్రతి ఒక్కరిలోనూ లక్షణాలు కనిపించాల్సిన అవసరం లేదు. అయితే కొందరిలో తీవ్రమైన అలసట, తల తిరగడం, మైకం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, శారీరక శ్రమను తట్టుకునే సామర్థ్యం తగ్గడం లేదా ఒక్కసారిగా స్పృహ కోల్పోవడం వంటి సమస్యలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు రోజువారీ జీవితాన్ని, పనితీరును ప్రభావితం చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా గుండె స్పందనల్లో వచ్చే అసాధారణతలు నిరంతరం కాకుండా అప్పుడప్పుడు మాత్రమే కనిపిస్తే సమస్యను గుర్తించడం మరింత కష్టమవుతుంది. వైద్యుడిని కలిసే సమయానికి గుండె స్పందనలు సాధారణ స్థితికి వచ్చి ఉండడంతో సాధారణ పరీక్షల్లో సమస్య బయటపడదు. ఇలాంటి సందర్భాల్లో ఎక్కువకాలం గుండె స్పందనలను పర్యవేక్షించే పరికరాలు ఉపయోగపడతాయి. శరీరంలో అమర్చే కార్డియాక్ మానిటర్లు కూడా గుండె లయను నిరంతరం పర్యవేక్షిస్తూ, అప్పుడప్పుడు మాత్రమే వచ్చే సమస్యలను గుర్తించడంలో వైద్యులకు సహాయపడతాయి.
గుండె వేగం నిరంతరం తక్కువగా ఉండడంతో పాటు సంబంధిత లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే సమస్యను గుర్తించడం, చికిత్స ప్రారంభించడం ఆలస్యం అవుతంది. వయసు పెరుగుతున్న కొద్దీ గుండెలోని విద్యుత్ సంకేతాలు ప్రయాణించే మార్గాల్లో వచ్చే మార్పులు లేదా ఇతర గుండె సంబంధిత సమస్యలు కూడా బ్రాడీకార్డియాకు కారణమయ్యే అవకాశం ఉంది. అందువల్ల సమస్యను తొలిదశలో గుర్తించడం ద్వారా కారణాన్ని తెలుసుకుని తగిన చికిత్సను నిర్ణయించవచ్చు. ప్రస్తుతం గుండె లయ సమస్యల నిర్ధారణ, చికిత్స, దీర్ఘకాలిక పర్యవేక్షణ కోసం అనేక ఆధునిక సాంకేతికతలు అందుబాటులో ఉన్నాయి. అవసరాన్ని బట్టి పేస్మేకర్ వంటి పరికరాలను ఉపయోగించవచ్చు. ఇవి నెమ్మదిగా కొట్టుకునే గుండెను నియంత్రించడమే కాకుండా, వ్యక్తి అవసరాలకు అనుగుణంగా గుండె స్పందనలను సర్దుబాటు చేసే విధంగా అభివృద్ధి చెందుతున్నాయి.
ఇక శరీరంలో అమర్చే కార్డియాక్ మానిటర్లు అప్పుడప్పుడు మాత్రమే కనిపించే గుండె లయ సమస్యలను గుర్తించేందుకు నిరంతరం పర్యవేక్షణ అందిస్తాయి. రిమోట్ మానిటరింగ్ సాంకేతికత ద్వారా పరికరం, రోగికి సంబంధించిన సమాచారాన్ని వైద్యులకు సురక్షితంగా చేరవేయడం కూడా సాధ్యమవుతోంది. కొత్త తరం గుండె లయ నిర్వహణ పరికరాల్లో మెరుగైన వైర్లెస్ అనుసంధానం, ఎక్కువకాలం పనిచేసే బ్యాటరీ, అధునాతన రోగనిర్ధారణ సదుపాయాలు, ఎంఆర్ఐకి అనుకూలత వంటి ఫీచర్లు అందుబాటులోకి వస్తున్నాయి. అయితే గుండె స్పందన నిమిషానికి 60 కంటే తక్కువగా ఉందని మాత్రమే చూసి అది ప్రమాదకరమని లేదా పూర్తిగా సాధారణమని నిర్ణయించకూడదు. అది శరీర సాధారణ పనితీరును ప్రభావితం చేస్తుందా, సంబంధిత లక్షణాలు ఉన్నాయా అన్నదే ముఖ్యమైన విషయం. కారణం తెలియని అలసట, తల తిరగడం లేదా స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలు పదేపదే కనిపిస్తే వైద్య నిపుణులను సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవడం అవసరమని నిపుణులు చెబుతున్నారు.