ఒకప్పుడు తుపాకీ పట్టి దేశ సరిహద్దులను కాపాడినట్టే ఇప్పుడు నాగలిపట్టి నేలను కాపాడుతున్నారు చిరవేణి నవీన్ కుమార్. పాతికేండ్లపాటు దేశానికి కావలి కాసిన సైనికుడు ఉద్యోగ విరమణ తర్వాత విశ్రాంతి తీసుకోలేదు. దేశానికి అన్నం పెట్టే మట్టితో మమేకమయ్యారు. పంటతో ప్రయోగం చేశారు. జీవనోపాధి కల్పించే వ్యవసాయాన్ని స్వయం సమృద్ధ జీవన విధానంగా మార్చారు. నిజామాబాద్ జిల్లాలోని వడ్డేపల్లిలో నిన్నటి జవాన్, నేటి రైతు నవీన్ అభివృద్ధి చేసిన స్ఫూర్తిమంతమైన సుస్థిరాభివృద్ధి కథ ఇది!
నవీన్ పాతికేండ్ల క్రితం సైన్యంలో చేరారు. కఠోరమైన శిక్షణ పొందారు. దేశ రక్షణకు దీక్షబూనారు. సుబేదార్ మేజర్‌గా పదోన్నతి పొందారు. ఏడాది క్రితం ఉద్యోగ విరమణ తీసుకున్నారు. రిటైర్మెంట్ తర్వాత విశ్రాంత జీవితాన్ని కోరుకోలేదు. పట్నంలో పెద్ద బంగళానో, నగరంలో విలాసవంతమైన విల్లానో కొనుక్కుని సుఖమయ జీవితాన్ని గడపాలనుకోలేదు. స్వగ్రామమైన వడ్డేపల్లిలోనే ఉండాలనుకున్నారు. తన వ్యవసాయ క్షేత్రంలో కొత్త జీవితాన్ని మొదలుపెట్టారు. ‘నేను నిరుపేద కుటుంబంలో పుట్టాను. అందువల్ల అమ్మతో కలిసి వ్యవసాయ కూలి కోసం పంట చేలో అడుగుపెట్టాను. కొద్దిగా పెద్దయ్యాక మా పక్క ఊళ్లు ఎడపల్లి, ధర్మారం, జైతాపూర్‌లో కూరగాయలు అమ్మాను. ఇల్లిల్లూ తిరిగి పాలు పోశాను. న్యూస్ పేపర్ వేశాను. సైన్యంలో చేరిన తర్వాత సంపాదించిన డబ్బుని అమ్మకు పంపాను. అమ్మ పొదుపు చేసి ఈ భూమి కొన్నది’ అని తన ప్రయాణంలో ఒడుదొడుకులు పంచుకున్నారు నవీన్ కుమార్.
నవీన్ పొలం అందరి వ్యవసాయ క్షేత్రాల్లా కనిపించదు. ఒక పక్క వరి… దానిపక్కనే కూరగాయల తోట.. ఆ చెంతనే బొబ్బర్లు, పెసర్ల వంటి పప్పుదినుసుల పంటలు.. అధిక పోషకాలతోపాటు అధిక లాభాలిచ్చే మునగ పంట మరో చోట ఉంది. ఈ పంట చేల చుట్టూ ఉద్యానవనాలు కనిపిస్తాయి. వాటి చుట్టూ అడవి చెట్లు ఏపుగా పెరుగుతున్నాయి. కొబ్బరి, టేకు, వేప చెట్లతో ఈ వ్యవసాయ క్షేత్రం ఎంతో వైవిధ్యంగా ఉంటుంది. ఇంత అద్భుతంగా మొదలుపెట్టిన వ్యవసాయ పరిశోధనా క్షేత్రాన్ని బంతిపూల తోట శోభాయమానంగా మార్చింది.

వ్యవసాయ భూమికి నీటి సదుపాయం కోసం కుంటలు తవ్వించారు నవీన్. ఆ నీటి వనరుల్లో చేపల పెంపకం చేపట్టారు. పశుపోషణతో పాడి ఉత్పత్తులే కాదు, సేంద్రియ ఎరువుని ఉత్పత్తి చేసుకున్నారు. వ్యవసాయ వ్యర్థాలను వనరులుగా మార్చుకుని ఖర్చులేని సాగుబాటలో నడుస్తున్నారు. తన క్షేత్రంలో పండే నూనె గింజలతో గానుగ ఆడించేందుకు చిన్న వ్యవసాయ అనుబంధ పరిశ్రమను నడిపిస్తున్నారు. భారీ పెట్టుబడిపై ఆధారపడకుండా తన వ్యవసాయ క్షేత్రంపైనే ఆధారపడే ఖర్చులేని సుస్థిర వ్యవసాయం వైపు అడుగులేశారు. నీటి వనరులు, చేపల పెంపకం, పశు పోషణ, సేంద్రియ ఎరువులు, కూరగాయలు, నూనె ఉత్పత్తి, ఫుడ్ ప్రాసెసింగ్‌ని ఒకదానికి మరొకటి అనుసంధానమయ్యేలా తన వ్యవసాయ క్షేత్రాన్ని తీర్చిదిద్దారు. మొత్తంగా ‘సమీకృత సాగు విధానం’ అభివృద్ధి చేశారు.
ప్లాస్టిక్ లేకుండా మార్కెట్ నడవడం లేదు. ఎంత ప్రయత్నించినా ప్లాస్టిక్ మట్టిలోకి కలవకుండా ఆపలేకపోతున్నాం. ప్లాస్టిక్ గురించి నష్టాలు ఎన్నో తెలుసు. ఆచరణ లేని మాటలతో ఫలితం లేదు. మేలైన ఫలసాయాన్ని కోరుకునే నవీన్ ప్లాస్టిక్‌ని సాగుకు అనుకూలంగా మలుచుకున్నారు. తీగజాతి మొక్కల పెంపకానికి ప్లాస్టిక్ క్యాన్లు, బాటిల్స్‌ని ఉపయోగించుకొని తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలు పెంచుతున్నారు. నీటి వసతికి అనుకూలంగా ఒకే (స్తంభానికి) చోట ఉండే ప్లాస్టిక్ డబ్బాల్లోని వేర్వేరు తీగజాతి మొక్కలు పలు దిక్కులకు విస్తరిస్తూ పెరుగుతున్నాయి. ఈ నిర్మాణం వల్ల నీటి యాజమాన్యం సులభం. నీరు వృథా కాదు. ఇది కేవలం ఖర్చు తగ్గించే ఆలోచనే కాదు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యర్థాల నిర్వహణకు ఆచరణ యోగ్యమైన విధానం.

అమ్మబోతే అడవిలాంటి మార్కెట్లో ఎన్ని బాధలో! ధర లేక రైతు కష్టం నేలపాలైన వార్తలు రోజూ చదువుతూనే ఉన్నాం. అనువుగాని చోట అధికులం అనరాదన్నట్టు ధరలేని చోట అమ్మకానికి పోరాదని చెబుతారు నవీన్. రైతు పంట పండిస్తేనే సరిపోదంటారు ఆయన. వ్యవసాయంలో పంట పండించడం ఒక దశ అని, దానికి విలువ జోడించిడం మరో దశ అని, ఈ రెంటిడినీ అనుసంధానం చేస్తేనే సాగు లాభసాటిగా ఉంటుందంటారు నవీన్. ధాన్యాన్ని నిల్వ చేసినట్టుగా కూరగాయలను నిల్వ చేయడం సులువు కాదు. రవాణా కూడా కష్టమే. అందుకే, పంట పండినా రైతు కలలు పండవు! ఈ సమస్యను అధిగమించేలా పండించే పంట నుంచి అనుబంధ ఉత్పత్తుల తయారీకి ప్రాంగణంలోనే అనేక యూనిట్లను ఏర్పాటు చేసుకున్నారు. అధిక దిగుబడి కోసం సాగు చేయడంతోపాటు ఆ పంటను నిల్వ చేసుకునే పద్ధతులు నేర్చుకున్నారు.
పండించిన పంటను దాచుకోలేక, అమ్ముకోలేక దళారుల చుట్టూ తిరిగి దగా పడకూడదనుకున్నారు. పంటను ఆరబెట్టుకుని రేపటి కోసం నిల్వ చేసుకునేందుకు సోలార్ డ్రైయర్‌ని వ్యవసాయ క్షేత్రంలోనే ఏర్పాటు చేసుకున్నారు. సంప్రదాయ పద్ధతిలో చేపట్టిన సేంద్రియ వ్యవసాయానికి ఆధునిక పద్ధతులు జోడించారు. వ్యవసాయ క్షేత్రంలో పంటలు, కూరగాయలు వంటి వ్యవసాయ ఉత్పత్తులను ఎండబెట్టి నిల్వ చేసుకోవడానికి సౌరశక్తిని ఉపయోగించేలా సోలార్ డ్రైయర్‌ను ఏర్పాటు చేసుకున్నారు. బెండ, మునగాకు, కాకర, టమాటా వంటి కూరగాయలను వరుగులుగా మార్చుకోవడానికి సాధారణంగా ఎండలో ఆరబెడతారు.
ఈ ప్రక్రియలో కూరగాయల్లోని పోషకాలు తగ్గుతాయి. పైగా దుమ్ము చేరడం, బ్యాక్టీరియా సంక్రమించడంతోపాటు పూర్తి స్థాయిలో తేమను తొలగించలేరు. ఎక్కువ రోజులపాటు ఎండబెట్టాల్సి వస్తుంది. మబ్బులు కమ్మినా, వాన కురిసినా ఆరబెట్టడం కుదరదు. అందుకే ఈ విధానంలో ఆహారం పాడవుతుంది. ఇలాంటి నష్టాలు లేకుండా కోసిన కూరగాయల్లోని తేమను సోలార్ డ్రైయర్ ద్వారా తొలగిస్తున్నారు. ఈ విధానంలో వరుగుల్లోని పోషకాలు తగ్గవని, రంగు మారదని చెబుతున్నారు. ఇలా తయారు చేసుకోవడం వల్ల ఎక్కువ కాలం నిల్వ చేసుకోవచ్చు. మార్కెట్లో ధర ఉన్నప్పుడే అమ్ముకోవచ్చు. కాబట్టి రైతుకి కష్టానికి తగ్గ ఫలమే కాదు లాభమూ దక్కుతుంది.
రైతు అంటే పంటను పండిచేవాళ్లే కాదు పాడిని అందించేవాళ్లు కూడా. అందుకే మన మాటల్లో పాడిపంటలే దొర్లుతాయి. పాడి లేకుండా పంట లేదు. పంట లేకుండా పాడి మనలేదు. పాడిలేని పంట ఉన్నా, పంటలేని పాడి ఉన్నా.. అసంపూర్ణమే! సాగు సాఫీగా సాగాలంటే సాళ్లలో నీళ్లు పారినట్టే రైతు ఇంట పాలధారలూ పారాలి. జోరుగా ఉరికే జోడెడ్లే రైతు చేతికి చేదోడు కావాలంటే ఆలమందల్ని పెంచాలి. ఆ పశు సంపద ఇచ్చే పాడి రైతుకు రెండో ఆదాయ మార్గం. పాలు, పెరుగు, వెన్న పంట చేతికొచ్చేదాకా సన్నకారు రైతుకు చేతి ఖర్చుల అవసరాలు తీరుస్తాయి. ఇక పాడి పరిశ్రమను పెద్దది చేసుకుంటే జేబులు నిండుతాయి. అదనపు ఆదాయమే కాదు వ్యవసాయం బాగుండాలన్నా పశుసంపద ఉండాల్సిందేనని నవీన్ చెబుతున్నారు.
భూసారం పెంచే కంపోస్ట్ ఎరువు, తెగుళ్లను నివారించే కషాయాలు తయారు చేయాలంటే పేడ, గోమూత్రం కావాల్సిందే. రైతు లేనిదే దేశానికి బువ్వలేదన్నది ఎంత నిజమో. పశువు లేనిదే రైతుకు లాభం రాదన్నది కూడా అంతే సత్యం. కాబట్టి తన వ్యవసాయ క్షేత్రంలో చిన్న డెయిరీ యూనిట్‌ని ఏర్పాటు చేసుకున్నారు. 11 ఆవులు, రెండు బర్రెలతో నిర్వహిస్తున్న యూనిట్ నుంచి రోజుకు 15 నుంచి 20 లీటర్ల పాల ఉత్పత్తి జరుగుతున్నదని, పశువులకు గ్రాసం ఇక్కడే పెంచడం వల్ల నిర్వహణ వ్యయం తక్కువ కావడంతో మంచి లాభం వస్తున్నదని నవీన్ చెబుతున్నారు. పశువుల పేడ, మూత్రం సేకరించి సేంద్రియ సాగులో సస్య రక్షణకు ఉపయోగించే జీవామృతం తయారు చేస్తున్నారు. ‘బ్రహ్మాస్త్రం’ పేరుతో మరో సేంద్రియ సస్యరక్షణ ద్రావణాన్ని రూపొందిస్తున్నారు.

రెండు లక్షల రూపాయలతో గానుగ నూనె యూనిట్‌ని ఏర్పాటు చేసుకున్నారు. నూనె గింజలు సాగు చేసి, వాటిని మార్కెట్లో అమ్మేందుకు ఆపసోపాలు పడకుండా నూనె తీస్తున్నారు. నేరుగా స్థానికులకు అమ్ముతూ ఆదాయాన్ని పెంచుకున్నారు. ఇందువల్ల ప్రజల్లో ఆరోగ్యంపట్ల, కల్తీలేని ఆహారం గురించి అవగాహన కల్పిస్తున్నారు. తన వ్యవసాయ క్షేత్రంలో ఆయిల్ ఫామ్ సాగు చేపట్టారు. మరో ఏడాదిన్నరలో గెలలు చేతికి వస్తే పెద్ద మొత్తంలో నూనె ఉత్పత్తి చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ వ్యవసాయ క్షేత్రాన్ని ఎప్పుడో వచ్చే లాభాల కోసం ఎదురు చూడకుండా తాత్కాలిక, స్వల్పకాలిక, దీర్ఘకాలిక లాభాలు వచ్చేలా ఆహార పంటలు, కూరగాయలు సాగు చేస్తూనే ఉద్యానవనం, అటవీ వృక్షాలు పెంచుతున్నట్టు ఆయన చెబుతున్నారు.
పాతికేండ్ల పాటు సైనిక విధుల్లో అలవడిన క్రమశిక్షణ ఈ రైతు జీవితంలోనూ సడలలేదు. దేశాన్ని ప్రేమించినంతగా మట్టిని ప్రేమించారు. పంటకు కాపు కాయడం దేశానికి రక్షణగా నిలవడం ఒకటే అన్నంత పట్టుదలతో సాగుబాటలో శ్రమిస్తున్నారు నవీన్. రైతు విత్తనం నాటి, పంట పండించి, మార్కెట్లో అమ్మకందారు మాత్రమే కాదంటున్నారాయన. ఉత్పత్తిదారుగా, ఫుడ్ ప్రాసెసర్‌గా, పశుపోషకుడిగా, చేపల పెంపకం దారుగా, సేంద్రియ ఎరువుల తయారీదారుగా, వ్యవసాయ అనుబంధ ఉత్పత్తుల రూపకర్తగా రైతు మారాలంటున్నారు. అలా మారినప్పుడే రైతుకు లాభం.. నేలకు మేలు.. సమాజానికి ఆరోగ్యం దక్కుతాయని నవీన్ మిగతా రైతులకు పిలుపునిస్తున్నారు. జై కిసాన్ అంటున్న ఈ జవాన్‌కి మనమూ జై కొడదాం!
ఏ పంట పండిస్తే ఎక్కువ లాభాన్ని ఇస్తుందని ఆలోచించకుండా, ఏ పంట పండిస్తే నేలకు మేలు జరుగుతుందో ఆ పంటలే పండించాలనుకున్నారు నవీన్. తనకున్న 22 ఎకరాల వ్యవసాయ భూమిని ప్రయోగశాలగా మార్చారు. పశుపోషణ, చేపల పెంపకం, సేంద్రియ ఎరువుల తయారీ, కూరగాయల సాగు, నూనె ఉత్పత్తి, ఆహార పదార్థాల ప్రాసెసింగ్ ఇలా వ్యవసాయానికి సంబంధించిన అనేక అంశాలను ఒకే క్షేత్రంలోకి తీసుకు వచ్చారు. నవీన్ పొలం ఇప్పుడు ప్రయోగశాలగా, ఆదర్శ రైతులకు అవగాహన కేంద్రంగా, వ్యవసాయ విద్యార్థులకు పాఠంగా మారింది!
ఏడాది కాలంలో ఎన్ని ప్రయోగాలో! ఇంతపెద్ద ప్రయత్నం కష్టసాధ్యమే. కానీ, ఇష్టపడితే ప్రకృతికి అనువైనది ఏదైనా సాధ్యమేనని నవీన్ నిరూపించారు. పంటల వైవిధ్యం సాగుకు అనుకూలమైనది. వైజ్ఞానికంగా నిరూపితమైనది. రైతుకు లాభదాయకమైనది. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా రైతుకు నష్టం రాదు. అందుకే ఒకే పంటపై ఆధారపడకుండా బహుళ పంటల వైపు నవీన్ అడుగులేశారు. ఈ పంటల వైవిధ్యానికి వ్యవసాయ అనుబంధ పరిశ్రమలను జోడించారు. జోడెద్దుల బండి జోరుగా పరుగు తీసినట్టు సాగుబడిలో దిగుబడి, అనుబంధ పరిశ్రమల్లో రాబడి నవీన్‌ని ప్రత్యేకంగా నిలబెట్టాయి.

వాన నీటిని ఒడిసి పట్టేందుకు ఈ వ్యవసాయ క్షేత్రంలో మూడు కుంటలను తవ్వించారు. చెరువులను తలపించేలా ఉన్న ఈ కుంటలు వానాకాలమంతా నిండు కుండల్లా ఉంటాయి. వీటి వల్ల భూగర్భజలాలు పెరుగుతాయి. కాబట్టి ఇక్కడ పెరిగే ఉద్యానవనంలో కొబ్బరి, మునగ చెట్లకు, అటవీ చెట్లకు ఈ కాలంలో నీళ్లు పోయాల్సిన అవసరం ఉండదు. వానలు పోయిన తర్వాత మోటార్లతో ఈ నీటిని కూరగాయలు, ఉద్యానపంటలకు ఉపయోగిస్తారు. ఈ వ్యవసాయ క్షేత్రంలో అయిదు బోర్లు ఉన్నా వాటిని వినియోగించకుండానే నీటి యాజమాన్యం నిర్వహిస్తున్నారు. కుంటల్లో నీటిని సాగుకే కాదు చేపల పెంపకానికీ ఉపయోగిస్తున్నారు. ఈ విధానం వల్ల సాగుకు యోగ్యమైన నేల వృథాగా పోదు. నీటి వనరుల్ని ఉపయోగించుకోవడానికి అదనపు ఖర్చు కూడా లేదు.
స్వాతంత్య్ర దినోత్సవం రోజున అందరూ ‘జై జవాన్.. జై కిసాన్’ అంటూ నినాదాలు చేస్తారు. ఆ తర్వాత రోజు మర్చిపోతారు. నేను ఒక జవాన్.. కిసాన్‌గా మారితే ఎలా ఉంటుందో చూపించాలని ప్రతి స్వాతంత్య్ర దినోత్సవం రోజున అనుకునేవాడిని. రిటైర్ అయిన తర్వాత వ్యవసాయం చేయాలని ఊరికి వచ్చాను. రిటైర్మెంట్ విశ్రాంతి కాదు. కొత్త బాధ్యతకు ఆరంభమని నమ్ముతాను. సైన్యంలో చేరినప్పుడు దేశాన్ని కాపాడటం బాధ్యత. రిటైర్ అయిన తర్వాత అదే బాధ్యతకు మరో రూపం ఇచ్చాను. సరిహద్దుల్లో దేశాన్ని కాపాడాను. ఇప్పుడు నేలని, ప్రకృతిని కాపాడుతున్నాను. ఇప్పుడు నా చేతిలో దేశాన్ని కాపాడే ఆయుధం లేదు. ఆలోచనే ఉంది. దానికి ఆచరణ రూపమే నా వ్యవసాయ క్షేత్రం.
– చిరవేణి నవీన్ కుమార్, (విశ్రాంత హానరీ కెప్టెన్/ సుబేదార్ మేజర్)
తన వ్యవసాయ భూమిలోనే మల్టీ పర్పస్ గోదామును నిర్మించారు నవీన్. పంట కోతకు వచ్చినప్పుడు కాపాడుకోవడం ఎంతో కీలకం. చేతికొచ్చిన పంటను ఆరబెట్టడం ఎంత ముఖ్యమో, అకాల వర్షాల పాలుకాకుండా కాపాడుకోవడం ఆవశ్యకం. నిల్వ చేసుకోవడం మరో అవసరం. ఇవన్నీ తీరాలంటే రైతుకు గోదాముల అవసరం ఉంది. తన క్షేత్రంలోనే ఓ విశాలమైన గోదామును నిర్మించారు. కోతల సీజన్ పూర్తయ్యాక ఇదే గోదామును ఫంక్షన్ హాల్‌గా ఉపయోగిస్తున్నారు. ముహూర్తాల వేళ పెండ్లిళ్లతో, పంటల సీజన్లో ధాన్యంతో ఈ గిడ్డంగి కళకళలాడుతూ ఉంటుంది. తక్కువ మొత్తానికే ఫంక్షన్‌హాల్ అద్దెకు ఇస్తున్నారు.
పెండ్లిళ్లకు హాజరయ్యే అతిథులకు తమ వ్యవసాయ క్షేత్రమంతా చూపుతూ శాస్త్రవేత్తగా మారిపోతారు నవీన్. తన అనుభవాలు చెబుతూ… రైతులకు లాభాల బాట చూపుతున్నారు. ఫీల్డ్ స్టడీ కోసం వచ్చే వ్యవసాయ శాస్త్ర (బీఎస్సీ అగ్రికల్చర్) విద్యార్థులకు ఈ గోదామే తరగతి గదిగా మారుతుంది. తన క్షేత్రంలో చేసిన ప్రయోగాలను ఇక్కడ పాఠాలుగా చెబుతారు. రైతుల కోసం వ్యవసాయ, ఉద్యాన శాఖలు నిర్వహించే సమావేశాలూ ఈ హాల్లోనే జరుగుతాయి. వ్యవసాయ అవసరాల కోసం నిర్మించిన ఈ గోదాం మల్టీపర్పస్ హాల్‌గా వినియోగపడుతుండటం విశేషం.
– నేలతల్లి మేలు కోరి
…? జూపల్లి రమేష్, నిజామాబాద్ఫొటోలు: నీరడి శ్రీనివాస్