సూపర్ క్లీనర్: కిచెన్ ప్లాట్ఫాం, అద్దాలు, తలుపులు, కిటికీల్లాంటివి తుడిచేందుకు క్లీనర్ అవసరం. కాసిన్ని నారింజ తొక్కల్ని గాజు సీసాలో వేసి మునిగేదాకా వెనిగర్ పోసి రెండు వారాలుంచి, చెక్కులు తీసేయాలి. ఇందులో నీళ్లు కలిపి స్ప్రే బాటిల్లో పోస్తే మంచి క్లీనర్ సిద్ధమైపోతుంది.
రూమ్ ఫ్రెష్నర్: ఇంట్లోకి రాగానే సువాసన రావాలి, అది కెమికల్ ఫ్రీగా ఉండాలి అనుకుంటే నారింజ తొక్కల్ని గుర్తు చేసుకోండి. పొయ్యి మీద కొన్ని నీళ్లు పెట్టి అందులో నారింజ తొక్కలు, దాల్చిన చెక్క, లవంగాలు వేసి మరిగిస్తే ఇల్లంతా ఫ్రెష్ఫ్రెష్ వాసన పరిమళిస్తుంది.
కీటకాలు దూరం: మొక్కల్ని చుట్టుముట్టే సన్నటి పురుగులు, కీటకాలు, చీమల్లాంటి వాటి బెడద నుంచి తప్పించుకోవాలంటే ఎండిన లేదా తాజా నారింజ చెక్కును మొక్క మొదట్లో కొద్దిగా మట్టి తీసి కప్పి పెట్టాలి. చాలా పురుగులు ఈ ఘాటైన పుల్లని వాసనను ఇష్టపడవు కనుక అవి చెట్ల దగ్గర నివాసం ఏర్పరచుకోవు.