‘విప్లవాల యుగం మనది..విప్లవిస్తే జయం మనది’ అని నినదిస్తూ 19వ శతాబ్ది నుంచి 20 శతాబ్దం చివరి దశకం దాకా సాగిన వామపక్ష ఉద్యమాలు చల్లబడ్డాయి. సర్వే సర్వత్రా స్తబ్దత ఏర్పడింది. ఆ శూన్యతలో దేశదేశాల్లో తీవ్ర జాతీయవాదం ముసుగుతో కార్పొరేట్ ఆధిపత్యానికి కొమ్ముకాసే తిరోగామి ప్రభుత్వాలు పుట్టుకు వచ్చాయి. ఊకదంపుడు ఉపన్యాసాల సాంప్రదాయిక రాజకీయ యంత్రాంగాలు అలసి సొలసి మూలకు చేరాయి. ఇక్కడే.. ఈ శూన్యంలో నుంచే పుట్టిన బొద్దింకలు బిలబిలమంటూ బయటకు వస్తున్నాయి.
తమకు ఎదురే లేదని విర్రవీగే నిరంకుశ ప్రభుత్వాలకు దడ పుట్టిస్తున్నాయి. చెమటలు పట్టిస్తున్నాయి. ఓ వైపు మనదేశంలో కేంద్రమంత్రిని గద్దె దించగలిగిన విద్యార్థి కిశోరాలు ఇప్పుడు వివాదాస్పద సీఈసీని ఇంటికి పంపేందుకు కదం తొక్కుతుండటం మనం చూస్తున్నాం. ఇదే తరహాలో తాజాగా ప్యారిస్‌లోనూ యువజనులు వీధుల్లోకి వచ్చి ఫ్రెంచ్ సర్కార్ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. రాజధాని ప్యారిస్ మొదలుకుని అన్ని చిన్నాపెద్దా నగరాలు ప్రదర్శనలు, ఊరేగింపులతో దద్దరిల్లుతున్నాయి. ఫ్రాన్స్‌లో విద్యారంగ సంక్షోభం యు వత ఆగ్రహానికి ప్రధాన కారణం.
పాఠశాలలు, విశ్వవిద్యాలయాల్లో తరగతి గదులు కిక్కిరిసిపోవడం, ఉపాధ్యాయులు, సిబ్బంది కొరత, పైకప్పులు కారడం, భవనాలు దెబ్బతినడం వంటి మౌలిక సమస్యలు విద్యార్థుల్లో తీవ్ర అసంతృప్తిని రేకెత్తిస్తున్నాయి. ఇది భారత్‌లో సీజేపీ చేపట్టిన బడుల సంస్కరణ ఆందోళన ఈ సందర్భంగా మనకు సహజంగానే గుర్తుకురాక మానదు. అయితే ఫ్రాన్స్‌లో ఆందోళనలు కేవలం విద్యార్థి యువజనులకే పరిమితం కాలేదు. అటు పబ్లిక్‌రంగ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అగ్నిమాపక సిబ్బంది, సివిల్ సర్వెంట్లు కూడా వీధుల్లోకి వచ్చి జీతాలు, ధరల పెరుగుదలపై ఉద్యమిస్తున్నారు.
ఇంకా పోలీసులకు స్వీయరక్షణ పేరుతో కర్కష అధికారాలు కట్టబెట్టేందుకు చట్టపరంగా జరిగిన ప్రయత్నం పెద్ద ఎత్తున వ్యతిరేకతకు దారితీసింది. విమర్శకులు దీనిని ‘లైసెన్స్ టు కిల్’గా అభివర్ణిస్తున్నారు. మరో యూరప్ దేశమైన స్పెయిన్‌లో గృహ సంక్షోభం చిలికిచిలికి గాలివానగా మారి మధ్యంతర ఎన్నికలకు దారితీయడం ప్రజోద్యమాల పరంపర దావానలంలా వ్యాపించడానికి మరో ఉదాహరణగా నిలుస్తున్నది. ఇండ్ల అద్దెలు తగ్గించేందుకు పెడ్రో సాంచెజ్ నేతృత్వంలోని సోషలిస్టు ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టం పార్లమెంటులో మితవాద పార్టీల సహాయ నిరాకరణ వల్ల వీగిపోవడంతో సంక్షోభం తీవ్రమైంది. ఓ వృద్ధురాలిని ఇంటి నుంచి ఖాళీ చేయించడంపై పెల్లుబికిన ప్రజాగ్రహం సార్వత్రిక సమ్మెకు పిలుపు నివ్వడం వరకు పోవడం గమనార్హం.
అమెరికా నుంచి యూరప్ వరకు, ఆసియా నుంచి ఆఫ్రికా వరకు యువత వీధుల్లోకి రావడం అనేది ఒక ధోరణిగా ముందుకు వస్తుండటం కనిపిస్తున్నది. ఈ తరహా ప్రజా నిరసనలు సామాజిక అసమానతలు, నిరుద్యోగం వంటి సమస్యల సమిష్టి ఫలితంగా ఉద్భవించాయి. లోతుగా పరిశీలిస్తే, వీటివెనుక యువతకు వ్యవస్థలపై నమ్మకం క్షీణించడం ప్రధాన కారణంగా వ్యక్తమవుతున్నది. యువతలో ఈ ఆగ్రహానికి ముఖ్య కారణం భవిష్యత్తుపై అనిశ్చితి. వాతావరణ మార్పులు, యుద్ధాలు, ఆర్థిక అస్థిరత అన్నీ కలిసి ఒక నిరాశాజనక దృశ్యాన్ని ఆవిష్కరిస్తున్నాయి. తమ భవిష్యత్తు సురక్షితం కాదనే భావన యువతను తీవ్రంగా వేధిస్తున్నది. విద్య పూర్తయ్యాక ఉద్యోగ భద్రత లేకపోవడం, జీవన వ్యయం పెరుగడం, అవకాశాలు కొద్దిమందికే పరిమితమవడం వంటి అంశాలు యువతను ఆవేదనకు గురిచేస్తున్నాయి.
సంప్రదాయ రాజకీయాలు ప్రజల సమస్యలకు సమాధానం ఇవ్వలేకపోతున్నాయనే భావన క్రమంగా బలపడుతున్నది. ఎన్నికల సమయంలో ఇచ్చే హామీలు, అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు కాకపోవడం యువతలో అసహనాన్ని పెంచుతున్నది. ఫలితంగా, రాజకీయ పార్టీలు, నాయకులను పక్కన పెడుతూ, ప్రజలే నేరుగా వీధుల్లోకి వచ్చి తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇందులో యువత అగ్రగామిగా నిలువడం సహజంగానే జరుగుతున్నది. ఈ ఆందోళనలను ప్రజాస్వామ్యానికి ఒక హెచ్చరికగా చూడాలి. ప్రభుత్వాలు కేవలం నియంత్రణ చర్యలతో కాకుండా, మూల కారణాలను పరిష్కరించే దిశగా అడుగులు వేయాలి. కొత్తతరం స్వరం మారుతున్నది. ఆ స్వరాన్ని వినడం, అర్థం చేసుకోవడం, సరైన మార్పులు తీసుకురావడం ప్రభుత్వాల బాధ్యత. లేకపోతే, కాక్రోచ్ ఫినామెనా మరింతగా విజృంభించి, సంప్రదాయ రాజకీయ వ్యవస్థల పతనానికి, తద్వారా అరాచకత్వానికి దారితీసే ప్రమాదమున్నదని గుర్తుంచుకోవాలి.