హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్‌లో అండర్ గ్రౌండ్ కేబుల్ ప్రాజెక్టులో వెయ్యికోట్ల దోపిడీకి స్కెచ్ వేసిన మినిస్టర్ టెన్ పర్సెంట్‌తో పాటు దక్షిణ డిస్కమ్ కీలక అధికారుల వ్యవహారంపై ‘నమస్తే తెలంగాణ’లో మంగళవారం ప్రచురితమైన ‘కరప్షన్ కేబుల్.. పైసా వసూల్’ కథనం సంచలనం సృష్టించింది.
దీనిపై డిస్కమ్‌తో పాటు రాష్ట్రంలోని విద్యుత్తు సంస్థల్లో చర్చ జరిగింది. హైదరాబాద్‌లో యూజీ కేబుల్ ప్రాజెక్టు తరహాలోనే వరంగల్లోనూ అండర్‌గ్రౌండ్ కేబులింగ్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ కథనం విద్యుత్తు వర్గాల్లో చర్చనీయాంశమైంది. అసలు మినిస్టర్ టెన్‌పర్సెంట్ రెండేండ్లుగా నగరంలో జరుగుతున్న పలు పనులకు అడ్డు పడుతున్నారని, ప్రధానంగా కేబుల్ టెండర్లలో తన పర్సంటేజీ దక్కని పరిస్థితుల్లో ఆ పనులను నిలిపివేసి డీటీఆర్‌లతో పాటు పలు సామగ్రి కొనుగోళ్లలో కమీషన్లు దండుకున్నారంటూ మింట్ కాంపౌండ్‌లో చర్చ జరిగింది.
అంచనాలు పెంచి కమీషన్ల రూపంలో వేయి కోట్లు దోపిడీ చేయడానికి వేసిన స్కెచ్‌ను ‘నమస్తే తెలంగాణ’ బట్టబయలు చేయడంతో ఈ వ్యవహారంపై సదరు మినిస్టర్ టెన్ పర్సెంట్ గుర్రుగా ఉన్నట్టు తెలిసింది. అసలు విషయం ఎలా లీకయిందంటూ సంబంధిత విభాగాలకు చెందిన అధికారులను తన సిబ్బంది ద్వారా ఆరా తీయించారు.
కొందరు కాంట్రాక్టర్లతో కూడా వారు మాట్లాడినట్టు తెలిసింది. ఇదిలా ఉంటే ‘గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు’ మినిస్టర్ టెన్ పర్సెంట్‌తో పాటు డిస్కమ్‌కు చెందిన మరో ఇద్దరు కీలక వ్యక్తులు ఈ కథనంపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ ఇదంతా తప్పంటూ సన్నిహితులతో అన్నారని, డిస్కమ్ డైరెక్టర్లను కూడా ఈ కథనంపై వారేమైనా సమాచారం లీక్ చేశారా? అంటూ ఆరా తీశారని సమాచారం. దీనిపై సీఎండీతో మరోసారి విలేకరుల సమావేశం పెట్టించి వివరాలు చెప్పిస్తూ ఖండన ఇప్పిద్దామని ప్రయత్నించగా ఈ మొత్తం కథనం రావడానికి సీఎండీ జితేష్ పాటిల్ ఇటీవల ప్రెస్మీట్లో చేసిన వ్యాఖ్యలే బలమైన ఆధారంగా నిలిచాయని ఆ కీలక పోస్టులో ఉన్న వ్యక్తి మినిస్టర్ సిబ్బందికి చెప్పినట్టు సమాచారం.
అసలు టెండర్ అంచనాల్లో ఎందుకు తేడా చేశారు? కేవలం ఎనిమిది నెలల్లోనే అంత భారీగా వ్యయం పెంచడానికి కారణాలేందంటూ విద్యుత్తు రంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా టెండర్ రూపకల్పన సమయంలో ఉన్న కీలక అధికారిని ఎందుకు బదిలీ చేశారని, కొనుగోళ్లకు సంబంధించిన విభాగమైన పీ అండ్ ఎంఎంకు ఎందుకు అవకాశం లేకుండా ప్రాజెక్ట్స్ విభాగమే టెండర్‌కు సంబంధించిన మొత్తం సామగ్రి కొనుగోళ్లు చేసేలా ఎలా అనుమతులు ఇచ్చారంటూ రిటైర్డ్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. దేశంలో ఇప్పటివరకు జరిగిన యూజీ ప్రాజెక్టుల్లో బెంగళూరులో జరిగిన యూజీ కేబులింగ్ అవకతవకలపై కాగ్ అభ్యంతరాలు వ్యక్తంచేసింది. ఇదే ప్రాంతంలో జరిగిన ప్రాజెక్టును మోడల్‌గా తీసుకొని హైదరాబాద్‌లో చేయడానికి అధికారులు నిర్ణయించడంపై కూడా రిటైర్డ్ అధికారుల నుంచి వ్యతిరేకత వస్తున్నది. కాగా కాంట్రాక్టర్లు సైతం ఉదయం నుంచే ఈ వార్తను సోషల్‌మీడియాలో ట్రోల్ చేస్తూ తమకు అవకాశాలు దక్కకుండా చేసిన ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
దక్షిణ డిస్కమ్ ప్రజాసంబంధాల విభాగం మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. అందులో యూజీ కేబులింగ్ ప్రాజెక్టుకు మొదటగా రూ.4,051 కోట్ల పరిపాలనా అనుమతి మంజూరైందని, అప్పటి షెడ్యూల్ ఆఫ్ రేట్స్ ఆధారంగా రూపొందించిన ప్రాథమిక ప్రణాళిక అంచనా మాత్రమేనంటూ పేర్కొన్నది. ఈ మేరకు తాము చేస్తున్న ప్రాజెక్టు విషయంలో రూట్వారీ సర్వేలు, క్షేత్రస్థాయి పరిశీలనలు, ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల ఆధారంగా రూపొందించిన డీపీఆర్ విలువ రూ.5,756 కోట్లుగా నిర్ణయించినట్టు తెలిపింది.
డీపీఆర్‌లో అన్ని అంశాలు 2026-27 ప్రకారం అంచనా వేశామని, 2018-19 తర్వాత సవరించని తవ్వకాల రేట్ల స్థానంలో ప్రస్తుత రేట్లు వర్తించినట్టు తెలిపింది. రూ.486 కోట్లు సామగ్రి ధరల పెరుగుదలలో వ్యత్యాసం కాగా రూ.1,219 కోట్ల వ్యయసవరణ రోడ్డు పునరుద్ధరణ పనుల్లో హెచ్డీడీ సాంకేతికత అంశాల వాడకానికి సంబంధించినవిగా పేర్కొన్నది. కాగా డిస్కమ్ ఇచ్చిన ప్రకటనకు గత నెల 30న సీఎండీ జితేష్ పాటిల్ నిర్వహించిన విలేకరుల సమావేశంలో చెప్పిన మాటలకు ఎక్కడా పొంతన కనిపించడం లేదు. సీఎండీ స్వయంగా అంచనాల పెంపుపై మాట్లాడుతూ రూ.700 కోట్లు రోడ్డు పునరుద్ధరణ పనులకు, రూ.800 కోట్లకు పైగా ఆర్ఎంయూ సామగ్రికి సంబంధించి ధరలు అంటూ చెప్పారు. తాజా ప్రకటనలో ఈ వ్యత్యాసం వెనుక కారణాలేందో? డిస్కమ్ అధికారులే ప్రకటించాలి.