తెలంగాణలో కాంగ్రెస్ కక్ష రాజకీయాలు శృతిమించుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవలి కాలంలో అధికార వ్యవస్థలను ఉపయోగించి ప్రతిపక్షాన్ని అణగదొక్కే యత్నం బాహాటంగానే చేస్తున్నది. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అనేది ప్రభుత్వానికి శత్రువు కాదు. అది ప్రజల గొంతుక. ఆ గొంతుకను కేసులు, అరెస్టులు, దాడులతో మూయించడం ప్రజా స్వామ్యానికి ప్రమాదకరం. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నల్ల టీషర్టులతో నిరసన వ్యక్తం చేయడానికి ప్రయత్నించగా వారిని అడ్డుకోవడం, అదుపులోకి తీసుకోవడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.
పోలీసుల చేతిలో తీవ్ర అవమానాలపాలైన మహిళా సభ్యుల ఫిర్యాదులు తీసుకొనేందుకు ఆసక్తి చూపని పోలీసులు విపక్షాలపై కేసుల నమోదుకు ఉరుకలు వేస్తుండటం విడ్డూరం! కాంగ్రెస్ కక్ష రాజకీయాలతో రాష్ట్రంలో ప్రజాస్వామ్య హక్కులు అధోగతి పాలవుతుండటం దారుణం. విపక్ష బీఆర్ఎస్పై సీఎం రేవంత్‌రెడ్డి విషం కక్కడం అక్కసుతో కూడిన తిక్కరాజకీయం తప్ప మరోటి కాదు. ఆయనలోని అభద్రతాభావాన్ని అది సూచిస్తున్నది. దిగజారుతున్న భాష పెరుగుతున్న నిస్పృహకు అద్దం పడుతున్నది.
రాష్ట్రవ్యాప్తంగా ఒక పథకం ప్రకారమే ముందస్తు అరెస్టులు, గృహనిర్బంధాలు జరుగుతున్నాయి అనేది తెలిసిపోతూనే ఉన్నది. విపక్షం ప్రజాసమస్యలపై ప్రశ్నలు సంధిస్తే జవాబుదారీతో సమాధానాలు చెప్పాల్సిన ప్రభుత్వం ఎదురుదాడికి దిగడం, కేసులు, అరెస్టులతో బరితెగించడం ప్రజాస్వామ్యానికి అరిష్టదాయకమేనని చెప్పాలి. విపక్ష సభ్యుల సస్పెన్షన్లు, అరెస్టులు ఎమర్జెన్సీ రోజులను తలపునకు తెస్తున్నాయి.
ఆనాడు విపక్ష నేతలను మూకుమ్మడిగా అరెస్టు చేసి ప్రజాస్వామ్యం గొంతు నొక్కిన చరిత్ర కాంగ్రెస్‌ది. నేడు తెలంగాణలో విపక్ష సభ్యుల అణచివేతతో ఇందిరమ్మ రాజ్యం తెచ్చినట్టే కనిపిస్తున్నది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీల అరెస్టులు రాజకీయ వాతావరణాన్ని మరింత విషపూరితం చేశాయి. దీనికి తోడు, రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టిన బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తల పట్ల కూడా పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇదంతా ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోనే జరుగుతున్నదని స్పష్టమవుతున్నది. పోలీస్ స్టేషన్లోనే బీఆర్ఎస్ నేతల సిబ్బందిపై దాడి జరగడం మరీ దారుణం.
అధికారాన్ని అడ్డుపెట్టుకొని అటు పోలీసు వ్యవస్థను, ఇటు గూండాయిజాన్ని విపక్షంపైకి ఎగదోయడం దుర్మార్గం. బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడులు జరుపడం ఏ విష సంస్కృతికి ఆనవాలు? విపక్షనేత నివాసం పైకి పాలక పక్షం దాడికి వెళ్లడం ఏ సంప్రదాయానికి నిదర్శనం? పైగా ఈ వ్యవహారాన్ని వక్రీకరిస్తూ వివాదాస్పదం చేసి, విపక్షంపైనే తప్పుడు కేసులు నమోదు చేయడం మరీ విడ్డూరం. చట్టాన్ని, పోలీసు వ్యవస్థను అధికార పక్షం దుర్వినియోగం చేస్తుండటం ఏమాత్రం క్షంతవ్యం కాదు. ప్రజాస్వామ్యంలో చట్టం ముందు అందరూ సమానమే. కానీ చట్టాన్ని ఆయుధంగా మార్చి ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుంటే అది ప్రమాదకరం.
అధికారంలో ఉన్న వారు ప్రతిపక్షం అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. అంతే తప్ప ప్రతీకారం చూపకూడదు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్థులను అణచివేయడానికి పోలీస్ వ్యవస్థను ఎడాపెడా వినియోగిస్తే అది తాత్కాలిక పైశాచిక ఆనందం ఇవ్వొచ్చు. కానీ దీర్ఘకాలంలో ప్రతికూల ఫలితాలు ఇస్తుందని కాంగ్రెస్ పాలకులు తెలుసుకోవాలి. ప్రతిపక్షం లేకుండా ప్రజాస్వామ్యం మనజాలదు. అదే విధంగా ప్రతీకారం మీద నడిచే పాలన ప్రజాగ్రహ వెల్లువలో కొట్టుకుపోక తప్పదు.
మాయదారి హామీలతో, మోసకారి వేషాలతో అధికారం చేజిక్కించుకోవడం అన్నివేళలా సాధ్యపడదు. హామీలను అటకెక్కించడంపై అన్నివర్గాలూ సర్కార్‌పై ధ్వజమెత్తుతున్నాయి. కాంగ్రెస్ నాయకులు ప్రజల్లో తిరిగే పరిస్థితి లేదు. హామీల అమలు ఏమైందని ఆ ప్రజల తరఫున నిలదీస్తున్న బీఆర్ఎస్ నేతల గొంతునొక్కాలని కాంగ్రెస్ చూడటం తన గొయ్యి తనే తవ్వుకోవడం అవుతుంది. అపారమైన ప్రజాబలమున్న బీఆర్ఎస్ను అధికార మదంతో అణచాలనుకోవడం అజ్ఞానమే.