నాని కథానాయకుడిగా నూతన నిర్మాణ సంస్థ వైర ఎంటర్టైన్మెంట్స్ ఓ చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ద్వారా శౌర్యువ్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి, మూర్తి కేఎస్ నిర్మాతలు. నాని నటిస్తున్న 30వ చిత్రమిది కావడం విశేషం. ఆదివారం ఈ సినిమా తాలూకు కథాంశాన్ని ఆవిష్కరిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు.
ఇందులో నాని తన చిన్నారి కూతురికి ముచ్చట్లు చెబుతూ కనిపించారు. తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా ఈ సినిమా ఉంటుందని చిత్రబృందం పేర్కొంది. ‘సీతారామం’ ఫేమ్ మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సానుజాన్ వర్గీస్, సంగీతం: హేషమ్ అబ్దుల్ ఫహాద్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఈవీవీ సతీష్, దర్శకుడు: శౌర్యువ్.