Canara Bank | కెనరా బ్యాంకుకు కొత్తగా ఎండీ కమ్ సీఈఓతో పాటు కొత్త ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కెనరా బ్యాంకు కొత్త ఎండీ, సీఈఓగా కే సత్యనారాయణరాజు, ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్‌గా హర్దీప్సింగ్ ఆహ్లువాలియాలను నియమించినట్లు కేంద్రం తెలిపింది. వీరి నియామకాలు ఇవాల్టి నుంచే అమల్లోకి వస్తాయని పేర్కొన్నది.
కే సత్యనారాయణ రాజు గత ఏడాది డిసెంబర్ 31 న పదవీ విరమణ చేసిన ఎల్వీ ప్రభాకర్ స్థానంలో కేంద్ర ప్రభుత్వం నియమించింది. 2021 మార్చి 10 నుంచి ఇదే బ్యాంకు ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్‌గా ఆయన సేవలందించారు. ఫిజిక్స్‌లో డిగ్రీ పట్టా అందుకున్న సత్యనారాయణరాజు, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్‌లో ఎంబీఏ, సీఏఐఐబీలో పీజీ చదివారు. 1988 లో విజయా బ్యాంకులో చేరిన సత్యనారాయణరాజు.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో చీఫ్ జనరల్ మేనేజర్ స్థాయికి ఎదిగారు. 33 ఏండ్ల సుదీర్ఘ బ్యాంకింగ్ సర్వీసులో 12 సంవత్సరాల పాటు ప్రత్యేక కార్పొరేట్ బ్యాంకింగ్ బ్యాంచ్తోపాటు వివిధ శాఖలకు నాయకత్వం వహించారు. ముంబై జోన్‌కి జోనల్ హెడ్‌గా కూడా సేవలందించారు. హెడ్ఆఫీసులో ఆపరేషన్స్, సర్వీసెస్ డిపార్ట్మెంట్కు హెడ్‌గా కూడా పనిచేశారు. కార్పొరేట్, క్రెడిట్, రిటైల్, అగ్రిఫైనాన్సింగ్, క్రెడిట్ మానిటరింగ్, క్రెడిట్ రికవరీ తదితర విభాగాల్లో అపారమైన అనుభవం కలిగి ఉన్నారు.
కాగా, కెనరా బ్యాంక్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్‌గా హర్దీప్సింగ్ ఆహ్లువాలియాను కూడా కేంద్రం ఇవాళే నియమించింది. ఈడీగా ఎదగడానికి ముందు ఆయన ఇండియన్ బ్యాంక్ కార్పొరేట్ కార్యాలయంలో రికవరీ డిపార్ట్మెంట్ జనరల్ మేనేజర్‌గా పనిచేశారు. 1992 లో అలహాబాద్ బ్యాంక్‌లో అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్‌గా తన బ్యాంకింగ్ వృత్తిని ప్రారంభించిన హర్దీప్సింగ్.. అగ్రికల్చర్ డిగ్రీ విద్య చదివారు. ఎన్ఐబీఎం పుణె నుంచి క్రెడిట్ మేనేజిమెంట్‌లో సర్టిఫికేట్ పొందాడు. ఫైనాన్షియల్ మేనేజిమెంట్‌లో కంప్యూటర్ అప్లికేషన్స్‌లో డిప్లొమా పొందారు. భారత్‌తోపాటు విదేశాల్లో బ్యాంకింగ్ వ్యవస్థ వివిధ క్రియాత్మక రంగాల్లో ముఖ్యంగా లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్‌గా, ఇంటర్నేషనల్ హెడ్‌గా వ్యూహాత్మక స్థానాల్లో 3 దశాబ్దాలపాటు సేవలందించారు. ఇండియన్ బ్యాంక్ కల్చరల్ అండ్ స్పోర్ట్స్ కమిటీ ప్రెసిడెంట్‌గా స్పోర్ట్స్ ఫీల్డ్‌కు విశేషమైన సహాయసహకారాలు అందించారు.