శనివారం 04 ఏప్రిల్ 2020
Komarambheem - Jan 23, 2020 , 23:45:15

మహిపూజకు వేళాయె..

మహిపూజకు వేళాయె..
  • -ఏజెన్సీలో ఆదివాసుల అతిపెద్ద పండుగ
  • -గిరిజనుల సంస్కృతికి ప్రతిబింబం
  • -ముస్తాబైన కెస్లాపూర్‌ నాగోబా ఆలయం
  • -అర్ధరాత్రి నాగోబాకు మెస్రం వంశీయుల మహాపూజలు
  • -జాతరకు వేలాదిగా తరలిరానున్న ఆదివాసీ గిరిజనులునేటి నుంచి నాగోబా జాతర


నాగోబా జాతరకు కెస్లాపూర్‌ ముస్తాబైంది. శుక్రవారం అర్ధరాత్రి మెస్రం వంశీయుల మహా పూజలతో జాతరకు అంకురార్పరణ జరగనున్నది. జన్నారం మండలం కలమడుగుకు దాదాపు 80 కిలోమీటర్లు కాలినడకన వెళ్లి గోదావరి హస్తలమడుగు దగ్గర పంచలింగాలకు పూజ చేసి.. కలశంలో తీసుకొచ్చిన పవిత్ర జలాలతో నాగోబాకు అభిషేకం చేయనున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచేగాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, కర్ణాటక, మధ్యప్రదేశ్‌, బీహార్‌, ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టాల నుంచి లక్షలాదిగా భక్తులు తరలిరానుండగా, అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 27న దర్బార్‌ జరుగనున్నది. - ఇంద్రవెల్లి

కెస్లాపూర్‌లోని నాగోబా ఆలయం జాతరకు ముస్తాబైంది. శుక్రవారం అర్ధరాత్రి మహాపూజలతో జాతర ప్రారంభం కానున్నది. ఆదివాసీ గిరిజనుల అతిపెద్దపండుగైన కెస్లాపూర్‌ నాగోబా జాతరను వైభవంగా జరుపుకోనున్నారు. ఇప్పటికే మెస్రం వంశీయులు గంగాజలంతో కెస్లాపూర్‌ గ్రామంలోని మర్రిచెట్లకు చేరుకోగా, ఆదిలాబాద్‌ జిల్లాతో పాటు మంచిర్యాల, కుమ్రంభీమ్‌ ఆసిఫాబాద్‌, నిర్మల్‌ జిల్లాల నుంచే కాకుండా ఇతర జిల్లాల్లోని మెస్రం వంశీయులతోపాటు ఆదివాసీ గిరిజనులు కెస్లాపూర్‌కు చేరుకుంటున్నారు. జిల్లా నలుమూలల నుంచేకాకుండా ఇతర రాష్ర్టాల నుంచి గిరిజనులు భారీగా తరలివచ్చి నాగోబాను దర్శంచుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
-ఇంద్రవెల్లి

మెస్రం వంశీయులే అర్చకులు..

నాగోబా దేవతకు ఆదివాసీ గిరిజనులైన మెస్రం వంశీయులే అర్చకులుగా వ్యవహరిస్తూ నాగోబాకు గిరిజన సంప్రదాయం ప్రకారం మహాపూజలు నిర్వహిస్తారు. మెస్రం వంశంలో 22 తెగలు ఉన్నాయి. అందులో ఏడుగురు దేవతలను కొలిచేవారంతా మెస్రం వంశస్తులు. మడావి, మర్సుకోల, పుర్క, మెస్రం, వెడ్మ, ఫంద్రా, ఉర్వేత ఇలా ఇంటిపేర్లు గలవారంతా మెస్రం వంశంలోకి వస్తారు. జాతర ప్రారంభానికి 4, 5 రోజుల ముందే మెస్రం వంశీయులు కెస్లాపూర్‌ చేరుకుని అక్కడున్న మర్రిచెట్ల వద్ద ఐదు రోజులుగా కుటుంబ సమేతంగా బసచేస్తారు. నాగోబాకు నిర్వహించే మహాపూజల కోసం ఏర్పాట్లు చేస్తూ నాగోబాకు మహాపూజలు నిర్వహించేందుకు సిద్ధమవుతారు. మెస్రం వంశస్తులు నాగోబాకు పూజలు నిర్వహించిన అనంతరం జాతర ప్రారంభమవుతుంది. ఇతరులు దర్శించుకునేందుకు అవకాశం కల్పిస్తారు.

ఇదీ నాగోబా ఆలయ చరిత్ర..

క్రీ.శ 740లో కెస్లాపూర్‌ గ్రామ గిరిజనుడు పడియేరు శేషసాయి నాగభక్తుడు. నాగదేవతను దర్శించుకునేందుకు నాగలోకానికి వెళ్లాడు. అక్కడ ద్వారపాలకులు అడ్డగించి నాగరాజు లేరని చెబుతారు. శేషసాయి నిరుత్సాహంతో నాగరాజు శేషతల్పం తాకి కెస్లాపూర్‌కు వెనుదిరుగుతాడు. దానధర్మాలు చేయడం ప్రారంభిస్తాడు. లోక సందర్శన ముగించుకున్న నాగరాజు శేషతల్పంపై ఆసీనుడవుతాడు. శేషతల్పాన్ని మానవుడు తాకిన విషయం తెలుసుకున్న నాగేంద్రుడు ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. శేషసాయిని అంతమొందించేందుకు భూలోకానికి వస్తాడు. గమనించిన శేషసాయి ప్రాణభీతితో కాలజ్ఞాన పురోహితుడు ప్రధాన్‌ పడమార్‌ దగ్గరకు వెళ్తాడు. నాగరాజును శాంతింపజేసే మార్గాన్ని తెలుసుకుంటాడు. ఏడు కడవల ఆవుపాలు, పెరుగు, నెయ్యి, తేనె, బెల్లం, పెసరపప్పు నైవేద్యంగా సమర్పిస్తాడు. గోదావరి హస్తినమడుగు నీటిని 125 గ్రామాల మీదుగా తిరుగుతూ తీసుకొచ్చిన గంగాజలంతో నాగరాజును అభిషేకిస్తాడు. దీంతో కెస్లాపూర్‌ వద్ద ఉన్న పుట్టలోకి నాగరాజు వెళ్లి ఆ ప్రాంతాన్ని తన నివాసంగా మార్చుకుంటాడు. అప్పటినుంచి ప్రతి సంవత్సరం పుష్యమాసం అమావాస్య రోజున అర్ధరాత్రి మెస్రం వంశీయులు నాగోబాకు మహాపూజలు నిర్వహిస్తున్నారు.

పవిత్ర గంగాజలంతో నాగోబాకు అభిషేకం..

ప్రతి సంవత్సరం పుష్యమాసంలో పౌర్ణిమ రోజు మెస్రం వంశీయులు మంచిర్యాల జిల్లా జన్నారం మండలం హస్తలమడుగులోని పవిత్ర గంగాజలాన్ని సేకరించడానికి బయలు దేరడంతో నాగోబా జాతరకు అంకరార్పరణ పడుతుంది. 125 గ్రామాల మీదుగా తిరుగుతూ కెస్లాపూర్‌కు గంగాజలాన్ని తీసుకొస్తారు. గంగాజలంతో ఉన్న ఝరిని మర్రిచెట్ల వద్ద ఓ మోదుగ చెట్టుపై నాలుగు రోజులు భద్రంగా ఉంచుతారు. గంగాజలానికి వెళ్లే ముందు 25 రోజుల నుంచే నాగోబాకు నిర్వహించే మహాపూజలపై మెస్రం వంశీయులు సంప్రదాయ పద్ధతిలో ఏర్పాట్లలో నిమగ్నమవుతారు. అమావాస్య రోజు అర్ధరాత్రి నాగోబాకు గంగాజలంతో జలాభిషేకం చేసి మెస్రం వంశీయులే మహాపూజలు నిర్వహిస్తారు.

మర్రిచెట్ల నుంచే ప్రత్యేక పూజలు ప్రారంభం..

గంగాజలంతో మర్రిచెట్లకు చేరుకొని అక్కడ నాలుగు రోజులు బసచేసిన మెస్రం వంశీయులు అక్కడి నుంచే నాగోబాకు నిర్వహించే ప్రత్యేక పూజలను ప్రారంభిస్తారు. సంప్రదాయ పద్ధతిలో మర్రిచెట్ల వద్ద వివిధ రకాల పూజలు నిర్వహిస్తూ మొక్కులను తీర్చుకుంటారు. వంటలు చేసి సహపంక్తి భోజనాలు చేస్తారు. మెస్రం పెద్దలు, మెస్రం పటేళ్లు నాగోబాకు నిర్వహించే మహాపూజలపై చర్చిస్తారు. అనంతరం నాగోబాకు నిర్వహించే సంప్రదాయ మహాపూజలకు మెస్రం వంశీయులు ఏర్పాట్లు చేస్తారు.

యేటా పుష్యమాసం అమావాస్య రోజున అర్ధరాత్రి నాగోబాకు మెస్రం వంశీయులు పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. జాతర అధికారికంగా ఐదు రోజుల పాటు కొనసాగుతుంది.  రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, ఒడిషా, కర్ణాటక, మధ్యప్రదేశ్‌, బీహార్‌, ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలిరానున్నారు. విదేశాల నుంచి పర్యాటకులు, సందర్శకులు తరలివచ్చి నాగోబాను దర్శించుకొని పూజలు చేస్తారు. గంగాజలంతో మర్రిచెట్ల వద్ద నాలుగు రోజులు కుటుంబసమేతంగా బసచేసిన మెస్రం వంశీయులు 24న ఉదయం సంప్రదాయ బద్దంగా ఎడ్లబండ్లతో గోవాడ్‌కు చేరుకుంటారు. 24న (శుక్రవారం) రాత్రి నాగోబా ఆలయానికి చేరుకొని అర్ధరాత్రి పవిత్ర గంగాజలంతో నాగోబాకు అభిషేకం చేసి నైవేద్యాన్ని సమర్పించి మహాపూజలు నిర్వహిస్తారు. ఆలయంలో ఏడు రకాల పాముల పుట్టలను తయారు చేసి వాటికి ఐదురోజుల పాటు ప్రత్యేక పూజలు చేసి మొక్కులను తీర్చుకుంటారు. దీంతో నాగోబా అనుగ్రహం కలుగుతుందని మెస్రం వంశీయులతోపాటు ఆదివాసీ గిరిజనుల విశ్వాసం.

గోవాడ్‌లో 22 పొయ్యిలపై వంటలు..

జాతరకు వచ్చే మెస్రం వంశ మహిళలు వంటలు చేసుకునేందుకు గోవాడలో 22 పొయ్యిలు ఏర్పాటు చేస్తా రు. వీటిపైనే మెస్రం వంశీయుల మహిళలు వంటలు చేస్తారు. మహాపూజలకు కావాల్సిన నైవేద్యాలు అక్కడే వండుతారు. గోవాడ్‌లో ఇతరులు రాకుండా నిబంధనలు విధిస్తారు. గోవాడ్‌లో ఉండే వందలాది మంది మెస్రం వంశ మహిళలు వంతులవారీగా వంటలు చేసుకుంటారు. మెస్రం వంశస్తులు కాకుండా ఇతరులు ఆలయ ఆవరణలో ఎక్కడైనా వంటలు చేసుకొని ఆ ప్రాంతంలోనే బస చేయవచ్చు.
logo