యాపిల్ ఐఫోన్‌కు 10 వసంతాలు పూర్తి..!


Mon,January 9, 2017 04:05 PM

ఐఫోన్... దీని గురించి తెలియని వారుండరు. మొదట్నుంచీ వినూత్నమైన, విలక్షణమైన ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్ యూజర్లను ఆకట్టుకుంటూ వస్తోంది. ఖరీదు ఎక్కువ ఉన్నా చాలా మంది ఈ ఫోన్ కొనుగోలు పట్ల ఆసక్తి చూపుతారంటే అందులో ఉండే ఫీచర్లే దానికి కారణం. ఈ క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ విక్రయాల్లో ఆండ్రాయిడ్ ఫోన్లకు పోటీ ఇస్తుంది యాపిల్ ఐఫోన్ ఒక్కటే. అలాంటి ఐఫోన్‌కు ఈ రోజు చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటే సరిగ్గా గత 10 ఏళ్ల కిందటే తొలి ఐఫోన్ జనవరి 9వ తేదీన విడుదలైంది. దీంతో నేటికి ఐఫోన్ 10 వసంతాలు పూర్తి చేసుకుంది.

2007లో తొలి ఐఫోన్ విడుదల...
2007లో శాన్‌ఫ్రాన్సిస్కోలో జరిగిన మాక్ వరల్డ్‌లో అప్పటి యాపిల్ సీఈవో స్టీవ్ జాబ్స్ తొలి ఐఫోన్‌ను విడుదల చేశారు. అది అప్పట్లో ఓ సంచలనం సృష్టించింది. పెద్ద స్క్రీన్ (అప్పటి ఫోన్లతో పోలిస్తే), ఐపాడ్ టచ్ కంట్రోల్స్ వంటి వినూత్నమైన ఫీచర్లను అందులో ఏర్పాటు చేశారు. జీపీఆర్‌ఎస్, ఎడ్జ్ ఇంటర్నెట్ కనెక్టివిటీతో ఈ ఫోన్‌ను తయారు చేశారు. అందులో ఐఫోన్ ఓఎస్ 1ను ఏర్పాటు చేశారు. అనంతరం అదే ఐఓఎస్‌గా మారి ఇప్పటి ఐఫోన్లలో అందుబాదులో ఉంది. కాగా తొలి ఐఫోన్ విడుదలైన నాటి నుంచి గతేడాది జూన్ వరకు యాపిల్ దాదాపు 100 కోట్ల ఐఫోన్లను విక్రయించినట్టు సమాచారం.
first-iphone-release
త్వరలో సూపర్ ఐఫోన్...
ఐఫోన్ 10 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా యాపిల్ సీఈవో టిమ్ కుక్ ఓ ప్రకటన విడుదల చేశారు. అందులో ఆయన చెప్పారంటే... ఇప్పటి వరకు ఎన్నో ఐఫోన్ మోడల్స్ వచ్చాయి కానీ, ఇక ముందు రాబోతున్న ఐఫోన్స్ యూజర్లను ఇప్పటి కన్నా ఎన్నో వందల రెట్లు ఆకట్టుకుంటాయని అన్నారు. త్వరలో అత్యంత హై ఎండ్ ఫీచర్లతో ఓ సూపర్ ఐఫోన్‌ను తీసుకురానున్నట్టు ఆయన చెప్పారు. ఓ స్మార్ట్‌ఫోన్ యూజర్ జీవితంలో ఐఫోన్ భాగం అయ్యేలా చూడడమే తమ లక్ష్యమని అన్నారు. కమ్యూనికేషన్, ఎంటర్‌టైన్‌మెంట్, వర్క్, లివింగ్ వంటి అంశాల ప్రాతిపదికగా భవిష్యత్ ఐఫోన్లు తేనున్నట్టు తెలియజేశారు.
sms-text-iphone
ఐఫోన్ గురించిన పలు ఆసక్తికర విషయాలివే...

 • ఐఫోన్ యానివర్సరీని నిర్వహించేది అధికారికంగా జనవరి 9నే. కానీ ఆ ఫోన్ 2007, జనవరి 9 న అనౌన్స్ అయినా, అది యూజర్లకు అందుబాటులోకి వచ్చింది మాత్రం జూన్ 29న. ఆ రోజే తొలి ఐఫోన్ విక్రయాలు ప్రారంభమయ్యాయి.
 • మొదటి ఐఫోన్ మోడల్ తొలుత అమెరికాలో విడుదలవ్వగా, అనంతరం అది యూకే, జర్మనీ, ఫ్రాన్స్‌లలో అందుబాటులోకి వచ్చింది. అయితే ఆ ఫోన్ భారత్‌లో మాత్రం విడుదల కాలేదు. భారత్‌లో విడులైంది ఐఫోన్ 3జీ ఫోన్. అది 2008 ఆగస్టులో మన దగ్గర లభించింది.
 • ఐఫోన్ 3జీ ఫోన్‌ను మన దగ్గర హచ్ (ఇప్పుడు వొడాఫోన్), ఎయిర్ టెల్ నెట్‌వర్క్‌లు యూజర్లకు అందించాయి.
 • ఇప్పుడంటే ఐఓఎస్ యాప్ స్టోర్‌లో కొన్ని లక్షల యాప్స్ ఉన్నాయి. కానీ ఒకప్పుడు అంటే తొలి ఐఫోన్ మోడల్‌లో అసలు యాప్ స్టోరే లేదు తెలుసా..!
 • తొలి ఐఫోన్‌ను స్టీవ్ జాబ్స్ ప్రవేశపెట్టగానే ప్రముఖ నెట్‌వర్కింగ్ కంపెపీ సిస్కో యాపిల్‌పై దావా వేసింది. ఎందుకంటే యాపిల్ తన ఐఫోన్‌కు వాడిన ట్రేడ్ మార్క్ తమదేనని సిస్కో వాదించింది. అయితే కొన్ని రోజులకే ఆ సమస్యను రెండు కంపెనీలు పరిష్కరించుకున్నాయి.
 • ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ 2016లో విడుదల చేసిన అత్యంత ప్రభావితమైన 50 గ్యాడ్జెట్ల లిస్ట్‌లో యాపిల్ ఐఫోన్ టాప్ స్థానంలో నిలవడం విశేషం.
 • ఐఫోన్‌లో వాడే పలు రకాల టెక్నాలజీలకు సంబంధించి యాపిల్ వద్ద ఇప్పటి వరకు 200 పేటెంట్ హక్కులు ఉన్నాయి.
 • ఐఫోన్‌లో అత్యంత ఖరీదైన విడిభాగం ఏదో తెలుసా..? అది అందులో ఉండే డిస్‌ప్లేనే. రెటీనా హెచ్‌డీ టైప్‌లో యాపిల్ ఆ డిస్‌ప్లేను తన ఐఫోన్లలో ఏర్పాటు చేస్తోంది.
 • ఐప్యాడ్, ఐపాడ్, మాక్‌బుక్, వాచ్... ఇలా యాపిల్‌కు చెందిన అనేక టెక్నాలజీ ఉత్పత్తులు మార్కెట్‌లో ఉన్నా ఆ సంస్థకు ఎక్కువగా ఆదాయం వస్తుంది మాత్రం ఐఫోన్ విక్రయాల ద్వారానే.
 • ఐఫోన్ యాడ్‌లలో టైం ఎప్పుడూ 9.41 a.m. అనే చూపిస్తుంది కదా. అలా ఎందుకు చూపిస్తుందంటే స్టీవ్ జాబ్స్ మొదటి ఐఫోన్‌ను విడుదల చేసింది ఆ సమయానికే కాబట్టి.
 • బహిరంగ మార్కెట్‌లో యాపిల్, శాంసంగ్ రెండు కంపెనీలు శత్రువులే అని చెప్పవచ్చు. ఇవి రెండు పోటా పోటీగా ఫోన్లను, గ్యాడ్జెట్లను విడుదల చేస్తున్నాయి. అయితే నిజానికి యాపిల్‌కు చెందిన ఐఫోన్ ప్రాసెసర్లను తయారు చేసేది మాత్రం శాంసంగే. శాంసంగ్ ఆ ప్రాసెసర్లను తయారు చేసి యాపిల్‌కు ఇస్తుంటుంది.
 • ప్రతి 100 మంది ఫోన్ వినియోగదారుల్లో 22 మంది కాల్స్ కన్నా ఎస్‌ఎంఎస్ పంపడమే బెటర్ అని భావిస్తారట. అందుకు అనుగుణంగానే ఐఫోన్‌లో వచ్చిన ఎస్‌ఎంఎస్ ఆప్షన్ అప్పట్లో సంచలనం సృష్టించింది. టచ్ స్క్రీన్‌పై ఎస్‌ఎంఎస్ టైప్ చేయడం, పంపడం అప్పట్లో ఒక ఆకట్టుకునే ఫీచర్‌గా ఉండేదట.
 • 2007లో ఐఫోన్ విడుదలవగా అదే ఏడాది టైమ్ మ్యాగజైన్ దానికి ఇన్వెషన్ ఆఫ్ ది ఇయర్ అనే అవార్డును కూడా ప్రదానం చేసింది.
 • ఐఫోన్‌ను ముందుగా తయారు చేసినప్పుడు దానికి పర్పుల్ అనే పేరు పెట్టారట. అయితే ఆ పేరు ఇప్పటికీ వాడకపోయినా యాపిల్ హెడ్‌క్వార్టర్స్‌లో డెవలపర్స్ తమ విభాగాన్ని పర్పుల్ డార్మ్ అని పిలుస్తారట.
 • యాపిల్ పండ్లకు ప‌ట్టే చీడ పురుగు Cydia Pomonella పేరు మీదటే ఐఓఎస్ జైల్ బ్రేకింగ్ సాఫ్ట్‌వేర్ అయిన Cydia ను తయారు చేశారు.
 • ఐఫోన్ విడుదలైన తొలినాళ్లలో కొందరు ఐఫోన్ ప్రియులు దాన్ని ముద్దుగా జీసస్ ఫోన్ అని పిలుచుకునేవారట.
 • ఐఫోన్‌ను మొదట విడుదల చేసినప్పుడు స్టీవ్ జాబ్స్ ఆ ఫోన్ ద్వారా స్థానికంగా ఉండే స్టార్ బక్స్ అనే రెస్టారెంట్‌కు ఓ ప్రాంక్ కాల్ (సరదా ఫోన్ కాల్) చేశారట. తనకు 4000 లాటెస్ (ప్రత్యేకమైన కాఫీ) కావాలని ఆర్డర్ ఇచ్చారట. అయితే వెంటనే ఆ ఆర్డర్ క్యాన్సిల్ చేసి వారిని ఫూల్స్ చేశారట.

 • 1647
  data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

  More News

  VIRAL NEWS