శుక్రవారం 05 జూన్ 2020
Telangana - Jan 23, 2020 , 02:08:13

స్థిరాస్తి రిజిస్ట్రేషన్లకూ బ్లాక్‌చైన్‌

స్థిరాస్తి రిజిస్ట్రేషన్లకూ బ్లాక్‌చైన్‌
  • శంషాబాద్‌లో ప్రయోగాత్మకంగా అమలుకు సన్నాహాలు
  • సీ-డాట్‌ ఆధ్వర్యంలో ఏర్పాట్లు

ప్రత్యేక ప్రతినిధి, నమస్తే తెలంగాణ: టీ-చిట్స్‌ తరహాలో స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లకూ బ్లాక్‌చైన్‌ విధానాన్ని అమలుచేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. దీనిని శంషాబాద్‌ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ప్రయోగాత్మకంగా అమలుకు సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌ (సీ-డాట్‌) ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. చిట్‌ఫండ్‌ కంపెనీల వ్యవహారాలను పారదర్శకంగా నిర్వహించడానికి, మోసాలకు కళ్లెంవేయడానికి ఇప్పటికే స్టాంపులు, రిజిస్ట్రేషన్‌శాఖలో ప్రవేశపెట్టిన టీ-చిట్స్‌ బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ మంచి ఫలితాలనిచ్చింది. 


ఇదేతరహాలో స్థిరాస్తి రిజిస్ట్రేషన్ల సమాచారాన్ని పూర్తిగా బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించారు. ఇందుకోసం కేంద్రప్రభుత్వ ఆధీనంలోని సీ-డాట్‌ సహకారాన్ని తీసుకుంటున్నారు. శంషాబాద్‌ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో దీనిని ప్రయోగాత్మకంగా అమలుచేయాలని నిర్ణయించారు. ఇప్పటికే ఈ కార్యాలయంలో సీ-డాట్‌ సిబ్బంది పనులు మొదలుపెట్టారు. డబుల్‌ రిజిస్ట్రేషన్ల వంటి పొరపాట్లు, మోసాలకు ఆస్కారం లేకుండా బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. బ్లాక్‌చైన్‌ టెక్నాలజీలో ఒకసారి డాటా ఎంట్రీ అయిన తర్వాత ఆన్‌లైన్‌లో పూర్తి సమాచారం కండ్లకు కట్టినట్టుగా ఉంటుంది. 


డిస్ట్రిబ్యూటెడ్‌ లెడ్జర్‌ విధానంలో సమాచారాన్ని ఒకదగ్గర మార్చినా 99 చోట్ల మార్చడానికి వీలుండదు. దానివల్ల వాస్తవ సమాచారాన్ని ట్యాంపర్‌ చేయడానికి లేదా ఆకస్మికంగా మార్చడానికి వీలుండదు. ఈ టెక్నాలజీని వాడటం వల్ల ఆన్‌లైన్‌లో ఎలాంటి వివరాలు మార్చినా వెంటనే తెలిసిపోతుంది. సమాచారాన్ని మార్చాలంటే బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ పరిధిలోఉన్న అందరి సమ్మతి అవసరమవుతుంది. ఈ క్రమంలో ఒకసారి ఆన్‌లైన్‌లో నిక్షిప్తమైన సమాచారం చౌర్యానికి గురికాకుండా ఉంటుంది.


టీ-చిట్స్‌లో అద్భుత ఫలితాలు

రాష్ట్రవ్యాప్తంగా 23వేల చిట్‌ఫండ్‌ గ్రూప్‌లు రిజిస్టరై ఉన్నాయి. పలుకంపెనీలు నిబంధనలను అతిక్రమిస్తూ చీటీ పాడిన ప్రైజ్‌ బిడ్డర్లకు సకాలంలో డబ్బులు చెల్లించడం లేదు. అలాంటి కంపెనీలను కట్టడిచేయడానికి రాష్ట్రంలో మొదటిసారిగా బ్లాక్‌చైన్‌ టెక్నాలజీని అన్ని చిట్‌ఫండ్‌ అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో అమలుచేస్తున్నారు. దీనివల్ల అద్భుత ఫలితాలు వస్తున్నాయని ప్రశంసించిన కేంద్ర డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ రిఫార్మ్స్‌ అండ్‌ పబ్లిక్‌ గ్రీవెన్సెస్‌ మంత్రిత్వశాఖ గోల్డెన్‌ అవార్డుకు ఎంపికచేసింది. చిట్‌ఫండ్‌ కంపెనీలు ఎంత ప్రైజ్‌బిడ్‌ పాడుతున్నాయి, బిడ్డర్‌కు సకాలంలో డబ్బు చెల్లిస్తున్నాయా లేదా అనే అన్ని విషయాలు ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశం ఉంటుంది. 


వివరాలను ట్యాంపరింగ్‌ చేయడానికి వీలులేదు. చిట్‌ఫండ్‌ కంపెనీలు ఖాతాదారులను మోసం చేయకుండా స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ నిబంధనలను కఠినతరం చేసింది. రిజిస్టర్డ్‌ కంపెనీలు తమ చీటీ విలువ మొత్తాన్ని డబ్బురూపంలోనే డిపాజిట్‌ చేయాలని ఆదేశాలు జారీచేసింది. ఇకపై స్థిరాస్తుల తనఖా చెల్లదని స్పష్టంచేసింది. బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ వాడకంపై స్టాంపులు,రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్‌ చిరంజీవులు చిట్‌ఫండ్‌ రిజిస్ట్రార్లకు, సిబ్బదికి ప్రత్యేక శిక్షణనిచ్చారు. ఈ బ్లాక్‌చైన్‌ టెక్నాలజీని స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లకు వర్తింపచేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ జాయింట్‌ కమిషనర్‌ వేముల శ్రీనివాసులు తెలిపారు.


logo