బుధవారం 02 డిసెంబర్ 2020
Sports - Nov 06, 2020 , 16:35:42

ఎలిమినేటర్‌ మ్యాచ్‌..ఓడిన జట్టు ఇంటికే!

ఎలిమినేటర్‌ మ్యాచ్‌..ఓడిన జట్టు ఇంటికే!

అబుదాబి: ఐపీఎల్‌-13లో  శుక్రవారం రాత్రి  జరిగే  ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్లు    ఢీకొననున్నాయి. కీలక పోరులో     ఓడిన జట్టు లీగ్‌ నుంచి నిష్క్రమిస్తుంది.  గెలిచిన జట్టుకు మాత్రం ఫైనల్‌ చేరేందుకు ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో  జరిగే రెండో క్వాలిఫయర్‌ ద్వారా మరో అవకాశం ఉంటుంది.  

ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ ఫేవరెట్‌గా బరిలో దిగుతోంది.  చివరి నాలుగు మ్యాచ్‌ల్లో బెంగళూరు ఓడిపోగా.. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో గెలిచిన సన్‌రైజర్స్‌ ఉత్సాహంతో ఉంది. ఇరుజట్లు  లీగ్‌ దశలో రెండు సార్లు తలపడగా    చెరొక మ్యాచ్‌లో విజయం సాధించాయి. ఈ  మ్యాచ్‌లోనూ ఫామ్‌ను కొనసాగించి ఫైనల్‌కు చేరువ కావాలని వార్నర్‌సేన పట్టుదలగా ఉంది. 

బెంగళూరు లాంటి బలమైన జట్టును.. ఎలిమినేటర్‌లో  ఓడించాలంటే హైదరబాద్‌ జట్టు     సమిష్టిగా రాణించాల్సిందే. చాంపియన్‌గా అవతరించిన 2016 సీజన్‌లా.. చివరి మూడు మ్యాచ్‌లు గెలిచిన సన్‌రైజర్స్‌ నాకౌట్‌లోనూ సీన్‌ రిపీట్‌ చేస్తుందేమో చూడాలి. సీజన్‌లో  అన్ని విభాగాల్లో పటిష్ఠంగా ఉన్న సన్‌రైజర్స్‌ ఆల్‌రౌండ్‌ షోతో అదరగొడుతున్నది. 


బెంగళూరు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ    తన స్థాయికి  తగ్గట్లుగా రాణించలేకపోవడంతో ఆ జట్టుపై ఒత్తిడి పెరుగుతోంది.  ఓపెనర్‌ దేవదత్‌ పడిక్కల్‌ మాత్రమే   జట్టుకు శుభారంభం అందిస్తున్నాడు. కీలక సమయంలో బ్యాటింగ్‌ భారాన్ని   కోహ్లీ,  ఏబీ డివిలియర్స్‌ మోయాల్సి ఉంది. గాయంతో గత మ్యాచ్‌కు  దూరమైన నవదీప్‌ సైనీ  ఈ మ్యాచ్‌ ఆడతాడో లేదో అనుమానంగా మారింది.