శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Telangana - Mar 22, 2020 , 08:58:31

అంతర్‌జిల్లా ఘరానా దొంగ అరెస్ట్‌

అంతర్‌జిల్లా ఘరానా దొంగ అరెస్ట్‌

ఫెర్టిలైజర్‌సిటీ: జల్సాలకు అలవాటు పడి వరుస చోరీలకు పాల్పడుతున్న అంతర్‌జిల్లా ఘరానా దొంగను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ మేరకు రామగుండంలో డీసీపీ లా అండ్‌ ఆర్డర్‌ ఎం రవికుమార్‌ వి వరాలు వెల్లడించారు.  ఉదయం 7.30 గంటలకు సీసీఎస్‌ ఏసీపీ ఎస్‌.మహేశ్వర్‌ పర్యవేక్షణలో సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్లు ఆరె.వెంకటేశ్వర్‌, కే.శ్రీనివాస రా వు, మంథని ఏఎస్‌ఐ సత్యనారాయణ కలిసి మంథని ఓల్డ్‌ పెట్రోలు పంపు వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో స్కూటీపై వస్తున్న ఇద్దరు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోయేందుకు యత్నిస్తుండగా, వెంబడించి అందులో ఒకరిని పట్టుకోగా, మరొకరు పరారయ్యారు. అతని వద్ద బంగారు, వెండి ఆభరణాలు లభ్యమయ్యాయి. 

విచారణ చేయగా, అతని పేరు రామటెంకి సారయ్య అలియాస్‌ వెంకటేష్‌ అని, తనది పాలకుర్తి మండలం రామారావుపల్లి అని తెలిపినట్లు చెప్పారు. పూర్తి స్థాయి విచారణ చేయగా, అతడు రామగుండం కమిషనరేట్‌ పరిధిలోని మంథని, కరీంనగర్‌ జిల్లాలోని హుజూరాబాద్‌, వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌లోని ఎల్కతుర్తి ఏరియాలో తన సొంత అన్న అయిన రామటెంకి రాజ్‌కుమార్‌తో కలిసి దొంగతనాలు చేసినట్లు ఒప్పుకున్నాడు. ఈ క్రమంలో నిందితుడి వద్ద ఉన్న ఆభరణాలతోపాటు బైక్‌ను స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. 

నిందితుడిపై 51 కేసులు..

సారయ్య జల్సాలకు అలవాటు పడి, తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే చెడు ఉద్దేశంతో గతంలో పలు దొంగతనాలు చేసి జైలుకెళ్లినట్లు తెలిపారు. సారయ్యపై ఇప్పటివరకు వివిధ ఠాణాల్లో 51 కేసులు నమోదైనట్లు తెలిపారు. 2017లో సారయ్యపై మానకొండూరు పోలీసులు పీడీ యాక్టు పెట్టగా, జైలుశిక్ష అనంతరం బయటకు వచ్చి మళ్లీ అదే విధంగా దొంగతనాలు చేస్తున్నాడన్నారు. చివరగా 2019లోనూ దొంగతనం కేసులో జైలు జీవితం గడిపి ఇటీవలే బయటకు వచ్చాడని, అతని అన్న రామటెంకి రాజ్‌కుమార్‌తో కలిసి తాళాలు వేసి ఉన్న ఇండ్లలో దొంగతనాలు చేస్తూ, విలాసవంతమైన జీవితం గడుపుతూ పోలీసులకు దొరక్కుండా తిరుగుతున్నారని చెప్పారు. 

ఈ క్రమంలోనే చోరీ చేసిన సొత్తును విక్రయించేందుకు వెళ్తుండగా సారయ్యను అదుపులోకి తీసుకున్నామన్నారు. నిందితుడిపై ఇప్పటికే బసంత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో సస్పెక్ట్‌ షీట్‌ తెరిచినట్లు తెలిపారు. వీరి వద్ద నుంచి రూ.3.15లక్షల విలువైన బంగారు  వెండి ఆభరణాలు, రూ.10వేల నగదు, రూ.65వేల విలువైన హోండా ఆక్టివా, ఒక పొడవాటి ఇనుప రాడు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సారయ్యను పట్టుకోవడంలో ప్రతిభచూపిన సిబ్బందిని డీసీపీ ఎం రవికుమార్‌, సీసీఎస్‌ ఏసీపీ మహేశ్వర్‌ అభినందించారు. ఆయన వెంట సీసీఎస్‌ ఏసీపీ మహేందర్‌, సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్లు ఆరె వెంకటేశ్వర్లు, కే.శ్రీనివాస రావు, మంథని ఏఎస్సై సత్యనారాయణ ఉన్నారు.   


logo