Timed Out: సుమారు రెండున్నర శతాబ్దాల చరిత్ర కలిగిన క్రికెట్లో ఎన్నో లక్షలాది రికార్డులు నమోదయ్యాయి. అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటివరకూ అధికారికంగానే రెండు వేలకు పైగా టెస్టులు, 4,600కు పైగా వన్డేలు, వెయ్యికి పైగా టీ20 మ్యాచ్‌లు జరిగాయి. అయితే ఏ ఒక్క సందర్భంలో కూడా ఏ ఒక్క క్రికెటర్ కూడా ‘టైమ్డ్ ఔట్’ రూపంలో ఔట్ కాలేదు. అందుకు భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ వేదికైంది. ఢిల్లీ వేదికగా జరుగుతున్న శ్రీలంక – బంగ్లాదేశ్ మ్యాచ్‌లో లంక బ్యాటర్ ఏంజెలొ మాథ్యూస్ తొలిసారిగా టైమ్డ్ ఔట్ రూపంలో నిష్క్రమించిన తొలి బ్యాటర్‌గా నిలిచాడు. ఈ నేపథ్యంలో అసలు క్రికెట్లో ఎన్ని రకాల ఔట్లు ఉంటాయి..? అవేంటనేది ఇక్కడ తెలుసుకుందాం.
11 రకాల ఔట్లు..
అంతర్జాతీయ క్రికెట్లో ఒక బ్యాటర్‌ను 11 విధాలుగా ఔట్ చేయవచ్చు. అందులో అందరికీ తెలిసినవే గాక క్రికెట్లో సాధారణంగా నమోదయ్యేవి ఆరు. అవి బౌల్డ్, క్యాచ్ ఔట్, లెగ్ బిఫోర్ వికెట్ (ఎల్బీడబ్ల్యూ), రనౌట్, స్టంపౌట్, హిట్ వికెట్. ఇవి కాకుండా మరో ఐదు రకాల ఔట్లు చాలా అరుదుగా సంభవిస్తాయి.
అబ్స్ట్రక్టింగ్ ఫీల్డ్: ఒక బ్యాటర్ ప్రత్యర్థి జట్టులోని ఆటగాళ్లను తన మాటలతో దూషించడం గానీ, ఆటకు అంతరాయం కలిగించే విధంగా ప్రవర్తించినప్పుడు గానీ అంపైర్లు సదరు ఆటగాడిని ఔట్‌గా ప్రకటించొచ్చు. టెస్టు క్రికెట్ చరిత్రలో ఒకసారి ఈ ఘటన చోటుచేసుకుంది. 1951లో ఇంగ్లండ్-సౌతాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లీష్ జట్టుకు చెందిన లెన్ హట్టన్ ఈ రూపంలో ఔట్ అయ్యాడు. వన్డేలలో ఎనిమిది మంది బ్యాటర్లు ఇలా ఔట్ అయ్యారు.
బంతిని రెండుసార్లు కొట్టడం: ఒక బ్యాటర్ బంతిని తన బ్యాట్‌తో రెండుసార్లు కొడితే అది నిబంధనలకు వ్యతిరేకం. అది ఔట్ కిందకే వస్తుంది. ఒకసారి బంతిని బ్యాట్‌తో కొట్టాక మళ్లీ ఉద్దేశపూర్వకంగానో లేదా వికెట్ల మీద పడుతుంటే అడ్డుకుంటేనో దానిని ఔట్‌గా ప్రకటించే అవకాశం ఉంటుంది.
హ్యాండిల్ ది బాల్: ఒక బౌలర్ విసిరే బంతిని బ్యాటర్.. బ్యాట్‌తో కాకుండా తన చేతితో ఆపే ప్రయత్నం చేస్తే అది కూడా ఔట్ కిందకే వస్తుంది. ఒకవేళ గాయపడే అవకాశం ఉంటే బంతిని అడ్డుకోవడంలో తప్పులేదు. 2017 కు ముందు ఈ నిబంధన అబ్స్ట్రక్టింగ్ ఫీల్డింగ్ కిందే ఉండేది. కానీ తర్వాత మార్పులు చేశారు.
టైమ్డ్ ఔట్: ఒక బ్యాటర్ ఔట్ అయిన తర్వాత వచ్చే ఆటగాడు రెండు నిమిషాలలో క్రీజులోకి వచ్చి బంతిని ఎదుర్కోవాలి. కనీసం మూడు నిమిషాల కంటే ఎక్కువ సమయం తీసుకుంటే మాత్రం అతడిని ఔట్ గా ప్రకటించొచ్చు. తాజాగా ఏంజెలొ మాథ్యూస్ నిష్క్రమించింది ఈ నిబంధన వల్లే..
రిటైర్డ్: టైమ్డ్ ఒక బ్యాటర్ ఫీల్డ్ అంపైర్‌కు చెప్పకుండా ఫీల్డ్‌ను వదిలితే అది కూడా ఔట్ కిందకే వస్తుంది. అయితే ఏదైనా గాయం అయినప్పుడు సదరు బ్యాటర్ అంపైర్‌కు చెప్పకున్నా ఫీల్డ్ ను వదలొచ్చు. ఒకవేళ ఏదైనా కారణం వల్ల అంపైర్‌కు చెప్పకుండా ఫీల్డ్‌ను వదిలినా ప్రత్యర్థి సారథి అంగీకారం ఉంటే బ్యాటర్ తిరిగి తన ఇన్నింగ్స్‌ను కొనసాగించొచ్చు. లేదంటే అతడిని ‘రిటైర్డ్’ కింద ఔట్‌గా ప్రకటిస్తారు. టెస్టు క్రికెట్లో లంక బ్యాటర్లు మర్వన్ ఆటపట్టు, మహేళ జయవర్దెనేలు 2001లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్ ఆడుతూ ఇలా ఔటయ్యారు.