Eyes Health | వాయు కాలుష్యంతో కళ్లపై తీవ్ర ప్రభావం.. జాగ్రత్తలు పాటించకపోతే సమస్యలే..
వాయు కాలుష్యం పెరుగుతున్న కొద్దీ దాని ప్రభావం మన శ్వాసకోశ వ్యవస్థ, గుండె ఆరోగ్యంపైనే కాకుండా కళ్లపైనా తీవ్రంగా పడుతోంది. ముఖ్యంగా కాలుష్య స్థాయిలు అధికంగా ఉన్న సమయంలో కళ్లలో మంట, దురద, ఎర్రబడడం, నీరు కారడం, నిరంతరం పొడిబారడం వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి.
Eyes Health | వాయు కాలుష్యం పెరుగుతున్న కొద్దీ దాని ప్రభావం మన శ్వాసకోశ వ్యవస్థ, గుండె ఆరోగ్యంపైనే కాకుండా కళ్లపైనా తీవ్రంగా పడుతోంది. ముఖ్యంగా కాలుష్య స్థాయిలు అధికంగా ఉన్న సమయంలో కళ్లలో మంట, దురద, ఎర్రబడడం, నీరు కారడం, నిరంతరం పొడిబారడం వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. చాలామంది వీటిని చిన్నపాటి ఇబ్బందులుగా భావించి పట్టించుకోరు. అయితే చర్మంలాగే కళ్లు కూడా నేరుగా బయటి వాతావరణానికి బహిర్గతమవుతుంటాయి. గాలిలోని దుమ్ము, కాలుష్య కణాలు, ఇతర హానికర పదార్థాలు నేరుగా కళ్ల ఉపరితలాన్ని తాకడం వల్ల అవి త్వరగా ప్రభావితమవుతాయి.
గాలిలోని సూక్ష్మ ధూళి కణాలతో ప్రభావం..
పీఎం 2.5, పీఎం 10 వంటి సూక్ష్మ ధూళి కణాలు, భూమికి దగ్గరగా ఉండే ఓజోన్, నైట్రోజన్ డయాక్సైడ్, ఇతర కాలుష్య కారకాలు కళ్లపై ప్రభావం చూపుతాయి. కళ్లను తేమగా ఉంచుతూ, బయటి నుంచి వచ్చే హానికర పదార్థాల నుంచి రక్షించే కన్నీటి పొరను ఇవి దెబ్బతీస్తాయి. దీనివల్ల కళ్లు పొడిబారడం, మంట, ఎర్రబడడం, దురద, అసౌకర్యం వంటి సమస్యలు ఏర్పడతాయి. ఇప్పటికే పొడి కళ్ల సమస్య లేదా అలర్జీ ఉన్నవారిలో ఈ లక్షణాలు మరింత తీవ్రమవుతాయి. కాలుష్యం వల్ల కళ్ల ఉపరితలంలోని రక్తనాళాలు స్పష్టంగా కనిపించడం, ఏదో గుచ్చినట్లుగా అనిపించడం, విపరీతంగా నీరు కారడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. కాంటాక్ట్ లెన్సులు వాడేవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. కాలుష్యం ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువసేపు లెన్సులు ధరించడం వల్ల పొడిబారడం, చికాకు పెరిగే అవకాశం ఉంటుంది. వీలైనప్పుడు లెన్సులకు బదులుగా కళ్లద్దాలు ఉపయోగించడం మంచిది.
జాగ్రత్తలు పాటించాలి..
కాలుష్యం ఎక్కువగా ఉన్న సమయంలో కళ్లను రక్షించుకోవడానికి కొన్ని జాగ్రత్తలు పాటించాలి. కళ్ల వైద్యుల సూచన మేరకు తేమను అందించే కంటి చుక్కలను ఉపయోగించడం వల్ల పొడిబారడం, మంట తగ్గుతాయి. బయటకు వెళ్లేటప్పుడు సన్‌గ్లాసెస్ ధరించడం వల్ల దుమ్ము, గాలి, కాలుష్య కణాలు నేరుగా కళ్లను తాకకుండా కొంత రక్షణ లభిస్తుంది. కళ్లలో అసౌకర్యం ఉన్నప్పుడు కాంటాక్ట్ లెన్సులు ధరించకుండా కళ్లకు విశ్రాంతి ఇవ్వాలి. అలాగే ఫోన్, కంప్యూటర్ వంటి తెరలను ఎక్కువసేపు చూసేవారు 20-20-20 నియమాన్ని పాటించాలి. ప్రతి 20 నిమిషాలకు ఒకసారి, 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువును కనీసం 20 సెకన్ల పాటు చూడాలి. తెరలను చూస్తున్నప్పుడు కనురెప్పలు తక్కువగా ఆర్పడం వల్ల కళ్లలో తేమ తగ్గి పొడిబారడం, అలసట పెరుగుతాయి. ఈ అలవాటు కళ్లకు కొంత విశ్రాంతినిస్తుంది.
ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త..
కాలుష్యం ఉన్న ప్రాంతం నుంచి దూరంగా వెళ్లిన తర్వాత కొద్దిసేపటికి సాధారణ చికాకు తగ్గుతుంది. అయితే కళ్లలో ఎర్రదనం, అధికంగా నీరు కారడం, దురద, నొప్పి లేదా చూపు మసకబారడం వంటి లక్షణాలు కొనసాగితే నిర్లక్ష్యం చేయకూడదు. అకస్మాత్తుగా చూపులో మార్పులు రావడం, తీవ్రమైన కంటి నొప్పి లేదా నొప్పితో కూడిన ఎర్రదనం ఉంటే వెంటనే కంటి వైద్యుడిని సంప్రదించాలి. వాయు కాలుష్యం కేవలం ఊపిరితిత్తులకే పరిమితమైన సమస్య కాదు. గుండె, మెదడుతోపాటు కళ్ల ఆరోగ్యంపైనా ప్రభావం చూపుతుంది. రోజురోజుకూ పెరుగుతున్న కాలుష్యం, ఎక్కువవుతున్న తెరల వినియోగం నేపథ్యంలో కళ్ల సంరక్షణను కూడా రోజువారీ ఆరోగ్య అలవాట్లలో భాగం చేసుకోవడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | వాయు కాలుష్యంతో కళ్లపై తీవ్ర ప్రభావం.. జాగ్రత్తలు పాటించకపోతే సమస్యలే..
Anjeer fruit | తరచూ అంజీరా పండ్లను తింటే ఆ అనారోగ్య సమస్యలన్నీ దూరం.. అవేంటంటే..!
ఏఐటీయూసీ జాతీయ సమితి సభ్యులుగా కంచర్ల జమలయ్య, నరాటి ప్రసాద్
అమృత్ సరోవర్ చెరువుల వద్ద ఘనంగా రాజ్యాంగ దినోత్సవం
Fishermen Safe | ఏడుగురు మత్స్యకారులు సురక్షితం.. ఒడిస్సాకు చేరుకున్నట్లు గుర్తింపు
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

