డీఎంకే లెక్క మాట్లాడేటోళ్లుంటే?.. మీకెందుకు ఐఐఎం అనేటోళ్లా!
ఇంజినీరింగ్‌కి ఐఐటీలు ఎంత ప్రతిష్టాత్మకమైనవో, మేనేజ్మెంట్కి ఐఐఎంలు అంతే ప్రతిష్టాత్మకమైనవి. హైదరాబాద్‌కు ఇప్పటికీ ఐఐఎం లేని లోటు ఉంది. దేశంలో ఇప్పటికి 22 ఐఐఎంలు ఉన్నయి. ఒక్క మాటలో చెప్పాలంటే అతి చిన్న రాష్ట్రాల్లోనే ఐఐఎంలు లేవు.
- డీఎంకే పట్టుదలతో తమిళనాడుకు వచ్చింది
- మహారాష్ట్ర కూడా రెండోది సాధించింది
- హైదరాబాద్‌లో ఇప్పటికీ ఐఐఎం లోటే
- చిన్న రాష్ట్రం జార్ఖండ్‌కు ఇచ్చిన్రు.. తెలంగాణకు ఇవ్వను పొమ్మన్నరు
(నాగవర్ధన్ రాయల)
ఇంజినీరింగ్‌కి ఐఐటీలు ఎంత ప్రతిష్టాత్మకమైనవో, మేనేజ్మెంట్కి ఐఐఎంలు అంతే ప్రతిష్టాత్మకమైనవి. హైదరాబాద్‌కు ఇప్పటికీ ఐఐఎం లేని లోటు ఉంది. దేశంలో ఇప్పటికి 22 ఐఐఎంలు ఉన్నయి. ఒక్క మాటలో చెప్పాలంటే అతి చిన్న రాష్ట్రాల్లోనే ఐఐఎంలు లేవు. దేశానికి సరిహద్దున, అదికూడా తక్కువ భౌగోళిక విస్తీర్ణం, అతి తక్కువ జనాభా ఉన్న రాష్ట్రాల్లో ఏర్పాటు చేస్తే అడ్మిషన్లు సరిగా లేకపోతే వాటి ప్రతిష్ట తగ్గుతుంది. అందుకే అతి చిన్న రాష్ట్రాలైన గోవా, మణిపూర్, మిజోరం, త్రిపుర, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కింలలో ఐఐఎంలు ఏర్పాటు చేయలేదు. ఈ రాష్ర్టాల కంటే భౌగోళిక విస్తీర్ణం, జనాభా, ఆర్థిక వృద్ధి, విద్యార్థుల సంఖ్య పరంగా ఎంతో ముందున్న తెలంగాణలో ఐఐఎం లేదు. చిన్న రాష్ట్రమైన జార్ఖండ్‌లో ఐఐఎం ఉంది. యూపీఏ ప్రభుత్వంలో జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) పార్టీ భాగస్వామి. చిన్న పార్టీ అయినా దాని లోక్‌సభ సభ్యుల మద్దతు కేంద్ర ప్రభుత్వానికి చాలా అవసరం. దీంతో అటవీ ప్రాంతం, ఆదివాసీలు అధికంగా ఉండే ఈ రాష్ట్రం 2009లో ఐఐఎంను సాధించింది.
అదే యూపీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న డీఎంకే పార్టీ తమ రాష్ట్రమైన తమిళనాడుకు ఓ ఐఐఎంను 2011లో సాధించింది. లోక్‌సభకు 2014లో జరిగిన ఎన్నికల్లో యూపీఏ ఓడిపోయింది. ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. ఎన్డీఏలో తెలుగుదేశం కీలకమైన భాగస్వామ్య పార్టీ. సంఖ్యా బలంతో కేంద్రంలో, రాష్ట్రంలో చెలిమి నెరిపిన చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్‌కు ఐఐఎంను సాధించడంలో సఫలమైండు. మోదీ ప్రధానమంత్రి అయిన ఏడాదికే 2015లో విశాఖపట్నంలో ఐఐఎం ఏర్పాటైంది. అందరికీ అన్నీ ఇచ్చి మాకు మాత్రం ఐఐఎం ఎందుకియ్యవు అని ఎవరైనా అడిగితే.. బీజేపీ ప్రభుత్వం ఇచ్చేదేలేదంటున్నది. ఓ ఎంపీ అడిగితే.. హైదరాబాద్‌కు ఐఐఎం అవసరం లేదని కేంద్ర విద్యాశాఖ మంత్రి సుకంతా మజుందార్ మొహమాటం లేకుండా లోక్‌సభలో చెప్పిండు. ఇప్పటికే మస్త్ కాలేజీలున్నయ్. ఇగ సాలు. వాళ్లకు కొత్తగా ఇచ్చేదేం లేదని అన్నడు. అయినా తెలంగాణ ఎంపీలు మోదీ ప్రభుత్వ వివక్షకు వ్యతిరేకంగా మాట్లాడనీకి మొహమాటపడుతున్నరు. తెలంగాణ బీజేపీ ఎంపీలు నిరసన తెలపనీకి, పోరాడేందుకు వెనుకడుగు వేస్తున్నరు.
పొలిటికల్ మేనేజ్మెంట్
ముంబైలో పేరెన్నికగన్న ఎన్నో మేనేజ్మెంట్ కళాశాలలున్నయ్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, ముంబయి (ఐఐఎంబీ), ఎస్పీ జైన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ రిసెర్చ్, శైలేష్ జే మెహతా స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐటీ, ముంబై), జమునాలాల్ బజాజ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, సిడెన్హ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్-రిసెర్చ్ అండ్ ఎంట్రప్రెన్యూర్షిప్ ఎడ్యుకేషన్, ప్రిన్స్ ఎల్ఎన్ వెలింగ్కర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ అండ్ రిసెర్చ్, ఎస్ఐఇఎస్ కాలేజ్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్, సెయింట్ జేవియర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ రిసెర్చ్, చేతన్స్ రాంప్రసాద్ ఖండేల్వాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ రిసెర్చ్, లాలా లజపతి రాయ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ వంటి ప్రతిష్టాత్మక మేనేజ్మెంట్ విద్యాసంస్థలు యాభైకి పైనే ఉన్నయి.
అయినా రెండో ఐఐఎంను 2015లో మోదీ ప్రభుత్వం మంజూరు చేసింది. నాగపూర్‌లో దానిని ప్రారంభించింది. తెలంగాణకు ఇయ్యమంటే ఇచ్చేదే లేదు.. మస్త్ కాలేజీలున్నయని చిన్నచిన్న కాలేజీల లెక్కతీసి చెబుతున్నడు కేంద్ర మంత్రి. ‘ఇంకెందుకు ఐఐఎం’ అని కేంద్రమంత్రి అన్నప్పుడు… ముంబయిలో ఐఐఎం ఉన్నప్పుడు మళ్లా నాగ్‌పూర్‌కు (2015లో) ఇంకో ఐఐఎం ఎందుకని ఒక్క ఎంపీ అడగలేకపోయె. మన పొరుగున ఉన్న తమిళనాడు (త్రిసూర్), కర్ణాటక (బెంగళూరు), ఆంధ్రప్రదేశ్ (విశాఖపట్నం), ఛత్తీస్‌గఢ్ (రాయ్‌పూర్), మహారాష్ట్ర (ముంబై, నాగ్‌పూర్), ఒడిశా (సంబల్పూర్)లలో ఐఐటీలు ఉన్నయ్. ఐటీ, కెమికల్, ఫార్మా, డిఫెన్స్ రంగాల్లో దేశంలో అగ్రభాగాన ఉన్న తెలంగాణకు మాత్రం ఐఐఎం కలగా మిగిలింది. ఇక్కడ గెలిచి, ఇక్కడికి ఐఐఎం కావాలని అడిగే, కొట్లాడే ఎంపీలు ఉండి ఉంటే హైదరాబాద్‌లోనో, కాకుంటే వరంగల్లులోనో ఐఐఎం ఏర్పాటై ఉండేది. ఐఐఎం మంజూరులోనే ఇంత వివక్ష కనబడుతుంటే ఎన్నెన్ని రంగాల్లో ఎట్లెట్ల తెలంగాణకు అన్యాయం చేసి ఉంటరో అర్థం చేసుకోండి.
మద్దతు ఉండాలంటే.. అడిగింది ఇయ్యాలంతే!
మా మద్దతుతో మీ ప్రభుత్వం నిలబడాలంటే మాకు ఇయ్యాల్సిందేనంటూ డీఎంకే అడగంది లేదు. తమిళనాడుకు తీసుకపోనిది లేదు. దేశంలో సెంట్రల్ యూనివర్సిటీల స్థాపన ద్వారా మానవ వనరుల అభివృద్ధికి కృషి చేయాలని కేంద్ర ప్రభుత్వం అనుకున్నది. యూపీఏ క్యాబినెట్లో ఉన్న డీఎంకే అందులో మా వాటా ఏందని అడిగింది. వాస్తవానికి సెంట్రల్ యూనివర్సిటీలు లేని రాష్ర్టాల్లో కొత్తగా ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. అదంతా జాన్తానై మాకోటి ఇయ్యాల్సిందేనని అడిగినరు. దేశంలో మొట్ట మొదట ఏర్పడిన మూడు యూనివర్సిటీల్లో చెన్నై ఒకటి. దీనికి సెంట్రల్ యూనివర్సిటీ హోదా ఉంది. తమిళనాడు పక్కనే ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఇంకో సెంట్రల్ యూనివర్సిటీ ఉంది. రెండు సెంట్రల్ యూనివర్సిటీలు అందుబాటులో ఉంటే ఇంకోటి ఎందుకని అన్నా మా మద్దతు కావాలంటే మాకు ఇయ్యాలంతే అన్నట్టుగా డీఎంకే పార్టీ పట్టుబట్టింది.
అనుకున్నది సాధించింది. తమిళనాడుకు మంజూరైన సెంట్రల్ యూనివర్సిటీని ఎక్కడ ఏర్పాటుచేయాలని ఆలోచిస్తే, కరుణానిది తన సొంత జిల్లాకు తీస్కపోయిండు. అట్ల తిరువారుర్‌లో కేంద్రీయ విశ్వవిద్యాలయ స్థాపన జరిగింది. ఆనాటికి ఆ పట్టణ జనాభా కేవలం యాభై వేలు మాత్రమే. చిన్న మున్సిపాలిటీకి కేంద్రీయ విశ్వవిద్యాలయం సాధించడం చిత్రమని అనుకోవద్దు. డీఎంకే పట్టుబడితే ఎదైనా సాధ్యమేనని అనుకోవాలి. ఐఐఎంను కూడా మంజూరు చేస్తుంటే అదీ ఒకటి కావాలని డీఎంకే కోరింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, తిరుచ్చిని ఏర్పాటు చేసుకున్నది. యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు అత్యధిక ఎంపీ స్థానాల్లో ప్రాతినిధ్యం ఉంది. జాతీయ పార్టీ పేరే కానీ రాష్ర్టానికి ఆ ఎంపీలు సాధించిందేమీ లేదు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

