విండ్ ఫోన్.. అద్భుతమైన, భావోద్వేగభరితమైన వేదిక
ఈ ఫోన్‌కు ఎలాంటి కనెక్షన్ ఉండదు. ఏ నెంబర్‌కు ఫోన్ చేసినా.. కనెక్ట్ కాదు. కానీ, మీ గుండెలోని దుఃఖాన్ని కరిగించి.. మనసును తేలిక చేస్తుంది విండ్ ఫోన్. ప్రియమైనవారు కోల్పోయిన వారికి ఇదో అద్భుతమైన, భావోద్వేగభరితమైన వేదికగా నిలుస్తుంది.
నిన్ను తలచి.. ఫోన్ కలిపి!
మనిషి జీవితంలో అత్యంత భరించలేని క్షణం.. తనకు అత్యంత ప్రియమైన వారిని కోల్పోవడం. ఆ శూన్యతను, ఆ బాధను మాటల్లో వర్ణించడం అసాధ్యం. మరణం.. మనుషులను శాశ్వతంగా దూరం చేస్తుంది. కానీ, వారిపై ఉన్న ప్రేమను, జ్ఞాపకాలను మాత్రం ఏ శక్తి కూడా చెరిపేయలేదు. అందుకే, పోయినవారు తిరిగిరారనే చేదు నిజాన్ని చాలామంది జీర్ణించుకోలేరు. తమ మనసులోని భావాలను వారితో ఒక్కసారైనా పంచుకోవాలని పరితపిస్తుంటారు. అలాంటివారి కోసం జపాన్‌లో ఒక అద్భుతమైన, భావోద్వేగభరితమైన వేదిక ఉంది. అదే.. విండ్ ఫోన్!
జపాన్‌లోని ఓట్సుచి పట్టణంలో.. ఓ కొండపైన తోటలో ఈ ‘విండ్ ఫోన్’ ఉంది. బయటి నుంచి చూస్తే సాధారణ, పాతకాలపు టెలిఫోన్ బూత్లాగే కనిపిస్తుంది. కానీ, దీని ప్రత్యేకత అంతకుమించి. మనసులోని భావాలను, మరణించిన ప్రియమైనవారితో పంచుకోవడానికి ఏర్పాటు చేసిన ఒక ‘మౌన వారధి’ ఇది. ఈ ఫోన్‌కు ఎలాంటి కనెక్షన్ ఉండదు. ఏ నెంబర్‌కు ఫోన్ చేసినా.. కనెక్ట్ కాదు. కానీ, మీ గుండెలోని దుఃఖాన్ని కరిగించి.. మనసును తేలిక చేస్తుంది.

Kaze No Denwa 2
హృదయ విదారక చరిత్ర
ఈ విండ్ ఫోన్‌ను ఇటారు సాసాకి అనే గార్డెన్ డిజైనర్ 2010లో నిర్మించారు. తన ప్రాణానికి ప్రాణమైన కజిన్‌ను.. క్యాన్సర్ కారణంగా కోల్పోయారాయన. ఆ దుఃఖాన్ని తట్టుకోలేక, మానసికంగా కుంగిపోయిన సాసాకి.. మరణించిన తన బంధువుతో ఎలాగైనా మాట్లాడాలనే తపనతో ఈ వైర్లేని టెలిఫోన్ బూత్‌ను తన తోటలో ఏర్పాటు చేసుకున్నారు. ఫోన్ పని చేయకపోయినా, రిసీవర్ పట్టుకుని మాట్లాడి.. తన మనసులోని బాధను దించుకునేవారు. సరిగ్గా ఏడాది తర్వాత.. అంటే 2011 మార్చిలో జపాన్ను భారీ భూకంపం – సునామీ అతలాకుతలం చేసింది. ఓట్సుచి పట్టణంలోనే వేలాది మంది ప్రాణాలను బలితీసుకుంది. ఈ ఘోర విషాదంలో ఎంతోమంది తమ తల్లిదండ్రులను, పిల్లలను, జీవిత భాగస్వాములను కోల్పోయారు. అనాథలుగా మిగిలారు. వారి మానసిక వేదనను అర్థం చేసుకున్న సాసాకి.. తన వ్యక్తిగత టెలిఫోన్ బూత్‌ను ప్రజలందరి కోసం..
‘విండ్ ఫోన్’ పేరుతో బహిరంగంగా తెరిచారు.
ఎలా పని చేస్తుంది?
ఈ ఫోన్ బూత్‌లోకి వెళ్లిన వారు.. తమ బాధను దిగమింగుకుంటూ రిసీవర్ని చెవికి అద్దుకుంటారు. డయల్ ప్యాడ్‌పై తమ ప్రియమైనవారి ఫోన్ నంబర్ నొక్కి.. మాట్లాడటం ప్రారంభిస్తారు. గుండెల్లో దాచుకున్న కన్నీళ్లను, ఆవేదనను నిస్సంకోచంగా బయటపెడతారు. ఆ మాటలను గాలి మోసుకెళ్తుందని, తమ ప్రియమైన వారికి చేరుస్తుందని సాసాకి భావించేవారు. అందుకే దీనికి ‘విండ్ ఫోన్’ అని పేరు పెట్టారు.

Kaze No Denwa 3
మానసిక ఉపశమనం
ప్రియమైనవారి మరణాన్ని అంగీకరించలేక కుంగిపోయేవారికి ఇలాంటి ప్రదేశాలు ఒక గొప్ప మానసిక ఊరటను ఇస్తాయని మానసిక వైద్యులు కూడా చెబుతున్నారు. అందుకే, ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే ఈ ఫోన్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. లక్షలాది మంది సందర్శకులు, ప్రియమైన వారిని కోల్పోయిన శోకతప్తులు ఇక్కడికి వచ్చి ఓదార్పు పొందుతున్నారు. ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలు ఓట్సుచికి వచ్చి.. ఈ ఫోన్ ద్వారా తమ మౌన సందేశాలను వినిపిస్తున్నారు. ఇప్పటివరకు లక్షకు పైగా ప్రజలు ఈ విండ్ ఫోన్‌ను సందర్శించారు. జపాన్ స్ఫూర్తితో అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్, జర్మనీ, నెదర్లాండ్స్ వంటి అనేక దేశాల్లో ఇలాంటి వందలాది ‘విండ్ ఫోన్స్’ను ఏర్పాటు చేస్తున్నారు.

Kaze No Denwa 1
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

