వద్దన్నా వాళ్ల సంభాషణ మా చెవుల్లో పడక మానదు కదా!
నా దగ్గర ట్యూషన్ చదువుకునే పిల్లలు ఎక్కువయిన కొద్దీ వాళ్లను ఎక్కడ కూర్చోబెట్టాలో తెలియక ఇంటి చుట్టూ ఎక్కడ శుభ్రంగా ఉంటే అక్కడ కూర్చోమనేదాన్ని. ఓ క్లాసు వాళ్లు రూంలో, ఇంకొందరు ముందు హాల్లో కూర్చుంటే ఇంటి ముందున్న మెట్ల మీద మిగతా క్లాసుల పిల్లలు కూర్చొని చల్లగాలికి హోం వర్క్ చేసుకుంటూ ఉండేవారు.
రమాయణం, చదువు నేర్పిన రోజుల్లో 8
ప‘రమా’నందమ్మ శిష్యులు
ఒక్కోసారి ఇంటి ముందు వాకిట్లో చాపలు వేసుకుని కూడా కూర్చొని రాసుకుంటూ ఉండేవారు. మధ్య గ్యాప్‌లో కొందరు ఆడుకుంటూ ఉండేవారు. నేను మూడు గంటలపాటు నిర్విరామంగా వాళ్లకు బోధిస్తుండేదాన్ని. నాన్న ఎక్కువగా ముందు రూమ్‌లోనే గడిపేవాడు. అందుకని నేను ట్యూషన్ చెప్తున్న సమయంలో ఆయనకి కొంచెం ఇబ్బందిగా ఉండేది అని నాకు అనిపించింది. కాకపోతే అట్లా ఇబ్బందిగా ఉందని ఆయన ఏనాడూ చెప్పలేదు. ఆ సమయంలో ఇంటి ముందు వాకిట్లోనో, ఇంటి పక్కన ఖాళీ స్థలంలోనో అటూ ఇటూ తిరుగుతూ ఉండేవాడు. ఓసారి ఏమైందంటే తొమ్మిదో తరగతి పిల్లలకి లెక్కలు చెప్తున్నాను. ఇంతలో మా పొలంలో పనిచేసే రామయ్య వచ్చాడు. వాళ్ల సంభాషణ వద్దన్నా మా అందరి చెవుల్లో పడక మానదు కదా! ఆ మాటలు ఇట్లా సాగాయి. ఏమైంది? పైసలు తెచ్చినవా? నాన్న అంటున్నాడు.
తేలేదయ్యా! ఇయ్యలేదు రామయ్య జవాబు.
ఎందుకియ్యలేదు? ఏం పుట్టింది?
సేటు ఇంట్ల లేడయ్యా
ఎటు మిడికిండట? ఒచ్చేదాక అక్కడ్నే కూలబడకపోయినవా?
ఎమ్మో అయ్యా! ఇంటికి తాళం పెట్టి ఉన్నది, ఎవ్వలు లేరు
ఎటు పోయిండో కనుక్కోకపోయినవ్?
పక్కపొంటోళ్లను అడిగిన్నయ్యా! దేవుని దగ్గరికి పోయిన్రట!
ఏ దేవుని దగ్గరికి పోయిన్రట?
తిరుపతి. తిరుపతికి పోయిన్రు! మెల్లటి గొంతులో వినిపించింది. ఎవరా అని చూస్తే వనజ, నా స్టూడెంట్!
మళ్ల ఎప్పుడు ఒస్తడట?
ఎమ్మో అయ్యా! ఎప్పుడొచ్చి పాడయితడో!
తిప్పల మోపయింది. ఈడికి వానింటి సుట్టు పదిసార్ల తిరిగిన. ఎన్నడొచ్చి సస్తడో ఏమో!
ఎల్లుండి .. ఎల్లుండి ఒస్తరు మళ్లీ మెల్లగా అన్నది వనజ.
ఎల్లుండి ఒచ్చేదానికి పైసలిచ్చి పోతె అయిపాయే గద! ఇవుతల ఎరువులిచ్చినోడు, ఇత్తనపొడ్లు ఉద్దెరకిచ్చినోడు, బట్టల దుకాణపోడు, కిరాణ దుకాణపోడు పైసలకు పీకబట్టిరి. వాండ్లు వడ్డీలు, మిత్తీలు డబల్, త్రిబల్ ఏస్తరు. అయినా గూడ మనం ఒడ్లు గాయన మిల్లుల పోసి నెలాయే! పైసలు తెల్లారి అడిగినమా, మర్నాడు అడిగినమా? మనం బాకీ తెచ్చిన దగ్గర ఎంతకని బొంకాలె? వారానికి ఇస్తనని మోసకారి మాటలు చెప్పుడెందుకు? తిరుపతి పొయ్యెటానికి పైసలున్నయి గాని, మనకు ఇచ్చేటానికి మటుకు వుండవా? మనిషికి నియ్యత్ లేదు! నాన్న ఎంతో బాధపడితే గానీ అన్ని మాటలు అనడు.
నాన్న ఆవేదన చూసి రామయ్య ఇంకా రెచ్చిపోయాడు. ‘అవునయ్యా! దొంగ గాడిది కొడుకు! ఇయ్యాల ఇస్తనని నమ్మబలికిండు. ‘ఊరికి పోతాన’ అని నాతోటి సుత అనలే!’
‘నువ్వు జవాబులు చెప్తున్నవు, నీకేం తెల్సు వనజా?’ నాకు అనుమానమొచ్చి వనజను అడిగాను.
‘మా మామయ్యే టీచర్! అన్ని గంతే! ఒకటి చెప్తడు, ఇంకొకటి చేస్తడు. మా అమ్మ కూడా వాండ్ల తోటే తిరుపతికి పొయ్యింది. ఎల్లుండి ఒస్తరు’ బిక్క మొహంతో చెప్పింది వనజ.
రామయ్య ఇంకేమేం బూతులు మాట్లాడుతాడో, అవన్నీ వనజ విని ఏమనుకుంటుందోనని భయమేసి నేను పెద్దగా ‘నానా! వనజ వాండ్ల మామయ్యేనట మన ఒడ్లు కొన్నది. ఎందుకంటే నిన్ననే తిరుపతికి పోయింది వీళ్లేనట’ అని అరచినంత పనిచేశాను.
నాన్న వెంటనే ‘సరే.. సరే, ఏం జేస్తం మరి!’ అని ఆ టాపిక్ ఆపేసాడు. ఒక్కోసారి మనం అక్కడ ఎవరున్నది కూడా చూడకుండా మాట్లాడేస్తుంటాం మరి!
కొందరు తల్లిదండ్రులు నా దగ్గరికి వచ్చి మా పిల్లలు బడి నించి ఇంటికి రాంగనే ఆడుతమంటున్నరు. మీ దగ్గరయితే కూసోబెడతరని పంపిద్దమనుకుంటున్నం అనేవారు. నాకు వాళ్లను చూస్తే అయ్యో! తల్లులారా? ఏల తొందర? అనాలనిపించేది.
‘చిన్నపిల్లల్ని కాసేపు ఆడుకోనీయకుండ ఏం చదువులమ్మా? పిల్లలన్నాక మినిమం జీవితంల ఒకటి రెండు సార్లన్నా వానల పొట్టు పొట్టు తడువాలె, మూడ్నాలుగు సార్లన్న మామిడి చెట్లో జామ చెట్లో ఎక్కి కాయలు తెంపాలె, చింత చెట్టు కొమ్మలకు ఊగాలె, అయిదారు సార్లన్న ఉరికి ఉరికి కింద పడి మోకాళ్లు కొట్టుక పోవాలె, మోచేతులు గీరుక పోవాలె గాని, ఇరువై నాలుగ్గంటలు కూచోని చదివేటందుకు వాండ్లేమన్న రుషులా, మునులా?’ అందామనుకునేదాన్ని వాళ్లతో. కానీ, టీచర్ని కదా, మరీ కొప్పేసుకుని చీర కట్టుకుని బెత్తంపట్టుకుని ‘కోడలు దిద్దిన కాపురం’లో సావిత్రిలా ‘నీ ధర్మం.. నీ సంఘం.. నీ దేశం నువు మరవొద్దు’ అనకపోయినా పిల్లవేషాలు వేయొద్దు కదా! పైగా ఎవరికీ పెద్ద తేడా లేకపోయినా… మా నానమ్మకు మాత్రం నేను చదువు చెప్పడం, ఎక్కువమంది పిల్లలు రావడం బాగా ఇష్టంగా ఉండేది. ‘నువ్వు చిలుకవు! ముద్దుగ చదువు చెప్తున్నవు. అయితె మానె తియ్యి! ఎంత మందొస్తే గంత మందే అయిరి. పైసలన్న ఒస్తయి. మనింట్ల జాగ లేదా ఏంది? దప్పయితే తాగేటందుకు బాయి నిండ మంచి నీళ్లుండే!’ అనేది. అలా 1978 లో మొదలైన నా ట్యూషన్స్.. నాకు బ్యాంకులో ఉద్యోగం వచ్చేదాకా అంటే 1985 దాకా కొనసాగాయి.
– నెల్లుట్ల రమాదేవి, రచయిత్రి
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

