వ్యక్తి పరివర్తన గీతాసారం
అచ్యుతా! నీ కృపా ప్రసాదంచే, నాలోని మోహము పూర్తిగా నశించినది. స్మృతిని పొంది, సంశయరహితుడనైనాను. కనుక నీ ఆజ్ఞను తలదాల్చెదను అంటున్నాడు, అర్జునుడు. అతనిలో సహజంగా ఉన్న సామర్థ్యాన్ని, కర్తవ్య నిష్ఠను, వివేకాన్ని మోహమనే అజ్ఞానం కప్పివేసింది.
నష్టోమోహః స్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదాన్మయాచ్యుత
స్థితోస్మి గతసందేహః కరిష్యే వచనం తవ॥
(భగవద్గీత 18-73)
అచ్యుతా! నీ కృపా ప్రసాదంచే, నాలోని మోహము పూర్తిగా నశించినది. స్మృతిని పొంది, సంశయరహితుడనైనాను. కనుక నీ ఆజ్ఞను తలదాల్చెదను అంటున్నాడు, అర్జునుడు. అతనిలో సహజంగా ఉన్న సామర్థ్యాన్ని, కర్తవ్య నిష్ఠను, వివేకాన్ని మోహమనే అజ్ఞానం కప్పివేసింది. నివురుగప్పిన నిప్పుపై బూడిదను తొలగిస్తే అగ్ని జ్వలించినట్లు, కృష్ణుని ఉపదేశం ద్వారా అర్జునుడిలోని సహజ శక్తి సామర్థ్యాలు వెలుగుచూశాయి.
యుద్ధము చేయడానికి సమరాంగనానికి వచ్చిన అర్జునుడు ఉభయసేనల్లో ఉన్న బంధుమిత్రులను చూసి శోకసంతప్త చిత్తుడై, స్వజన సంహారం చేయలేనని, మనసు భ్రమకు గురవుతున్నదని, గాండీవం జారిపోతున్నదని చెపుతూ రథముపై కూలబడిపోయాడు. ‘నేను నావారు’ అన్నది మోహం. ఇప్పుడు ఆ మోహం పూర్తిగా తొలగిపోయినదని, స్మృతిని పొందానని, కర్తవ్యపాలనకు సిద్ధమయ్యాడు. ‘స్మృతి’ అంటే కేవలం గత విషయాలను గుర్తుకు తెచ్చుకోవడమే కాదు. తన ధర్మాన్ని, కర్తవ్యాన్ని గుర్తించడం. మోహానికి లోనైనా అర్జునుడిపై కృష్ణుడు కోపించలేదు..
వివేకంతో ఆలోచించమన్నాడు. అర్జునుడు అడిగిన ప్రతి సందేహాన్నీ సహనంతో తీర్చాడు. చివరగా నీకు ఎలా తోస్తే అలా చేయమని చెప్పాడు (యథేఛ్ఛసి తథాకురు). కృష్ణుడి మార్గదర్శనలో తెలివిని పొందిన అర్జునుడు కురుక్షేత్రంలో విక్రమించాడు.
భగవద్గీత వ్యక్తి పరివర్తనా విధానానికి పెద్దపీట వేస్తుంది. అర్జునుడు ‘నకాంక్షే విజయం కృష్ణా నచ రాజ్యం సుఖానిచ’ (విజయం అవసరంలేదు, రాజ్యభోగాలు, సుఖాలూ అవసరం లేదు) అన్న స్థితి నుంచి ఫలితాపేక్ష లేకుండా కర్తవ్యాన్ని పాలించే స్థితికి పరివర్తన చెందాడు. సమర్థుడే కానీ ‘నేను నావారు’ అనే మోహ సముద్రంలో మునిగి లక్ష్యం ఏమిటో గమనించే స్మృతిని మరిచాడు. ప్రతివ్యక్తిలో అంతర్గతంగా ప్రజ్ఞ (విషయాన్ని సరిగా గ్రహించి, విచక్షణతో నిర్ణయించగల సామర్థ్యం) ఉంటుంది. ప్రజ్ఞానం (ఉన్నతమైన జ్ఞాన స్వరూపాన్ని సూచించేది) నిలుస్తుంది. కానీ అవన్నీ నిద్రావస్థలో జడమై ఉండటం చేత, వాటిపై మోహమనే ముసుగు కప్పి ఉండటం చేత, సహజమైన ‘ఎరుక’ లేదా ‘తెలివి’ మరుగున పడింది. కృష్ణుడి ప్రేరణతో అర్జునుడి మోహము క్షయమై, సంశయాలన్నీ తొలగిపోయి, స్మృతి వెలుగుచూసింది, కర్తవ్యం స్ఫురించింది.
ఒక సమర్థుడైన నిర్వహణాధికారిలోని జ్ఞానాన్ని, అనుభవాన్ని, నైపుణ్యాన్ని గుర్తించి అత్యంత ముఖ్యమైన కార్యం అప్పగించడమైనది. అయితే, భావోద్వేగాలు అతని ఆలోచనలను ప్రభావితం చేయగా, తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించలేనని భావించిన అధికారి చతికిలబడ్డాడు. అతని సమర్థత తెలిసిన యజమాని అతనికి ప్రేరణనిచ్చి కార్యోన్ముఖుని చేశాడు. ఈ పరివర్తనా క్రమంలో అధికారి నాలుగు దశలను దాటాడని భావించవచ్చు. మొదటి దశలో కార్యాన్ని చక్కగా నిర్వహిస్తే రాజ్యం లభిస్తుందనే సాధారణమైన ప్రేరణ ఇవ్వడమైనది. కానీ, అధికారి రాజ్యసుఖాలు అవసరంలేదని భావించాడు. అధికారి స్థాయిని అవగాహన చేసుకున్న యజమాని, జటిలమైన సమస్యకు లేదా సంక్షోభానికి లోతైన పరిష్కారాన్ని చూపాలని భావించాడు.
అధికారి తన సమస్య ఏమిటో గుర్తించి, ఆ సంక్షోభాన్ని తానుగా అధిగమించలేనని భావించి, యజమానిని ఆశ్రయించాడు. సాధారణంగా తెలియనితనం లేదా అమాయకత్వం కన్నా తన అమాయకతను గుర్తించలేని లేదా ఒప్పుకోలేని మానసికస్థితి క్లిష్టమైనది. అయితే అధికారి ‘నన్ను నీ శిష్యుడిగా’ స్వీకరించి కర్తవ్యాన్ని ఉపదేశించమని యజమానిని ఆశ్రయించాడు. దీనినే పరివర్తన దశలో తెలుసుకోవడానికి సన్నద్ధత అంటారు. అధికారిలోని ఈ వినయం.. సమర్థతను పెంచుకునేందుకు అర్హతగా భావించవచ్చు. అధికారి సమస్యను యజమాని శ్రద్ధగా విన్నాడు. పరిష్కార దిశలో అధికారిని సన్నద్ధం చేశాడు.
అధికారి-యజమాని మధ్య సంభాషణలు, చర్చలు జరిగాయి. స్పష్టత, సమగ్రత ఆవిష్కృతమయింది. జ్ఞానం ఒకరి నుంచి మరొకరికి ప్రసరించింది. అధికారిలోని సందేహాలు, సంశయాలన్నీ మబ్బులవలె ఒక్కొక్కటిగా తొలగిపోయాయి. ఈ ప్రక్రియలో యజమాని ఇలా చేయమని నిర్బంధించలేదు. నా మాటలే శిరోధార్యాలని శాసించలేదు. విసుగు పడకుండా ప్రశ్నలను విన్నాడు, ఓపికతో తార్కికంగా వివరించాడు, సహనంతో సందేహాలను తీర్చాడు, అనునయంతో అపోహలను తొలగించాడు. వాత్సల్యంతో అడ్డంకులన్నింటికీ వైవిధ్యభరితమైన ప్రత్యామ్నాయాలను చూపాడు. అవగాహన చేసుకున్న అధికారి నిబద్ధతతో కూడిన సమర్థతను సాధించాడు. నిలకడగా కార్యాన్ని నిర్వహించాడు, విజయధ్వానాన్ని ప్రపంచానికి వినిపించాడు. మనసును ఆక్రమించుకున్న గందరగోళం అదృశ్యమయింది. తెలివి ప్రత్యక్షమయింది. అనుమానాలు నివృత్తి చెందాయి. అంతర్గతంగా సహజంగా ఉండే ప్రతిభావ్యుత్పత్తులు జాగృతమయ్యాయి. ‘నేను సాధించగలను’ అనే వైఖరి ప్రకటితమయింది. తనలోని విజ్ఞానం, నైపుణ్యాలు ప్రభావాన్ని చూపాయి.
ప్రేరణ (కార్యోన్ముఖతకు ప్రాథమిక ప్రేరణ కలిగించడం), సన్నద్ధత (తన సమస్యను గుర్తించి, నేర్చుకోవడానికి సిద్ధపడటం), అవగాహన (జ్ఞానాన్ని పొందడం, సందేహాలను నివృత్తి చేసుకోవడం, స్పష్టత సాధించడం), ఆచరణలు (నిబద్ధతతో బాధ్యతను స్వీకరించి కార్యసాధనకు పూను కోవడం) సమన్వయమై కార్యం సాకారమయింది.
నాయకుడు అంటే తన సహచరులకు ఆదేశాలు ఇవ్వడం మాత్రమే కాదు. సహచరులలోని సామర్థ్యాన్ని వారే గుర్తించేలా చేయడమే నాయకత్వ లక్షణం. గీత వ్యక్తికి కర్తవ్యాన్ని మాత్రమే బోధించదు… కర్తవ్యాన్ని నిర్వహించగలిగే వ్యక్తిగా ఆ వ్యక్తిలో పరివర్తన తెస్తుంది. కృష్ణుడు అర్జునుడిపై తన నిర్ణయాన్ని బలవంతంగా రుద్దలేదు. ‘యథేచ్ఛసి తథాకురు’ అంటూ అతని విచక్షణకే నిర్ణయాధికారాన్ని వదిలివేశాడు.
పాలకుర్తి రామమూర్తి…?
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

