మైక్రో మోమెంట్స్.. అనుబంధాన్ని, నమ్మకాన్ని రెట్టింపు చేస్తాయి
దంపతుల మధ్య బంధం అంటే.. గ్రాండ్ వేడుకలు, ఖరీదైన గిఫ్ట్‌లు, సుదూర విహారయాత్రలు కాదు. ఒక బంధం ఎంత బలంగా ఉందో నిర్ణయించేది.. రోజువారీ జీవితంలో చోటుచేసుకునే చిన్న చిన్న క్షణాలే! వీటినే ‘మైక్రో మోమెంట్స్' అంటారు. ఒకరికొకరు కంటి చూపుతో సైగ చేసుకోవడం, ఒత్తిడిలో ఉన్నప్పుడు చిన్న స్పర్శ లాంటివే భాగస్వాముల మధ్య అనుబంధాన్ని, నమ్మకాన్ని రెట్టింపు చేస్తాయి.
మన్తరంగం
బంధాన్ని నిలిపేవి చిన్ని క్షణాలే!
మానసిక శాస్త్రవేత్త డాక్టర్ జాన్ గొట్మెన్ వీటిని ‘ఎమోషనల్ బిడ్స్’ అని పిలుస్తారు. అంటే రోజులో ఒక భాగస్వామి శ్రద్ధ, ఆప్యాయత కోరుతూ ఇచ్చే చిన్న ఆహ్వానాలు. అవతలి వ్యక్తి ఆ క్షణంలో ఎలా స్పందిస్తారు అనే దానిపైనే బంధం నాణ్యత ఆధారపడి ఉంటుంది.
ఎందుకు ముఖ్యం?
ఎమోషనల్ బ్యాంక్ అకౌంట్: ప్రతి చిన్న ఆప్యాయమైన క్షణం మీ బంధమనే బ్యాంక్ ఖాతాలో వేసే డిపాజిట్ లాంటిది. భవిష్యత్తులో గొడవలు లేదా ఒత్తిళ్లు వచ్చినప్పుడు ఈ డిపాజిట్లే బంధాన్ని విడిపోకుండా కాపాడుతాయి.
‘నేను నీకు ఉన్నాను’ అనే నమ్మకం: పెద్ద సమస్యలు వచ్చినప్పుడు మాత్రమే కాకుండా, రోజూ చిన్న చిన్న విషయాల్లో మీ భాగస్వామికి మీరు ప్రాధాన్యం ఇస్తున్నారని ఇది తెలియజేస్తుంది.
సురక్షితమైన భావన: టీవీ వైపే చూడకుండా, భాగస్వామి చెప్పేది వినడం వల్ల వాళ్లకు తమ మాటలకు విలువ ఉందనే భావన కలుగుతుంది.
మెదడుపై సానుకూల ప్రభావం..
ఈ చిన్న చిన్న క్షణాలే మెదడుపై చాలా సానుకూలమైన ప్రభావాన్ని చూపుతాయి. మానసిక శాస్త్రం, న్యూరో సైన్స్ ప్రకారం, ఈ చిన్న క్షణాలు మెదడులోని రసాయన వ్యవస్థ, భావోద్వేగాలను ఎలా మారుస్తాయో చూద్దాం.
1.ఆక్సిటోసిన్ విడుదల
భాగస్వామి ఆప్యాయంగా తాకినప్పుడు, నవ్వుతూ చూసినప్పుడు ‘ఆక్సిటోసిన్’ విడుదల అవుతుంది. దీన్ని ‘లవ్ హార్మోన్’ అంటారు. ఇది ఇద్దరి మధ్య నమ్మకాన్ని, అనుబంధాన్ని పెంచుతుంది. భద్రతా భావాన్ని కలిగిస్తుంది.
2. డోపమైన్-రివార్డ్ సిస్టమ్
ఒక చిన్న ప్రశంస లేదా భాగస్వామి నుంచి వచ్చే సానుకూల స్పందన మెదడులో ‘డోపమైన్’ స్థాయులను పెంచుతుంది. ఇది మెదడులోని రివార్డ్ సిస్టమ్‌ను ఉత్తేజితం చేసి, మనకు తాత్కాలిక ఉత్సాహాన్ని, మానసిక ఉల్లాసాన్ని ఇస్తుంది.
3. కార్టిసాల్ తగ్గింపు
ఆఫీస్ పనులు, ఒత్తిళ్ల వల్ల మెదడులో ‘కార్టిసాల్’ పెరిగిపోతుంది. సాయంత్రం ఇంటికి వెళ్లాక భాగస్వామి ఇచ్చే ఒక చిన్న చిరునవ్వు మెదడుకు ‘ఇక్కడ మనం సురక్షితంగా ఉన్నాము’ అనే సంకేతాన్ని పంపిస్తుంది. దీనివల్ల కార్టిసాల్ స్థాయులు తగ్గి, మెదడు ప్రశాంత స్థితికి చేరుకుంటుంది.
4. న్యూరోప్లాస్టిసిటీ బంధం బలపడటం
మెదడు నిరంతరం కొత్త విషయాలను నేర్చుకుంటూ, అనుభవాలను బట్టి మారుతూ ఉంటుంది. రోజూ ఇలాంటి మైక్రో మోమెంట్స్ పునరావృతమైనప్పుడు, మెదడులో సానుకూల ఆలోచనలకు సంబంధించిన న్యూరల్ పాత్‌వేస్ మరింత బలపడతాయి. దీనివల్ల భాగస్వామి పట్ల సానుకూల దృక్పథం పెరుగుతుంది.
5. అమిగ్డాలా శాంతించడం
మెదడులో భయం, కోపం, ఆందోళనలను నియంత్రించే భాగమే ‘అమిగ్డాలా’. భాగస్వామి మధ్య చిన్న గొడవలు లేదా దూరం పెరిగినప్పుడు ఇది యాక్టివ్ అవుతుంది. అయితే, చిన్న ఆప్యాయతా క్షణాలు ఈ అమిగ్డాలాను శాంతింపజేసి, మెదడులోని హేతుబద్ధంగా ఆలోచించే భాగాన్ని మళ్లీ అగ్రస్థానంలోకి తీసుకువస్తాయి.
ఇలా చేసి చూడండి..
దంపతుల మధ్య రోజువారీ జీవితంలో ఎలాంటి పెద్ద కష్టాలు లేదా ప్రత్యేక సందర్భాలు లేకుండానే సహజంగా చోటుచేసుకునే కొన్ని అందమైన ‘మైక్రో మోమెంట్స్’ ఇలా ఉంటాయి. వీటిని పాటించండి.
– నిద్ర లేవగానే ఫోన్ బదులుగా, పక్కనే ఉన్న భాగస్వామిని చూసి ఒక చిరునవ్వు నవ్వడం. ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నప్పుడు, ఒకరు మరొకరికి కాఫీ కప్పును చేతిలో పెడుతూ చిన్నగా భుజం తట్టడం.
– ఆఫీస్‌కు లేదా బయటికి వెళ్లే ముందు హడావుడిలో ఉన్నప్పటికీ, ఒక 5 సెకన్ల పాటు హత్తుకోవడం లేదా నుదుటిపై ఒక చిన్న కిస్ ఇవ్వడం.
– బయట ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది, జాగ్రత్తగా వెళ్లు’ అని గేటు దగ్గర నుంచి చేతితో సైగ చేస్తూ బై చెప్పడం.
– పని మధ్యలో సమయం దొరికినప్పుడు ‘లంచ్ చేశావా?’, ‘ఈరోజు నీ మీటింగ్ ఎలా ఉంది?’ అని ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టడం. బయట నడుస్తున్నప్పుడు లేదా షాపింగ్ చేస్తుస్తున్నప్పుడు భాగస్వామికి ఇష్టమైన వస్తువు కనిపించి ఫొటో తీసి పంపడం. ‘ఇది చూస్తే నీవే గుర్తుకొచ్చావు’ అని చెప్పడం.
– రోజంతా అలసిపోయి ఇంటికి రాగానే, ఒకరికొకరు ఎదురువెళ్లి హ్యాపీగా నవ్వుతూ ‘ఈరోజు ఎలా గడిచింది?’ అని అడగడం. ఒకరు వంట చేస్తుంటే, మరొకరు వచ్చి కూరగాయలు తరగడంలో సహాయం చేయడం లేదా వెనుక నుంచి వచ్చి చిన్నగా భుజంపై చెయ్యి వేయడం.
– టీవీ లేదా సినిమా చూస్తున్నప్పుడు అనుకోకుండా పక్కపక్కనే కూర్చుని భుజం ఆనుకోవడం లేదా చేతులు పట్టుకోవడం. లైట్స్ ఆఫ్ చేసి పడుకునే ముందు, ఆ రోజు జరిగిన ఫన్నీ విషయాలు లేదా మంచి జ్ఞాపకాలను ఒకరికొకరు పంచుకుంటూ నవ్వుకోవడం.
– నలుగురిలో ఉన్నప్పుడు లేదా కుటుంబ వేడుకల్లో ఉన్నప్పుడు ఒకరినొకరు చూసి చిరునవ్వు నవ్వడం. రోజులో కనీసం 15-20 నిమిషాలు గ్యాడ్జెట్స్ పక్కన పెట్టి ఒకరికొకరు సమయం ఇవ్వడం.
ఈ చిన్న, చిన్న క్షణాలకు పెద్ద ఖర్చు గానీ, ఎక్కువ సమయం గానీ అవసరం లేదు. భాగస్వామిని ఆనందంగా ఉంచాలనే ఆలోచన చాలు. భారీ ఆడంబరాలు బంధాన్ని అట్రాక్టివ్‌గా చూపించవచ్చు, రోజువారీ ఈ చిన్న చిన్న మైక్రో మోమెంట్స్ మాత్రమే బంధాన్ని నిలబెడతాయి. ఒకరికొకరు ఇచ్చే శ్రద్ధ, ప్రేమ, గౌరవం ఈ క్షణాల్లోనే దాగి ఉంటాయి. ఈ రోజే మీ భాగస్వామితో ఒక చిన్న ‘మైక్రో మోమెంట్’ సృష్టించడం ప్రారంభించండి. విష్ యూ ఆల్ ద బెస్ట్..
బి. కృష్ణ, సీనియర్ సైకాలజిస్ట్
ఇగ్నిషియో చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్,
హైదరాబాద్, 99854 28261
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

