HoloCoder | ఇక చీకట్లోనూ క్లియర్ ఫొటోలు.. మెగాపిక్సెల్‌తో సంబంధం లేకుండా కెమెరా పనితీరు పెంచే టెక్నాలజీ వచ్చేసింది!
HoloCoder | స్మార్ట్‌ఫోన్ కెమెరాల్లోకి రానున్న HoloCoder టెక్నాలజీతో తక్కువ వెలుతురులోనూ స్పష్టమైన ఫొటోలు తీయవచ్చు. 2.5 రెట్లు ఎక్కువ కాంతి, 3డీ డెప్త్, ఇన్ఫ్రారెడ్ సమాచారంతో ఈ టెక్నాలజీ ఎలా పనిచేస్తుందో తెలుసుకోండి.
HoloCoder | స్మార్ట్‌ఫోన్‌లో ఎంత మంచి కెమెరా ఉన్నా.. తక్కువ వెలుతురులో ఫొటోలు తీస్తే బ్లర్‌గా రావడం, ముఖాలు స్పష్టంగా కనిపించకపోవడం, వెలుతురు ఎక్కువగా ఉన్నప్పుడు లైట్‌తో కొన్ని వివరాలు కనిపించకపోవడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. అయితే ఈ ఇబ్బందులకు చెక్ పెట్టే సరికొత్త టెక్నాలజీ అందుబాటులోకి రానుంది. అదే హోలోకోడర్ (HoloCoder). ఇది స్మార్ట్‌ఫోన్ కెమెరాలకు మరింత కాంతిని అందించడంతోపాటు 3డీ డెప్త్ సమాచారాన్ని కూడా సేకరించగలదని చెబుతున్నారు.
ప్రస్తుతం చాలా స్మార్ట్‌ఫోన్ కెమెరాల్లో బేయర్ ఫిల్టర్ (Bayer Filter) ఉంటుంది. ఇది ఎరుపు, ఆకుపచ్చ, నీలం రంగుల సమాచారాన్ని సేకరించి ఫొటోలను రూపొందిస్తుంది. అయితే ఈ ప్రక్రియలో కెమెరాలోకి వచ్చే కాంతిలో దాదాపు 60 శాతం వరకు సెన్సర్‌కు చేరకుండానే వృథా అవుతుందని WIRED నివేదిక పేర్కొంది. ఉదాహరణకు.. ఎరుపు పిక్సెల్కు ఎరుపు కాంతి మాత్రమే అవసరం. మిగిలిన ఆకుపచ్చ, నీలం కాంతిని ఫిల్టర్ అడ్డుకుంటుంది. ఈ సమస్యను అధిగమించేందుకు హోలోకోడర్ను రూపొందించారు.
2.5 రెట్లు ఎక్కువ కాంతి!
ఇజ్రాయెల్ స్టార్టప్ PxE Holographic Imagingను అమెరికాకు చెందిన ఆప్టిక్స్ సంస్థ మెటలెన్జ్ (Metalenz).. కొనుగోలు చేసింది. ఈ సంస్థ అభివృద్ధి చేసిన హోలోకోడర్ టెక్నాలజీ ఇప్పుడు టెక్ ప్రపంచంలో ఆసక్తి రేపుతోంది. ఈ టెక్నాలజీలో కెమెరా సెన్సర్‌పై సూక్ష్మమైన ఆప్టికల్ పొరను అమరుస్తారు. ఇది కాంతిని వృథా చేయకుండా సెన్సర్లోని పిక్సెల్స్ వైపు మళ్లిస్తుంది. దీంతో సాధారణ కెమెరా సెన్సర్‌తో పోలిస్తే 2.5 రెట్లు ఎక్కువ కాంతిని సేకరించవచ్చని మెటలెన్జ్ చెబుతోంది. ఈ టెక్నాలజీ ఫోన్లలోకి వస్తే రాత్రివేళల్లో ఫొటోలు, వీడియోల నాణ్యత మెరుగుపడే అవకాశం ఉంది. సూర్యాస్తమయాలు, వెనుకవైపు ప్రకాశవంతమైన కిటికీ ఉన్నప్పుడు తీసే సెల్ఫీల్లోనూ ముఖంతోపాటు నేపథ్య వివరాలను స్పష్టంగా క్యాప్చర్ చేయవచ్చని అంచనా
రంగులతోపాటు 3డీ డెప్త్ సమాచారం!
హోలోకోడర్ మరో ఆసక్తికరమైన ప్రత్యేక ఉంది. సాధారణ కెమెరాలు ప్రధానంగా రంగుల సమాచారాన్ని సేకరిస్తాయి. కానీ హోలోకోడర్ ద్వారా RGB రంగులతోపాటు ఇన్ఫ్రారెడ్ (IR), 3డీ డెప్త్ సమాచారాన్ని కూడా సేకరించగలదని PxE సంస్థ చెబుతోంది. అంటే ఒక వస్తువు రంగును గుర్తించడంతోపాటు కెమెరాకు అది ఎంత దూరంలో ఉందో కూడా తెలుసుకోవచ్చు. అంతేకాదు.. కాంతి వక్రీకరణ సమాచారంతో ఫొటోల్లో బ్లర్‌ను గుర్తించి తగ్గించే అవకాశముందని సంస్థ వివరిస్తోంది.
ప్రస్తుతం పోర్ట్రెయిట్ ఫొటోలు, బ్యాక్‌గ్రౌండ్ బ్లర్ కోసం కొన్ని ఫోన్లు అదనపు కెమెరాలు, డెప్త్ సెన్సర్లను ఉపయోగిస్తున్నాయి. హోలోకోడర్ ఒకే ఆప్టికల్ పొరతో ఈ సమాచారాన్ని అందించగలిగితే అదనపు హార్డ్‌వేర్ అవసరం తగ్గవచ్చు. ఫోన్లో స్థలాన్ని కూడా ఆదా చేయవచ్చు.
కార్లు, రోబోట్లలోనూ ఉపయోగం!
ఈ టెక్నాలజీ స్మార్ట్ఫోన్లకే పరిమితం కాకపోవచ్చు. ఆటోమొబైల్స్, డ్రోన్లు, రోబోటిక్స్, పారిశ్రామిక కెమెరాల్లోనూ ఉపయోగించే అవకాశం ఉంది. పరిసరాల్లోని వస్తువుల రంగు, ఆకృతి, దూరాన్ని గుర్తించాల్సిన స్వయంచాలక వాహనాలు, రోబోట్లకు ఇది ఉపయోగపడవచ్చు. మెటలెన్జ్ సీఈఓ రాబ్ డెవ్లిన్ ప్రకారం.. కెమెరా సెన్సర్ మొదట్లోనే కాంతి సమాచారాన్ని సేకరించలేకపోతే సాఫ్ట్వేర్ ద్వారా దాన్ని పూర్తిగా తిరిగి పొందడం సాధ్యం కాదు. అందుకే హార్డ్‌వేర్‌లో మార్పులు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. హోలోకోడర్ ఇంకా వాణిజ్యపరంగా అందుబాటులోకి రాలేదు. 2027 చివర్లో లేదా 2028 ప్రారంభంలో వినియోగదారుల పరికరాల్లోకి వచ్చే అవకాశం ఉందని నివేదికలు పేర్కొంటున్నాయి. అయితే ఏ స్మార్ట్‌ఫోన్ కంపెనీ కూడా తమ ఫోన్లలో ఈ టెక్నాలజీని ఉపయోగించనున్నట్లు ఇప్పటివరకు ప్రకటించలేదు.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
HoloCoder | ఇక చీకట్లోనూ క్లియర్ ఫొటోలు.. మెగాపిక్సెల్‌తో సంబంధం లేకుండా కెమెరా పనితీరు పెంచే టెక్నాలజీ వచ్చేసింది!
Ramayana | ‘ఛావా’ రికార్డు బద్దలు.. కేవలం 9 రోజుల్లో రూ. 1100 కోట్ల క్లబ్లో ‘రామాయణం’!
Cancer | 50 రకాల క్యాన్సర్లను ముందుగానే గుర్తించే కొత్త రకమైన పరీక్ష.. ఏంటిది.. క్యాన్సర్‌ను ఎలా గుర్తిస్తుంది..?
Cyclone | ఏపీకి పొంచి ఉన్న మరో తుపాను ముప్పు
Harish Rao | మూడు బడ్జెట్లు.. అవే హామీలు.. అమలెక్కడ?.. ఆరు గ్యారంటీల వైఫల్యాలపై రాహుల్‌కు హరీశ్‌రావు ప్రశ్నలు!
ట్రెండింగ్ వార్తలు
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!

