సిరాజ్ ఎందుకొద్దు?
భారత టెస్ట్ జట్టులో హైదరాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్ భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. న్యూజిలాండ్‌తో తొలి టెస్ట్‌లో బౌలర్లు 20 వికెట్లు తీయలేక గెలుపు అవకాశాన్ని చేజార్చుకోవడంతో రెండో టెస్ట్‌లో సిరాజ్ ఆడిస్తారని అనుకుంటే టీమ్ మేనేజ్మెంట్ అతనికి మరోసారి మొండిచేయి చూపింది. అతడి స్థానంలో యువ పేసర్ గుర్నూర్ బ్రార్‌కు టెస్ట్ అరంగేట్ర అవకాశం కల్పించింది. దీంతో 2020లో ఆస్ట్రేలియా గడ్డపై టెస్ట్ అరంగేట్రం చేసిన తర్వాత, కనీసం ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండా విదేశీ టెస్ట్ సిరీస్ ముగించడం సిరాజ్ ఆరేండ్ల కెరీర్లో ఇదే తొలిసారి కావడం గమనార్హం.
వరుసగా రెండో టెస్ట్‌లోనూ తుది జట్టులో చోటు దక్కకపోవడంతో శుక్రవారం ఉదయం మైదానంలో సిరాజ్ తీవ్ర నిరాశతో కనిపించాడు. తన బాధను దాచుకునేందుకు అతడు నల్ల కళ్లద్దాలు పెట్టుకుని నిల్చున్న దృశ్యాలు కెమెరాలకు చిక్కాయి. దీనిపై మాజీ కెప్టెన్ అజింక్య రహానే, మాజీ స్పిన్నర్ మురళీ కార్తీక్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ‘సిరాజ్ ఏడుస్తున్నాడా? తను చాలా భావోద్వేగపూరిత వ్యక్తి. దేశం కోసం ప్రాణం పెట్టి ఆడాలనుకునే తత్వం సిరాజ్‌ది. ఫామ్ బాగోలేదనో, నెట్స్‌లో సరిగ్గా బౌలింగ్ చేయడం లేదనో భావిస్తే అసలు జట్టులోకి ఎందుకు ఎంపిక చేశారు? ఇలా విదేశాలకు తీసుకెళ్లి బెంచ్‌పై కూర్చోబెట్టడం ఆటగాడిని తీవ్రంగా బాధిస్తుంది’ అని కార్తీక్ మండిపడ్డాడు. గావస్కర్, కైఫ్, అశ్విన్ కూడా మేనేజ్మెంట్ నిర్ణయాన్ని తప్పుబట్టారు.
వాళ్లు అద్భుతాలు చేస్తున్నారా?
ప్రస్తుత వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ సైకిల్లో భారత్ తరఫున అత్యధికంగా 11 మ్యాచ్‌ల్లో 43 వికెట్లు తీసిన బౌలర్ సిరాజ్ కావడం విశేషం. గతేడాది ఇంగ్ల్ండ పర్యటనలోనూ 185.3 ఓవర్లు వేసి 23 వికెట్లు పడగొట్టి జట్టుకు వెన్నెముకగా నిలిచాడు. అయితే, ఇటీవల అఫ్గానిస్థాన్, శ్రీలంకతో జరిగిన మూడు టెస్టుల్లో 5 వికెట్లు మాత్రమే తీయడం, లంక పర్యటనలో అతడి వేగం 120-125 కి.మీ.కు పడిపోవడాన్ని మేనేజ్మెంట్ ప్రధాన కారణంగా చూపుతోంది. కానీ, అలసట అన్నదే లేకుండా రోజంతా బౌలింగ్ చేసే సత్తా సిరాజ్ సొంతం. పైగా సవాల్ విరిసే సౌతాఫ్రికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలో తనకు మంచి రికార్డుంది.
అవకాశం ఇస్తే కివీస్ గడ్డపైనా తన పేస్ పదును చూపెట్టాలన్న కసితో ఉన్న సిరాజ్‌ను కాదనడం కెప్టెన్ గిల్, కోచ్ గంభీర్ చేస్తున్న తప్పిదమని మాజీలు అభిప్రాయపడుతున్నారు. పోనీ సిరాజ్ వద్దని తీసుకున్న ప్రసిధ్, అన్షుల్ కాంబోజ్ అద్భుతాలు చేస్తున్నారా? అంటే అదీ లేదు. రెండో టెస్టులోనూ ఫలితం ప్రతికూలంగా వచ్చి భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు నుంచి వైదొలిగితే సిరాజ్ అంశం భారత జట్టును కుదిపేసే అవకాశం ఉంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

