హామీలు అమలుకాకుంటే.. పోరాటం ఉధృతం
- డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు ఏదీ.. ఏడాది రూ.12వేలు ఎక్కడ?
- తమిళనాడు తరహాలో కొత్త ఆటో మీటర్ చార్జీలుండాల్సిందే
- ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయం ఎదుట ఆటో డ్రైవర్ల నిరసన
సిటీబ్యూరో, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ) : అడ్డగోలు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ వాటి అమలుపై చేతులెత్తేస్తున్నారని ఆటో డ్రైవర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.12వేల సాయం తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో ఎదుట శుక్రవారం ఆటో డ్రైవర్లు భారీ సంఖ్యలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. డౌన్ డౌన్ రేవంత్.. హామీలు అమలు చేయకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామంటూ., ఖబడ్దార్ కాంగ్రెస్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. బీఆర్టీయూ, టీఏడీఎస్, టీయూసీఐ, ఏఐటీయూ, టీఆర్టీయూ, ఐఎఫ్టీయూ, ఐఎన్టీయూ, ఆజాద్ ఆటో యూనియన్, టీఆర్కేటీయూ, మహాత్మ గాంధీ ఆటో డైవర్స్ తదితర యూనియన్ల ఆధ్వర్యంలో ఆర్టీఏ ముట్టడి పెద్ద ఎత్తున సాగింది.
ఈ సందర్భంగా ఆటో జేఏసీ నాయకులు అమనుల్లాఖాన్, మారయ్య, సత్తిరెడ్డి, వెంకటేశ్, ప్రవీణ్, అజయ్ బాబు, ఎం సలీం, నర్సింహ, శ్రీనివాస్‌లు మాట్లాడుతూ.. ఉచిత బస్సు తీసుకొచ్చి ఆటో డ్రైవర్ల జీవితాలను రోడ్డు పాలు చేసిన ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరల్లోనే ఉన్నాయని హెచ్చరించారు. ఇప్పటి వరకు అనేక సార్లు తమ సమస్యలపై పోరాటం చేసి ప్రభుత్వానికి వినతిపత్రాలు సమర్పించినా ఫలితం లేదని వాపోయారు. ఆగస్టు 23న రవాణా శాఖ అధికారులతో, సెప్టెంబర్ 7న రవాణా శాఖ మంత్రి సమక్షంలో జరిగిన చర్చల్లో ఇచ్చిన హామీలు కూడా ఇప్పటికీ అమలు కాలేదని విమర్శించారు. ఆటో మీటర్ చార్జీలను వెంటనే పెంచాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు.
ఆటో నిర్వహణ ఖర్చుల కోసం సంవత్సరానికి రూ. 12 వేల ఆర్థిక సహాయం అందిస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం, ఇప్పటికే మూడు సంవత్సరాలు పూర్తవబోతున్నందున ఒకో ఆటో డ్రైవర్ కు రూ.36 వేలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. చట్టవిరుద్ధంగా నడుస్తున్న ఓలా, ఉబర్, రాపిడో బైకులను నిషేధించాలని, నగరంలో ఇతర జిల్లాల ఆటోలను నిలిపివేయాలని కోరారు. ఆటో డ్రైవర్ల సమస్యల పరిషారానికి ప్రత్యేక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి విధివిధానాలు రూపొందించాలన్నారు.
మీటర్ చార్జీల విషయంలో రవాణా శాఖ మంత్రి ఇచ్చిన హామీని అమలు చేయలేదని జేఏసీ నాయకులు గుర్తు చేశారు. పెరుగుతున్న నిత్యావసర ధరలను దృష్టిలో పెట్టుకుని, మీటర్ చార్జీని కనీసం రూ. 50కు, ప్రతి అదనపు కిలోమీటర్‌కు రూ.25కు పెంచాలని డిమాండ్ చేశారు. తమిళనాడు ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 366 ప్రకారం అకడ ఆటో మీటర్ ఛార్జీలు పెంచిన తరహాలో తెలంగాణలోనూ పెంచాలని కోరారు. కాగా, జేఏసీ నాయకులు నిరసన అనంతరం జేటీసీ చంద్రశేఖర్ గౌడ్‌ను కలిసి వినతి పత్రం అందించారు.
తమిళనాడులో ఆటోల చార్జీలు ఇలా!

పెరుగుతున్న ఇంధన ధరలు, ఆటోల నిర్వహణ ఖర్చులను దృష్టిలో పెట్టుకొని తమిళనాడు ప్రభుత్వం అక్టోబర్ 27న జీవో 366 జారీ చేసింది. దీని ప్రకారం మొదటి 1.8 కిలో మీటర్లకు కనీసం ఛార్జీని రూ.50గా నిర్ణయించారు. ఆ తర్వాత ప్రతి కిలో మీటర్‌కు రూ.25 వసూలు చేయవచ్చు. ప్రయాణ సమయంలో వేచి ఉండాల్సి వస్తే ప్రతి నిమిషానికి రూ.1 వెయిటింగ్ చార్జీగా నిర్ణయించారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు సాధారణ చార్జీలపై 50 శాతం అదనంగా వసూలు చేయడానికి అవకాశం కల్పించారు.
ఘాట్ రోడ్లలో ప్రయాణ కనీస చార్జీ రూ.60గా, అదనపు కిలో మీటర్‌కు రూ.30గా నిర్ణయించారు. కాగా, తమిళనాడులో గతంలో మొదటి 1.8 కిలోమీటర్‌కు రూ.25 ఆ తర్వాత అదనపు కిలోమీటర్‌కు రూ.12గానే ఉండేది. కాగా, ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో 1.6 కిలో మీటర్‌కు ఆటో చార్జీ రూ. 30 ఉండగా ప్రతి అదనపు కిలోమీటర్‌కు రూ.14గా ఉంది. తమిళనాడు తరహాలోనే తెలంగాణలోనూ అమలు చేయాలని ఆటో డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు.
జేఏసీ ప్రధానంగా ప్రభుత్వం ముందు ఉంచిన 12 డిమాండ్లు ఇవి:
1.నగరంలో ఆటో మీటర్ చార్జీని రూ.50కు, ప్రతి కిలోమీటర్ కు రూ.25కు పెంచాలి.
2. మోటార్ కార్మికుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి విధివిధానాలు రూపొందించాలి.
3. ఆటో నిర్వహణ కోసం సంవత్సరానికి రూ.12 వేల చొప్పున, మూడేండ్ల బకాయిలు రూ.36 వేలు ఒకేసారి చెల్లించాలి.
4. చట్టవిరుద్ధంగా నడుస్తున్న ఓలా, ఉబర్, రాపిడో బైకులను నిషేధించాలి.
5.నగరంలోని ఇతర జిల్లాల ఆటోల రాకపోకలను నిలిపివేసి, స్థానిక ఆటో డ్రైవర్లకు నగరంలోనే ఆటోలు కొనుగోలు చేసి నడుపుకొనే అవకాశం కల్పించాలి.
6. ప్రభుత్వమే ప్రత్యేక యాప్ ద్వారా ప్రయాణికులకు రవాణా సౌకర్యం కల్పించాలి.
7. 263 జీరో ఫేర్ ఆటోలను తిరిగి రెగ్యులరైజ్ చేయాలి.
8. చలాన్లను రద్దు చేసి పెండింగ్ చలాన్లను మాఫీ చేయాలి.
9. గ్రీన్ క్యాబ్‌లకు ఇచ్చిన అనుమతులను వెంటనే రద్దు చేయాలి.
10. రైల్వే, మెట్రో ఆర్టీసీ షాపింగ్ కాంప్లెక్స్ ల ముందు ఆటో పారింగ్ స్థలాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలి.
11. ఆటో, క్యాబ్ డ్రైవర్లందరికీ ఒకేసారి డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయించాలి.
12. ఆటోలు, క్యాబ్‌లలో మీటర్ లో ఎంత చూపిస్తే అంతే బిల్లు చెల్లించే విధానాన్ని అమలు చేయాలి.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

