పండుకున్న పంచాయతీలు!
కేసీఆర్ ప్రభుత్వం తొమ్మిదిన్నరేండ్ల కాలంలో సాధించిన పంచాయతీల అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం తన మూడేండ్ల పాలనలో మూలకు పడేసింది. ఇంతచేస్తాం, అంతచేస్తాం అని ఊదరగొట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ చేసిందేమీ లేకపోగా ఉన్నది ఊడగొడితే ఇప్పుడు పంచాయతీలు ఉసూరుమంటున్నాయి. నిధులు రాక, పనులు కాక గోస పడుతున్నాయి.
కేసీఆర్ ప్రభుత్వం తొమ్మిదిన్నరేండ్ల కాలంలో సాధించిన పంచాయతీల అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం తన మూడేండ్ల పాలనలో మూలకు పడేసింది. ఇంతచేస్తాం, అంతచేస్తాం అని ఊదరగొట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ చేసిందేమీ లేకపోగా ఉన్నది ఊడగొడితే ఇప్పుడు పంచాయతీలు ఉసూరుమంటున్నాయి. నిధులు రాక, పనులు కాక గోస పడుతున్నాయి. గ్రామీణ స్థానిక సంస్థల ఆర్థిక పరిస్థితిపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విడుదల చేసిన తాజా నివేదిక రాష్ట్రంలోని పంచాయతీల దుస్థితికి అద్దం పట్టింది. మూడేండ్లలో రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల ఆర్థిక పరిస్థితిని పరిశీలిస్తే నిధుల రాక, ఖర్చు రెండూ గణనీయంగా పడిపోయాయి. 2022-23లో ఒక్కో గ్రామ పంచాయతీకి సగటున రూ.16.72 లక్షల ఆదాయం ఉండగా, 2023-24లో రూ.14.38 లక్షలకు, 2024-25లో ఏకంగా రూ.4.42 లక్షలకు పడిపోయింది. అంటే రెండేండ్లలో ఆదాయం దాదాపు 74 శాతం క్షీణించింది. ఖర్చుల పరిస్థితీ ఇందుకు భిన్నంగా లేదు. 2022-23లో ఒక్కో పంచాయతీ సగటు వ్యయం రూ.16.59 లక్షలు కాగా, 2024-25లో అది రూ.6.24 లక్షలకు దిగజారింది. తెలంగాణ పంచాయతీలు జాతీయ సగటు కంటే ఎంతో వెనుకబడి ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే గ్రాంట్లు 2022-23లో ఒక్కో పంచాయతీకి రూ.14.34 లక్షలు ఉండగా, 2024-25లో రూ.2.81 లక్షలకు దిగజారాయి. పంచాయతీల ఆర్థిక మిగులు కాస్తా లోటుగా మారడం కాంగ్రెస్ పాలన పుణ్యమే.
పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేస్తామని, గ్రామాల అభివృద్ధికి నిధుల కొరత లేకుండా చూస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆచరణకు ఏమాత్రం పొంతన లేదు. పైగా రూ.1,083 కోట్ల మేర సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు బకాయిలు చెల్లించాల్సి ఉన్నట్టు తేలింది. పంచాయతీ పనుల కోసం అప్పులు చేసిన మాజీ సర్పంచులు బకాయిల కోసం ప్రజాభవన్ వద్ద ధర్నాలు చేయాల్సి రావడం గ్రామీణ పరిపాలన దయనీయ స్థితికి నిదర్శనం. గత నెలలో సర్పంచుల సంఘం ప్రజాభవన్ వద్ద ఆందోళన నిర్వహించి ఎంతోకాలంగా అపరిష్కృతంగా ఉన్న పెండింగ్ బిల్లులు, గౌరవ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేసింది. మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సుమారు రూ.500 కోట్ల బకాయిలు పేరుకుపోవడంతో ఈ నెల 14 నుంచి కాంట్రాక్టర్లు ప్రభుత్వ పనులను నిలిపివేశారు. గ్రామాల్లో అభివృద్ధి పనులు నిలిచిపోవడం, పారిశుద్ధ్యం దెబ్బతినడం, తాగునీటి సరఫరా, వీధిదీపాల నిర్వహణ వంటి కనీస బాధ్యతలు కూడా నిర్వర్తించలేని పరిస్థితి ఏర్పడుతున్నది. పంచాయతీ ఎన్నికలను సకాలంలో నిర్వహించకపోవడం వల్ల రెండేండ్లపాటు ప్రజాప్రతినిధులు లేకుండా ప్రత్యేక అధికారుల పాలన సాగడం, దాంతో 15వ ఆర్థిక సంఘం నిధులు నిలిచిపోవడం కూడా ఈ సంక్షోభానికి కారణమయ్యాయి. 2024-25లో అర్హత కలిగిన ఎన్నికైన స్థానిక సంస్థలు లేకపోవడంతో కేంద్రం ఆర్థిక సంఘం గ్రాంట్ల విడుదల నిలిపివేసినట్లు పార్లమెంటులోనే కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఏదో సాధిస్తామని కోతలు కోసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలనా వైఫల్యమే ఈ దుస్థితికి కారణమని చెప్పాలి.
పంచాయతీలను ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేయడానికి ఆర్బీఐ నివేదికలో కొన్ని సూచనలు కూడా చేశారు. గ్రామ పంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే గ్రాంట్లను సకాలంలో, నిర్దిష్ట కాలపరిమితితో విడుదల చేయడం అత్యవసరమనేది అందులో ముఖ్యమైనది. పెండింగ్ బిల్లులన్నింటినీ ప్రత్యేకంగా సమీక్షించి, సర్పంచులు, కాంట్రాక్టర్లు చేసిన పనులకు చెల్లింపులు తక్షణమే జరపాలి. పంచాయతీల సొంత ఆదాయ వనరులను పెంచుకోవడానికి ఆస్తిపన్ను పరిధిని గుర్తించడం, ఆస్తుల రిజిస్టర్లను ఆధునికీకరించడం, పన్నుల వసూళ్లను మెరుగుపరచడం, లైసెన్సు ఫీజులు, వినియోగ రుసుములను హేతుబద్ధీకరించడం వంటి చర్యలు చేపట్టాలని ఆర్బీఐ సూచించింది. కేంద్ర, రాష్ట్ర గ్రాంట్లపైనే ఆధారపడకుండా స్థానిక ఆదాయ వనరులను బలోపేతం చేయడం అవసరమే అయినప్పటికీ, ఆ వంకతో పేద గ్రామీణ ప్రాంతాలపై పన్నుల భారం మోపడం భావ్యం కాదు. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీల ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలి. కేంద్రం నుంచి నిధులు రాబట్టుకునేందుకు అడుగులు వేయాలి. గ్రామాల అభివృద్ధి కోసం చర్యలు తీసుకోవడమే ప్రభుత్వ తక్షణ కర్తవ్యం కావాలి. మూడేండ్లుగా పంచాయతీలను మురగబెట్టిన కాంగ్రెస్ మరో రెండేండ్లకయినా ఆ లక్ష్యం సాధించగలదా? అనే ప్రశ్నకు జబావే దొరకడంలేదు.
Read Today's Latest Editorial News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

