ఒక దీక్ష.. కోట్ల గొంతుకలకు దిక్సూచి
ప్రాణాన్ని పణంగా పెట్టి కేసీఆర్ పోరాటం..తెలంగాణ చరిత్రను మలుపుతిప్పిన నవంబర్ 29. పదవులను తృణప్రాయంగా వొదిలి..మొక్కవోని సంకల్పంతో సాగిన ఉద్యమం. అది ఒక వ్యక్తి నిరాహార దీక్షకు బయలుదేరిన రోజు మాత్రమే కాదు..నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల దశాబ్దాల నాటి ఆకాంక్ష ఒక నాయకుడి ఆమరణ నిరాహార దీక్ష రూపంలో ఉద్యమాగ్నిగా మారిన రోజు.
ప్రాణాన్ని పణంగా పెట్టి కేసీఆర్ పోరాటం..తెలంగాణ చరిత్రను మలుపుతిప్పిన నవంబర్ 29. పదవులను తృణప్రాయంగా వొదిలి..మొక్కవోని సంకల్పంతో సాగిన ఉద్యమం. అది ఒక వ్యక్తి నిరాహార దీక్షకు బయలుదేరిన రోజు మాత్రమే కాదు..నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల దశాబ్దాల నాటి ఆకాంక్ష ఒక నాయకుడి ఆమరణ నిరాహార దీక్ష రూపంలో ఉద్యమాగ్నిగా మారిన రోజు. ఒకవైపు ప్రభుత్వ నిర్బంధం..మరోవైపు ప్రజాగ్రహం..ఇంకోవైపు తెలంగాణ కోసం ప్రాణాన్నే పణంగా పెట్టిన నాయకుడి పట్టుదల. నాడు కేసీఆర్ వేసిన ఆ ఒక్క అడుగు..ఢిల్లీ పీఠాన్ని కదిలించింది. దేశ రాజకీయాలను తెలంగాణ వైపు తిప్పింది. ఆ దీక్షతో ఉద్యమం కీలక మలుపు తిరిగింది.
ఈ చరిత్రలో ఎవరి పాత్రనూ తక్కువ చేయడం సాధ్యం కాదు. అదే సమయంలో కేసీఆర్ చేపట్టిన దీక్ష ఉద్యమ గమనాన్ని మార్చిన కీలక ఘట్టమన్న వాస్తవాన్ని విస్మరించలేం. నాటి యువత ప్రత్యేక రాష్ట్రం కోసం వీధుల్లోకి వచ్చి పోరాడింది. నేటి యువత ఆ రాష్ట్రం ఎందుకు ఏర్పడింది? దాని వెనుక ఎన్ని త్యాగాలున్నాయి? స్వరాష్ట్ర ఆకాంక్షకు మూలమైన నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం వంటి లక్ష్యాల ప్రాధాన్యం ఏమిటి? అనే విషయాలను తెలుసుకోవాలి.
ఎన్నో పోరాటాలు.. మరెన్నో త్యాగాల ఫలితంగా తెలంగాణ స్వరాష్ట్ర కల సాకారమైంది. అందుకే నవంబర్ 29 ఒక తేదీ కాదు..తెలంగాణ ఆత్మగౌరవ చరిత్రలో చెరగని సంతకం. అదే దీక్షా దివస్! అది కరీంనగర్ తీగలగుట్టపల్లిలోని కేసీఆర్ భవన్..2009 నవంబర్ 29. ఒకవైపు దేశవ్యాప్తంగా ఉత్కంఠ..మరోవైపు ఏమి జరుగుతుందోనన్న ఆతృత..కేసీఆర్ భవన్ పరిసరాల్లో పోలీసుల నిఘా..మీడియా ప్రత్యక్ష ప్రసారాలు..ఎటుచూసినా పోలీసు బలగాల మోహరింపు..మరోవైపు నలుదిశల నుంచి కదిలివచ్చిన తెలంగాణవాదులు.. జై తెలంగాణ..జై కేసీఆర్ నినాదాలతో మార్మోగిన పరిసరాలు..ఇదీ ఆనాటి ఉద్విగ్నభరతి వాతావరణం.
‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’ అనే నినాదంతో ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమైన కేసీఆర్. కరీంనగర్ నుంచి సిద్దిపేటకు బయలుదేరారు. మానేరు వంతెన దాటిన తర్వాత అల్గునూర్ చౌరస్తా వద్ద భారీ బలగాల మధ్య ఒక్కసారిగా అడ్డుకొని కేసీఆర్‌ను ఖమ్మం తరలించారు. ఖమ్మం జైలులోనే కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్నదన్న వార్తలు తెలంగాణ అంతటా ఆందోళన రేకెత్తించాయి. అరెస్టుతో ఆగిపోతుందనుకున్న ఉద్యమం మరింత ఉధృతమైంది. విద్యార్థులు, ఉద్యోగులు, న్యాయవాదులు, ఉపాధ్యాయులు, కార్మికులు, మేధావులు, మహిళలు..ఇలా సబ్బండ వర్గాల ప్రజలంతా రోడ్లపైకి వచ్చారు. బంద్‌లు, రాస్తారోకోలు, నిరసనలతో తెలంగాణ అట్టుడికింది. బస్సులు, రైళ్ల రాకపోకలు స్తంభించాయి. డిసెంబర్ 3న కేసీఆర్‌ను ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా నిమ్స్‌కు తరలించినా దీక్ష కొనసాగింది. ఒక ప్రాంతీయ ఆకాంక్ష దేశ రాజకీయాలను కదిలించే స్థాయికి చేరింది.
కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ ఉద్యమంలో కీలక మలుపుగా నిలిచింది. ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్నకొద్దీ ప్రజల్లో ఆందోళన, ఆగ్రహం పెరిగాయి. నిరసనలు ఉధృతమయ్యాయి. విద్యార్థుల ఉద్యమం మరింత తీవ్రరూపం దాల్చింది. పరిస్థితి అదుపు తప్పే ప్రమాదం ఏర్పడటంతో కేంద్రం స్పందించక తప్పలేదు. 2009 డిసెంబర్ 9న కేంద్ర హోంమంత్రి చిదంబరం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తామని ప్రకటించడంతో కేసీఆర్ దీక్ష విరమించారు.
తెలంగాణ ప్రజల దశాబ్దాల నాటి ఆకాంక్షకు కేంద్రం నుంచి అధికారిక గుర్తింపు లభించిన కీలక సందర్భమది. అయితే ఆ ప్రకటనతోనే తెలంగాణ సాధన పూర్తికాలేదు. సీమాంధ్ర ప్రాంతంలో వ్యతిరేకత, రాజకీయ పరిణామాల నేపథ్యంలో డిసెంబర్ 23న కేంద్రం మరో ప్రకటన చేసి అన్ని రాజకీయ పార్టీలు, వర్గాలతో విస్తృత సంప్రదింపులు అవసరమని పేర్కొన్నది. ఈ ప్రకటనతో తెలంగాణ ఉద్యమం మరోసారి సవాళ్లను ఎదుర్కొన్నది. మిలియన్ మార్చ్, సకల జనుల సమ్మె, విద్యార్థుల పోరాటాలు, ఉద్యోగుల ఉద్యమాలు, రాజకీయ నిరసనలు.. ఇలా అనేక రూపాల్లో స్వరాష్ట్ర సాధన కోసం పోరు కొనసాగింది. చివరికి 2014 జూన్ 2న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించింది. తెలంగాణ ఉద్యమ చరిత్రలో నవంబర్ 29కు ఉన్న ప్రత్యేకత ఇదే.
ఒక నాయకుడు తన రాజకీయ భవిష్యత్తును పక్కనపెట్టి, ప్రాణాలనే పణంగా పెట్టి ఒక ప్రజల ఆకాంక్ష కోసం పోరాటానికి దిగిన సందర్భమది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పన్నెండేండ్లు పూర్తవుతున్న వేళ..అప్పటి ఉద్యమాన్ని ప్రత్యక్షంగా చూడని ఒక తరం మన మధ్య ఉన్నది. నాటి అరెస్టులు, ఆందోళనలు, విద్యార్థుల పోరాటాలు, సకల జనుల సమ్మె, అమరుల త్యాగాలు.. ఇవన్నీ ఆ తరానికి చరిత్ర పుస్తకాల్లోని అంశాలుగానే కనిపించవచ్చు. కానీ వాటి వెనుక ఉన్న ఆవేదన, ఆత్మగౌరవం, స్వరాష్ట్ర ఆకాంక్షను అర్థం చేసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. కేసీఆర్ నాయకత్వంలో సాగిన రాజకీయ ఉద్యమం, ఆయన చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష, ప్రజల భాగస్వామ్యం, విద్యార్థుల పోరు, ఉద్యోగుల సమ్మె, అమరుల త్యాగాలు..ఇవన్నీ కలిసే తెలంగాణ ఆవిర్భావానికి సరికొత్త బాటలు వేశాయి. ఈ చరిత్రలో ఎవరి పాత్రనూ తక్కువ చేయడం సాధ్యం కాదు. అదే సమయంలో కేసీఆర్ చేపట్టిన దీక్ష ఉద్యమ గమనాన్ని మార్చిన కీలక ఘట్టమన్న వాస్తవాన్ని విస్మరించలేం. నాటి యువత ప్రత్యేక రాష్ట్రం కోసం వీధుల్లోకి వచ్చి పోరాడింది. నేటి యువత ఆ రాష్ట్రం ఎందుకు ఏర్పడింది? దాని వెనుక ఎన్ని త్యాగాలున్నాయి? తెలంగాణ సాధన కోసం సాగిన పోరాట స్ఫూర్తిని ప్రజాస్వామ్య విలువలతో, సామాజిక బాధ్యతతో ముందుకు తీసుకెళ్లాలి.
నవంబర్ 29న నిర్వహించే దీక్షా దివస్ అలాంటి చారిత్రక బాధ్యతను గుర్తుచేస్తుంది. ఒకప్పుడు తెలంగాణ కోసం పిడికిలి బిగించిన ప్రజలు..నేడు తెలంగాణ భవిష్యత్తు కోసం అంతే అప్రమత్తంగా ఉండాలి. కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష కేవలం ఒక రాజకీయ ఘట్టంగా మిగిలిపోకుండా..ఒక లక్ష్యం కోసం ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కొనే సంకల్పానికి ప్రతీకగా నిలవాలి. నాడు ప్రాణాన్ని పణంగా పెట్టిన దీక్ష..నేడు తరతరాలకు స్ఫూర్తి. నాడు తెలంగాణ కోసం సాగిన పోరాటం..నేడు తెలంగాణ భవిష్యత్తు కోసం పాటుపడాల్సిన బాధ్యతను గుర్తుచేస్తున్నది. ఒక నాయకుడి సంకల్పం కోట్లాది ప్రజల ఆకాంక్షతో కలిసినప్పుడు చరిత్ర ఎలా మలుపు తిరుగుతుందో చెప్పే సజీవ సాక్ష్యం నవంబర్ 29. అదే దీక్షా దివస్ సందేశం. అదే ఆ మహోద్యమానికి మనం అందించగల నిజమైన స్ఫూర్తి.
(వ్యాసకర్త: నమస్తే తెలంగాణ కరీంనగర్ ప్రతినిధి)
కడపత్రి ప్రకాశ్‌రావు
80966 77022
Read Today's Latest Opinions News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

