ఎటు చూసినా అక్షర మాల, ఆకర్షణీయమైన బొమ్మలు ఉపాధ్యాయుడి సొంత ఖర్చులతో అచ్యుతాపురం పాఠశాల అభివృద్ధి ఇంగ్లిష్ మీడియం విద్యాబోధనపై ప్రత్యేక దృష్టి పాఠశాలకు రోజురోజుకూ పెరుగుతున్న ఆదరణ కొత్తగూడెం ఎడ్యుకేషన్, ఫిబ్రవరి 14: ‘ఆ పాఠశాలలో గోడలే పాఠాలు చెబుతాయి. తరగతి గదుల్లో రంగు రంగుల పెయింటింగ్స్, అక్షర మాల, చిన్న చిన్న పదాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. పాఠశాల ఆవరణలో అడుగుపెడితే ఆహ్లాదకర వాతావరణం స్వాగతం పలుకుతుంది. ఉపాధ్యాయుడు ఏజే ప్రభాకర్ ప్రత్యేక చొరవతో భద్రాద్రి జిల్లా దుమ్ముగూడెం మండలం అచ్యుతాపురం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల రూపురేఖలు మార్చారు. చదువంటే ఇష్టపడని విద్యార్థులకు సైతం ఆటపాటలతో విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాల’.. ఆ పేరు వినగానే అందరికీ తెలుసు.. ‘ఎక్కడి చెత్త అక్కడే. సరైన ఫర్నీచర్ ఉండదు. స్కూలుకు గేట్లు ఉండవు. లైట్లు వెలగవు. ఫ్యాన్లు తిరగవు. తరగతి గదులు సరిపోవు. ఉపాధ్యాయులు రారు. వచ్చినా పాఠాలు చెప్పరు.’ అనే మాటలు కోకొల్లలు. కానీ ఇప్పుడు పరిస్థితులన్నీ మారిపోయాయి. ఒకప్పుడు ఉన్న సర్కారు బడులకు.. తెలంగాణ రాష్ట్ర అవతరణ తరువాత ఉన్న సర్కారు బడులకు ఎంతో వ్యత్యాసం ఉంది. ప్రైవేటు పాఠశాలలకు ఏ మాత్రం తీసిపోని విధంగా ప్రభుత్వ పాఠశాలలు పోటీ పడుతున్నాయి. పాఠశాల ఆవరణ అంతా పూలమొక్కలు, పండ్ల మొక్కలతో ఆహ్లాదాన్ని పంచుతోంది. చక్కటి విద్యాబోధన అందుతోంది. ప్రైవేటు విద్యకు ధీటుగా ఇంగ్లిష్ మీడియం తరగతులను ప్రారంభించింది. ప్రస్తుతం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ‘మన ఊరు - మన బడి’ కార్యక్రమంలో దాతల సాయంతో పాఠశాలలను నందనవనంలా తయారు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దాతలు ముందుకొచ్చి పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు తమవంతు సహకారం అందిస్తున్నారు. ఎటు చూసినా ఆహ్లాదకరంగా ఆవరణ.. భద్రాద్రి జిల్లాలోని దుమ్ముగూడెం మండలం అచ్యుతాపురం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను చూస్తే ప్రభుత్వ పాఠశాలల గురించి మరిన్ని విషయాలు అవగాహనకొస్తాయి. ఈ పాఠశాల ప్రహరీ గోడను చూస్త్తే అర్థమైపోతుంది.. ఇది ప్రభుత్వ పాఠశాల ప్రహరీయేనా అని. ప్రధాన ద్వారం వద్ద రంగురంగుల బొమ్మలు పిల్లలను ఆకట్టుకునేలా దర్శనమిస్తాయి. ఇంకా గేటు తెరిచి లోనికి వెళ్తే అంతా ఆహ్లాదమే. పాఠశాల ఉపాధ్యాయుడు ఏజే ప్రభాకర్ ప్రత్యేక చొరవతో పాఠశాలను మరింతగా అభివృద్ధి చేస్తున్నారు. తన సొంత ఖర్చులతోనే తాను పనిచేస్తున్న పాఠశాలను మరింతగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో దశల వారీగా అభివృద్ధి చేస్తున్నారు. ఎలాంటి ఆదరణ లేకుండా ఉన్న పాఠశాలను మరింత అభివృద్ధి చేస్తున్నారు. ఆయన విధుల్లో చేరిన నాటి నుంచి ఇప్పటి వరకు సుమారు రూ.4 లక్షలు వెచ్చించి ప్రహరీనిర్మించారు. రంగులు వేయించి ముస్తాబు చేయించారు. విద్యార్థుల మౌలిక అవసరాలు తీరుస్తున్నారు. ఆటపాటలతో విద్య.. చదువంటే ఇష్టపడని చిన్నారులు కూడా ఈ పాఠశాలలో ఎంతో ఇష్టంగా చదువుతున్నారు. టీచర్ ఆటపాటలతో విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు. పాఠశాలలోని అన్ని తరగతి గదుల్లోనూ చుట్టూ రంగురంగుల పెయింటింగ్స్, అక్షరమాల, చిన్నచిన్న పదాలు రాశారు. పుస్తకాల్లో ఉన్న పాఠాలను గోడలపై బొమ్మలుగా వేయించి వాటిని చూపిస్తూ వారికి అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేస్తున్నారు. దీంతో విద్యార్థులు ఆసక్తి పెంచుకుంటూ పాఠశాలల్లో చేరుతున్నారు. ఉత్తమ విద్య అందిస్తుండడంతో తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.