ఖమ్మం కమాన్బజార్, ఫిబ్రవరి 27: భూదాన్ భూముల్లో నిరుపేదలు కట్టుకున్న ఇళ్లను నిర్దాక్షిణ్యంగా కూల్చివేసి, వారిని మెడలుపట్టి గెంటివేయడమే ఇందిరమ్మ రాజ్యమా.. అని పలువురు వామపక్ష నేతలు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. భూదాన్ భూముల్లో ఇండ్లు కట్టుకొని, గుడిసెలు వేసుకొని నివసిస్తున్న పేదలకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, కనీసం ఇంట్లోని సామాన్లు తీసుకోనివ్వకుండా పోలీసులు దౌర్జన్యంగా తెల్లవారుజామునే జేసీబీలు, బుల్డోజర్లతో కూల్చివేతలకు పాల్పడడం ఎంతవరకు సబబు అని వారు ప్రశ్నించారు.
ఈ ఘటనను చూస్తుంటే ఘాజాపై ఇజ్రాయిల్ చేసిన దమన కాండ గుర్తుకొస్తుందన్నారు. ఖమ్మంలోని సీపీఎం జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వామపక్ష నేతలు నున్నా నాగేశ్వరరావు, దండి సురేశ్, ఆవునూరి మధు, గోకినేపల్లి వెంకటేశ్వర్లు మాట్లాడారు. ఖమ్మం శివారు వెలుగుమట్లలో పదేళ్ల నుంచి ఇండ్లు కట్టుకొని నివాసం ఉంటున్న వారి ఇండ్లను కూల్చడంతో పేదలందరూ రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. బడా బాబుల భూములను క్రమబద్ధీకరణ చేస్తున్న ప్రభుత్వం పేదల ఇళ్లను ఎందుకు క్రమబద్ధీకరించడం లేదని వారు ప్రశ్నించారు.
భూదాన్ భూముల్లో ఆక్రమణలు ఉన్నాయని చెబుతున్న ప్రభుత్వం.. వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 62 ఎకరాల్లో కేవలం 32 ఎకరాల్లో ఉన్న పేదల ఇండ్లను కూల్చివేశారని, మరి మిగిలిన భూమి ఏమైందో నిగ్గు తేల్చాలని వారు డిమాండ్ చేశారు. కలెక్టర్ ప్రజల అధికారా? లేదా రియల్ ఎస్టేట్ వ్యాపారా? అని ప్రశ్నించారు. పేదల భూమిని బడా బాబులకు కట్టబెట్టే యోచనలో ఉన్నట్లు అనుమానాలు తలెత్తుతున్నాయని ఆరోపించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తక్షణ సహాయం కింద ఇళ్లు కోల్పోయిన ప్రతి ఒక్కరికి రూ.లక్ష చెల్లించడంతోపాటు అదే స్థలంలో వారికి ఇండ్లు నిర్మించి ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. సమావేశంలో వివిధ పార్టీల నాయకులు విక్రమ్, శ్రీనివాస్, మోహన్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటూ వెలుగుమట్ల భూదాన్ భూమిలో నివాసం ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలపై కక్షగట్టి ఇండ్లను ధ్వంసం చేయడం సరైంది కాదు. రాజకీయ నాయకులు ఆక్రమించుకున్న భూములను రెగ్యులర్ చేశారు. మాలాంటి పేదల నివాస స్థలాలను రెగ్యులర్ చేయడానికి సాకులు చెప్పడం ఎంతవరకు సబబు. కాంగ్రెస్ పాలనలో పేదలకో న్యాయం.. పెద్దలకో న్యాయమా? రియల్ ఎస్టేట్ వ్యాపారుల భూముల కోసం కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు వారితో చేతులు కలిపి మాకు అన్యాయం చేశారు.
-ఎన్.రాజేశ్, ప్రైవేటు ఉద్యోగి, బాధితుడు
ఖమ్మంలోని పలు ప్రైవేటు ఆసుపత్రులలో పనిచేస్తూ జీవిస్తున్న మాకు కాంగ్రెస్ ప్రభుత్వం నిలువ నీడ లేకుండా చేసింది. చిన్నాచితకా పనులు చేసుకుంటూ ఇక్కడే ఎనిమిదేళ్లుగా కుటుంబంతో ఉంటున్నా. కలెక్టరేట్ దగ్గరగా ఉన్న మా ఇండ్లను చూసి కాంగ్రెస్ ప్రభు త్వం ఓర్వలేకపోయింది. కాంగ్రెస్ నాయకులు రియల్ ఎస్టేట్ వ్యాపారులతో చేతులు కలిపి మా లాంటి పేదల ఇండ్లను ధ్వంసం చేశారు. మా ఇండ్లు కూల్చిన చోటే కొత్త ఇండ్లు నిర్మించి ఇవ్వాలి. మా లాంటి పేదలందరూ తిరగబడి కాంగ్రెస్ పెద్దలకు బుద్ధి చెప్పే రోజు దగ్గర్లోనే ఉంది.
-పి.లాలయ్య, బాధితుడు