Ananya Raj | సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. బాలీవుడ్‌తో పాటు తెలుగులోనూ నటించి గుర్తింపు తెచ్చుకున్న నటి, మోడల్ అనన్య రాజ్ 35 ఏళ్ల వయసులోనే కన్నుమూశారు. ఆమె మృతి విషయాన్ని కుటుంబ సభ్యులు తాజాగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించడంతో అభిమానులు, సినీ వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాయి. అనన్య రాజ్ జూలై 15న మృతి చెందినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. నిద్రలోనే ఆమె తుదిశ్వాస విడిచినట్లు వెల్లడించారు. అయితే ఈ విషాద వార్తను కుటుంబ సభ్యులు వెంటనే బయటకు చెప్పకుండా కొంతకాలం తర్వాత సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.
అనన్య చితి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన కుటుంబ సభ్యులు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. గత ఏడాది కాలంగా ఆమె శారీరక, మానసిక సమస్యలతో బాధపడుతున్నారని తెలిపారు. వాటిని అధిగమించేందుకు ఎంతో ధైర్యంగా పోరాడిందని, అయితే చివరకు తమను విడిచి వెళ్లిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అనన్య రాజ్ మొదట మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు. పలు ప్రకటనల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న ఆమె అనంతరం సినిమాల్లోకి అడుగుపెట్టారు. బాలీవుడ్లో ‘7 అవర్స్ టు గో’, ‘ది ఫైనల్ ఎగ్జిట్’, ‘ఘోస్ట్’ తదితర చిత్రాల్లో నటించారు.
తెలుగులోనూ అనన్య పలు సినిమాలు చేసింది. నవీన్ చంద్ర హీరోగా తెరకెక్కిన ‘తగ్గేదే లే’ సినిమాలో హీరోయిన్గా నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. సినిమాలతో పాటు పలు ప్రైవేట్ ఆల్బమ్స్‌లోనూ ఆమె నటించారు. చిన్న వయసులోనే అనన్య రాజ్ కన్నుమూయడంతో ఆమె అభిమానులు, సన్నిహితులు, సినీ వర్గాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. సోషల్ మీడియాలో ఆమెకు సంబంధించిన పాత ఫొటోలు, వీడియోలను అభిమానులు షేర్ చేస్తూ నివాళులు అర్పిస్తున్నారు. అనన్య మరణానికి సంబంధించిన వార్త ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ఆమె అభిమానులు మరింత షాక్‌కు గురయ్యారు. సినీ రంగంలో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న సమయంలోనే ఆమె జీవితం అర్ధంతరంగా ముగియడం పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.