న్యూఢిల్లీ, ఆగస్టు 16 : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం అయ్యా యి..చప్పగా ముగిసాయి కూడా. ఈ సమావేశాలు అంతటా (ఒక్క చివరి రోజు తప్ప) హోం మంత్రి అమిత్ షా గైర్హాజరయ్యారు. గైర్హాజర్ అనే కన్నా విపక్షాలకు జడిసి పారిపోయారు, ముఖం చాటేశారు అనడం సబబు. ప్రభుత్వానికి సంబంధించిన ఏ వ్యవహారంలో అయినా కీలక పాత్ర పోషించే వ్యక్తిగా, వాటిని సమర్థించే నేతగా మోదీ తర్వాత స్థానంలో షా కీలకంగా ఉన్నారు. అయితే ఈ సమావేశాల్లో మీడియాకు ఇచ్చిన చిన్న ప్రకటన తప్ప ఆయన క్రియాశీలకంగా ఎలాంటి పాత్ర పోషించ లేదు. దీనిపై ప్రముఖ పాత్రికేయురాలు శ్రవసి ్తదాస్గుప్తా ‘ద వైర్’ వెబ్సైట్లో దేశంలోని నెంబర్ వన్, టూ నేతలు విపక్షాలు, విద్యార్థులను ఎదుర్కోలేని వైనాన్ని విశ్లేషించారు.
ఒక నెల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి పార్లమెంట్ వర్షాకాల సమావేశాల కోసం ఉత్సాహంగా ఎదురు చూసింది. పశ్చిమ బెంగాల్లో 15 ఏండ్ల పాలనలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ను ఓడించిన ఆనందం, పైగా ఆ పార్టీని చీల్చి టీఎంసీ అసమ్మతి ఎంపీల మద్దతు కూడగట్టడం, అలాగే శివసేన (యూబీటీ), ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లలో కూడా చీలిక తెచ్చి వారి ఎంపీలను వేరు కుంపటి పెట్టించిన ఉత్సాహంతో ఉరకలేస్తూ ఉంది. కొత్తగా తమకు మద్దతు ఇస్తున్న విపక్ష చీలిక వర్గంతో ఈసారి డీలిమిటేషన్తో ముడిపడి ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లు గట్టెక్కించేద్దామని పలు ప్రణాళికలు కూ డా సిద్ధం చేసింది. అనుకున్నది ఒకటి అయితే.. వాస్తవంలో పరిస్థితి ఇంకో విధంగా ఉంది.
వివాదాస్పద బిల్లులను ఈ సమావేశాల్లో ఆమోదించడం అటుంచి యువత ఆందోళనకు తలొగ్గి తొలిసారిగా ప్రధాని నరేంద్ర మోదీ బలవంతంగా తమ మంత్రినొకరిని పదవి నుంచి తప్పించాల్సి వచ్చింది. అమిత్ షా సభకు రావాలంటూ ప్రతి రోజూ డిమాండ్ చేస్తూ విపక్షాలు సభా నిర్వహణకు ఆటంకం కలిగించాయి. జూలై 20 నుంచి ఆగస్టు 13 వరకు పార్లమెంట్ సమావేశాలు జరుగగా, ఒక్క ఆఖరి రోజు తప్ప ప్రధాని మోదీ, అమిత్ షాలు సభ ముఖం చూడలేదు. ఆఖరి రోజు నామమాత్రంగా హాజరైనా మూగనోము కొనసాగించారు. చిన్నాచితకా బిల్లులు ఆమోదం పొందినా ముఖ్యమైన ఫారిన్ కాంట్రిబ్యూషన్ బిల్లును కూ డా విపక్షం అడ్డుకోవడంతో దానిని సం యుక్త పార్లమెంటరీ కమిటీకి పంపారు.