రఘునాథపాలెం, ఫిబ్రవరి 28 : పేదలు కట్టుకున్న ఇళ్లను అధికార మదంతో నేలమట్టం చేశారు.. ఏడికిపోవాల్నో తెల్వక అక్కడే ఏడుస్తున్న బాధితులందరినీ బలవంతంగా తీసుకొచ్చి అంబేద్కర్, టీటీడీసీ భవనాల్లో పడేశారు. వచ్చిన రోజు నుంచి వారి బాగోగులను పట్టించుకున్న పాపానపోలేదు. పేరుకే పునరావాస కేంద్రాలే తప్ప.. అక్కడ కనీస సౌకర్యాలు లేవు.. తిండి లేదు.. నీరు లేదు.. అయినా దిక్కులేని ఆ అమాయక జనం అక్కడే బిక్కుబిక్కుమంటూ సామాన్లను కాపాడుకుంటూ రోజులు గడుపుతున్నారు. అధికారులు వచ్చి పేర్లు నమోదు చేసుకుంటూ కంటితుడుపు చర్యలు చేపడుతున్నారే తప్ప..
ఆశ్రయం కల్పిస్తామనే భరోసా ఇవ్వడం లేదు. కోర్టు ఆదేశాల మేరకు అధికారులే ఇళ్లను కూల్చారంటూ చెప్పి తప్పించుకుంటున్న కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల జాడ ఆ దరిదాపుల్లో కనిపించడం లేదు. తప్పు చేయకుంటే, వందలాది ఇళ్ల కూల్చివేతల్లో తమ ప్రమేయం నిజంగా లేకుంటే వచ్చి బాధితుల పక్షాన నిలబడే ప్రయత్నం చేయాలి కదా..! అండగా మేమున్నామనే భరోసా కల్పించాలని కదా..! కానీ, ఐదు రోజులైనా ఒక్క అధికార పార్టీ ప్రజాప్రతినిధి వచ్చిన పాపానపోలేదు. ఇదేనా ప్రజాపాలన..! ఇదేనా ఇందిరమ్మ రాజ్యం. నిజంగా ఆ ఇందిరమ్మే బతికుంటే భూదాన్ బాధితుల దీనస్థితిని చూసి తట్టుకునేదేనా..? రాక్షసత్వంగా భూదాన్ భూముల్లోని ఇళ్లను కూల్చివేసి పైశాచిక ఆనందం పొందుతున్న కాంగ్రెస్ పార్టీ నేతలకు బాధితుల ఆర్తనాదాలు వినిపించడం లేదా..? అని ఖమ్మం నగర ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇళ్లు కోల్పోయిన, పిల్లలతో వచ్చి పునరావాస కేంద్రాల్లో ఉన్న భూదాన్ బాధితుల దీనస్థితిని చూసి కన్నీరుపెడుతున్నారు. జరిగిన గోడును తెలుసుకొని చలించి ఓదార్పు అందిస్తున్నారు.

అడ్రస్‌లేని కాంగ్రెస్ పార్టీ నేతలు
ఖమ్మం టీటీడీసీ, అంబేద్కర్ భవనాల్లో భూదాన్ బాధితులు అల్లాడుతుంటే.. గూడు కోసం గోస పడుతుంటే అధికార పార్టీ నేతలు అడ్రస్ లేకుండాపోయారు. పునరావాస కేంద్రాల్లో అన్నపానీయాల్లేక మగ్గుతుంటే కనీసం పట్టించుకునే ప్రజాప్రతినిధులు కరువయ్యారు. ఖమ్మం నగర నడిబొడ్డున ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో పేదలు ఇళ్లు కోల్పోయి సామాన్లను కాపాడుకుంటూ రోజులు గడుపుతుంటే వారిని ఓదార్చి ప్రత్యామ్నాయం చూపిస్తామనే భరోసా ఇచ్చే అధికారి కానరాకపాయే. పైగా పునరావాస కేంద్రం నుంచి వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తున్న అధికారుల తీరును చూసి భూదాన్ బాధితులు భయాందోళన చెందుతున్నారు. పేర్లు నమోదు చేసుకొని ఫోన్ చేస్తాం, మీ ప్రాంతాలకు మీరు వెళ్లిపోవాలని బలవంతపు చర్యలు చేపడుతున్నారని ఆవేదన చెందుతున్నారు. ఉన్న గూడును లేకుండా చేసి ఇప్పుడు వెళ్లమంటే ఎక్కడికి పోవాలంటూ ప్రశ్నిస్తున్నారు. గూడు కల్పిస్తేనే ఇక్కడి నుంచి వెళ్లిపోతామంటూ తేల్చి చెబుతున్నారు.
వెళ్లగొట్టడానికే చూస్తున్నారు..
భూదాన్ భూముల ప్రాంతంలోనే తిరిగి మాకు ఇళ్లు కట్టించి ఇవ్వాలి. ఇక్కడి నుంచి వెళ్లగొట్టడానికే చూస్తున్నారు. ఫోన్లు చేస్తాం.. వెళ్లిపోండి అంటున్నారు. ఫోన్ చేస్తారనే నమ్మకమే లేదు. భూదాన్ భూముల్లో మాకు ఎలాంటి వసతులు లేకున్నా అక్కడే బాగుండేది. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం మా ఇళ్లను కూల్చి వీధిన పడేసింది.
– వనజ, భూదాన్ బాధితురాలు

ఇళ్లు చూపెట్టే వరకు కదలం..
భూదాన్ భూముల్లోని వంద గజాల స్థలంలో ఇళ్లు కట్టుకొని జీవిస్తున్నాం. రాకాసి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మా ఇళ్లను కూల్చి గూడు లేకుండా చేసింది. అనేక తిప్పలు పడుకుంటూ పదేళ్లుగా అక్కడే సంతోషంగా జీవించినం. మా ఇళ్లను కూల్చి హడావిడిగా తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. ఇక్కడ అధికారులేమో పేర్లు నమోదు చేసుకున్నాం.. మీరు మీ ప్రాంతాలకు వెళ్లిపోండి అంటున్నారు. మాకు ఇళ్లు చూపెట్టే వరకు మేం ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తేలేదు.
– కోనేటి మంగమ్మ, భూదాన్ బాధితురాలు
వెళ్లిపోమంటే ఎక్కడికి పోవాలి..
ఏనిమిదేళ్లుగా వెలుగుమట్ల ప్రాంతంలోని భూదాన్ భూముల్లో ఇళ్లు కట్టుకొని నివాసముంటున్నాం. ఐదు రోజుల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం మా ఇళ్లను కూల్చి సామాన్లతో సహా బలవంతంగా తీసుకొచ్చి మా కుటుంబాన్ని అంబేద్కర్ భవనంలో పడేశారు. తిండీతిప్పల్లేకున్నా ఏదో ఒకచోట ఆశ్రయం కల్పిస్తారనే ఆశతో నాలుగు రోజులుగా ఎదురుచూస్తున్నాం. ఇప్పుడేమో అధికారులు పేర్లు నమోదు చేసుకొని విచారణ కోసం ఫోన్ చేస్తాం వెళ్లిపోండి అంటున్నారు. ఉన్న ఇంటిని కోల్పోయిన మేము పిల్లలను తీసుకొని ఎక్కడికి పోవాలి.
– సుమలత, భూదాన్ బాధితురాలు
మా కుటుంబాన్ని రోడ్డున పడేశారు..
ఖమ్మం నగరంలో కూలి పనులు చేసుకుంటూ పైపా పైసా కూడబెట్టి నిర్మించుకున్న ఇంటిని బుల్డోజర్లతో కూలగొట్టి మా కుటుంబాన్ని రోడ్డున పడేశారు. ఐదురోజుల నుంచి పోలీసుల పహారా మధ్య భయం భయంగా బతుకుతున్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నిరుపేదలకు ఇండ్లు ఇస్తామని చెప్పి మోసం చేసింది. రెక్కల కష్టంతో నిర్మించుకున్న ఇంటిని నామరూపాలు లేకుండా ఎక్కడికక్కడ కూల్చివేసి మా జీవితాలను సర్వనాశనం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఈ దుర్మార్గాన్ని జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేం.
-కేలోతు సాలమ్మ, బాధితురాలు
మా ఉసురు తగిలి ప్రభుత్వం పోవాలి..
ప్రభుత్వం రోజువారీ పనులు చేసుకుంటూ.. కుటుంబాలను పోషించుకుంటున్న పేదలను ఇండ్ల నుంచి వెళ్లగొట్టి పక్కనే భూములు ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులకు వత్తాసు పలుకుతుంది. సుతారి పనులు చేసుకుని కష్టార్జితంతో నిర్మించుకున్న ఇంటిని కూల్చి మా జీవితాలను సర్వనాశనం చేశారు. మాలాంటి పేదల ఉసురు తగిలి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పోవాలి. గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్న మాలాంటి వారికి సమాచారం లేకుండా దాడి చేసి భయబ్రాంతులకు గురిచేశారు. నోటీసులు ఇవ్వకుండానే యంత్రాలతో ఇండ్లను కూల్చివేశారు.
-కందగట్ల నరేశ్, బాధితుడు