రఘునాథపాలెం, ఫిబ్రవరి 27 : ‘ఓట్లేసి గెలిపించినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం మాకు తగిన శాస్తి చేసింది. మా పాపం ప్రభుత్వంలోని పెద్దలకు తప్పక తగులుతుంది. ఎవరికో మేలు చేసేందుకు మమ్ములను ఈ స్థితికి తీసుకొచ్చిన ప్రజాప్రతినిధులకు మా ఉసురు తప్పక తగులుతుంది. మాకీ దుస్థితి వస్తదని కలలో కూడా ఊహించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మా గూడును లేకుండా చేస్తారని, మా కుటుంబాలను వీధిపాలు చేస్తారని అనుకోలేదు. ఏళ్లుగా గుడిసెలు వేసుకొని జీవిస్తున్న మాలాంటి పేదలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని ఆశ పడినం. కానీ, అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే ఉన్న గూడునే చెదరగొట్టారు.
అందిస్తామంటే నమ్మి ఓట్లేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. రాష్ట్రంలో రాక్షస పాలన సాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంలోని పెద్దలు గద్దల్లా వచ్చి మా స్థలాలను ఎత్తుకొని పోయిన్రు. అధికార మదంతో మాకు ఈ పరిస్థితి తీసుకొచ్చిన నేతలకు తగిన శాస్తి తప్పదు.’ ఈ మాటలంటున్నది ఎవరో కాదు.. ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూముల్లో ఇళ్లు కోల్పోయిన పేదలు. వారిని ఎవరు పలకరించినా వారి ఆక్రోశంతో వస్తున్న మాటలు. ఇళ్లు పడగొట్టిన ప్రజాప్రతినిధులు కంటపడితే నిజంగా బుద్ధిచెప్పేంత పనిచేస్తారేమో అన్నంత ఆవేశంతో మాట్లాడుతున్న మాటలు.
భూదాన్ భూముల్లో కూల్చిన ఇళ్ల దగ్గర ఉంచినా ఏ చెట్టుకిందనో, పుట్టకిందనో ఉండేవాళ్లు. కానీ, తెగ హడావిడి చేసి సామాన్లతో సహా వెళ్లగొట్టారు. ఎక్కడా లేని విధంగా ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసి ఖమ్మంలోని టీటీడీసీ, అంబేద్కర్ భవన్లకు తరలించారు. తీరా ఇక్కడికి వస్తే కనీసం పట్టించుకునే నాథుడే లేడు. జరిగిన నష్టానికి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చేందుకు వచ్చి మందలించే ప్రజాప్రతినిధి రాకపాయే. ‘మా కష్టం ఏ పగోడికీ కూడా రాకూడదు’ అంటూ గోడును వెళ్లబోసుకుంటున్నారు.
భూదాన్ భూముల నుంచి త్వరితగతిన వెళ్లగొట్టేందుకు ప్రభుత్వ ఆదేశంతో అధికారులు, పోలీసులు చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. కూల్చిన ఇళ్ల వద్దనే పేదలు ఉంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందనుకున్నారో, లేక ప్రజాప్రతినిధుల ఒత్తిడో గానీ కనీసం ఆ ప్రాంతం మొత్తం ప్రస్తుతం నిర్మానుష్యంగా మారిపోయింది. నిన్నామొన్నటి వరకు జనంతో కోలాహలంగా కనిపించిన భూదాన్ భూముల ప్రాంతం.. ప్రభుత్వం కూల్చిన శిథిలాలతో శుక్రవారం మరుభూమిని తలపించిందంటే అతిశయోక్తి కాదు.
కాగా, ఖమ్మంలోని టీటీడీసీ, అంబేద్కర్ భవన్లలో సామగ్రితో ఆశ్రయం పొందుతున్న భూదాన్ బాధితులు సరైన సౌకర్యాల్లేక అల్లాడుతున్నారు. కనీసం తిండి కూడా లేకపోవడంతో ఆకలితో అలమటిస్తున్నారు. సమయానికి తిండి పెట్టే పరిస్థితి లేదని వాపోతున్నారు. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారో, ఎన్నాళ్లు ఇలా ఉంచుతారో అంటూ నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరైన సౌకర్యాల్లేక సామాన్లను రోడ్లపైనే పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ రోజులు గడుపుతున్నామని కన్నీటి పర్యంతమవుతున్నారు.
మూడు రోజులైతంది. కనీసం సమయానికి తిండి కూడా పెట్టడం లేదు. ఇళ్లు కోల్పోయిన నేనే ముగ్గురు పిల్లలు ‘ఆకలి ఆకలి’ అంటుంటే చేతిలో చిల్లిగవ్వ లేక పిల్లలను పట్టుకొని పక్కన వీధుల్లో బువ్వ కోసం వెళ్తున్నా. నా పిల్లలను చూసి జాలితో బుక్కెడు బువ్వ వెయ్యక పోతారా అనే ఆశతో టిఫిన్ బాక్స్ చేతిలో పట్టుకొని పోతున్నా. త్వరగా ఆశ్రయం కల్పిస్తే సామాన్లను తీసుకొనిపోయి పనులు చేసుకొని బతుకుతాం.
-సంక్రాంతి కృష్ణ, భూదాన్ నిర్వాసితుడు
భూదాన్ భూముల్లో ఉన్న మా ఇంటిని ప్రభుత్వం కూలగొట్టింది. మమ్ములను అక్కడి నంచి వెళ్లగొట్టారు. మేం ఎక్కడికి వెళ్లాలో తెల్వడం లేదు. సామాన్లతో సహా ఇక్కడికి తీసుకొచ్చి పడేశారు. లిస్టులో మా పేరు లేదంటున్నారు. మాకు నీడ కల్పించి వెళ్లగొడితే పోతాం. అంతకంటే మాకేమీ వద్దు.
-వెంకన్న, భూదాన్ నిర్వాసితుడు