హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ఎమ్మె ల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహాన్ని రాత్రికి రాత్రే తొలగించడం ద్వారా రేవంత్ సర్కార్ మరోసారి తన పాశవికత్వాన్ని నిరూపించుకున్నదని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. నర్సంపేట గడ్డపై పెద్ది విగ్రహం నిలబడితేనే కాంగ్రెస్ ప్రభుత్వానికి ముచ్చెమటలు పడుతున్నాయని, అందుకే పోలీసులను ఉసిగొల్పి అర్ధరాత్రి విగ్రహాన్ని తొలగించిందని మండిపడ్డారు. సీఎం మెప్పు కోసం పోలీసులు దొంగల్లా రాత్రికి రాత్రే తొలగించాల్సిన దుస్థితి ఎందుకొచ్చిందని ప్రశ్నించారు.
కాంగ్రెస్ నాయకులు చెప్పినట్టు పోలీసులు నడుచుకోవద్దని, చట్టాన్ని, ప్రజాస్వా మ్య విలువలను గౌరవించాలని హితవు పలికా రు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదనే విషయా న్ని పోలీసులు, కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. ఈ మేరకు మంగళవా రం ఒక ప్రకటన విడుదల చేశారు. పెద్ది విగ్రహం తొలగింపును నిరసిస్తూ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నిరసనలు చేపడుతారని వారిని అరెస్టులు చేయడం, గృహనిర్బంధాలు విధించడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్ర పాలన నాటి కరశత్వాన్ని మరోసారి ప్రదర్శిస్తున్నదని మండిపడ్డారు. పెద్ది విగ్రహం తొలగింపు చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని, ప్రభుత్వం తక్షణమే వెనకి తగ్గాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
శాసనమండలిలో విపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాసర్, మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, పార్టీ సీనియర్ నాయకులు, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు నాగుర్ల వెంకన్న, మర్రి యాదవరెడ్డితోపాటు నర్సంపేట నియోజకవర్గంలోని అన్ని మండలాల ముఖ్య నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి, గృహనిర్బంధంలో ఉంచడాన్ని కేటీఆర్ తప్పుబట్టారు.
అరెస్టు చేసిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలందరినీ బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ శ్రేణులపై అక్రమ కేసులు నమోదు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఇప్పటికే పుట్టెడు దుఃఖంలో ఉన్న పెద్ది కుటుంబ సభ్యులను విగ్రహ తొలగింపు వంటి తుగ్లక్ చేష్టలతో వారి మనోధైర్యాన్ని దెబ్బ తీయకూడదని సూచించారు. ముమ్మాటికి రాష్ట్రంలో ఏర్పడేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, అప్పుడు నర్సంపేట మెడికల్ కాలేజీకి పెద్ది సుదర్శన్‌రెడ్డి పేరు పెట్టుకోవడమే కాకుండా ఆయన వీరోచిత పోరాటానికి శాశ్వత కీర్తిని తెస్తామని కేటీఆర్ పునరుద్ఘాటించారు.