హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): నర్సంపేటలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహాన్ని రాత్రికి రాత్రే తొలగించడం అన్యాయమని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఖండించారు. తెలంగాణభవన్‌లో మాజీ మంత్రి సత్యవతిరాథోడ్, మాజీ ఎంపీ వినోద్‌కుమార్, మాజీ ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, చల్లా ధర్మారెడ్డి, బీఆర్ఎస్ నేత వై సతీశ్‌రెడ్డితో కలిసి మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ విగ్రహ ఏర్పాటుపై కలెక్టర్, సీపీకి ముందుగానే సమాచారం ఇచ్చామని, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా విగ్రహాన్ని తొలగించడం సరికాదని పేర్కొన్నారు.
వెంటనే అదే స్థలంలో తిరిగి ఏర్పాటు చేయకుంటే నియోజకవర్గంలోని ప్రతిగ్రామంలో పెద్ది విగ్రహాలు పెడుతామని హెచ్చరించారు. భూ యజమాని విద్యాసాగర్ అనుమతితోనే ప్రైవేట్ స్థలంలో విగ్రహాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రభుత్వం పెద్ది సుదర్శన్‌రెడ్డి అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించినప్పుడు, ఆయన విగ్రహాన్ని ఎందుకు తొలగించారని ప్రశ్నించారు. పెద్ది విగ్రహాన్ని వెంటనే ఏర్పాటు చేయకుంటే జరుగబోయే పరిస్థితులకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహ కూల్చివేతకు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డే కారణమని మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ ఆరోపించారు. విగ్రహాన్ని కూల్చి కాంగ్రెస్ నేతలు పైశాచిక ఆనందం పొందుతున్నారని విమర్శించారు. మాధవరెడ్డి తన పుట్టినరోజునే విగ్రహాన్ని తొలగించి సంతోషపడుతున్నారేమో కానీ, రాబోయే ఎన్నికల్లో ఆయనకు డిపాజిట్ కూడా దకదని వ్యాఖ్యానించారు. తెలంగాణ చరిత్ర ఉన్నంతకాలం పెద్ది సుదర్శన్‌రెడ్డి పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని చెప్పారు. ప్రైవేటు స్థలంలో విగ్రహం ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ నేతలకు వచ్చిన ఇబ్బందేమిటని ప్రశ్నించారు.
మెడికల్ కాలేజీకి సమీపంలోని ప్రైవేట్ స్థలంలో పెద్ది విగ్రహం ఏర్పాటు చేస్తే ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బందేమిటని మాజీ ఎంపీ బీ వినోద్‌కుమార్ నిలదీశారు. దొంతి మాధవరెడ్డి ప్రోద్బలంతోనే కూల్చివేత జరిగిందని ఆరోపించారు. అమీర్‌పేటలో రోడ్డు మధ్యలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి ఆవిషరించారని, దానికి అనుమతులు ఉన్నాయా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో అనేక విగ్రహాలు రోడ్ల మధ్యలో ఉన్నప్పటికీ వాటిని తొలగించలేదని పేరొన్నారు. నర్సంపేట ప్రజలు చైతన్యవంతులని, అన్యాయాన్ని సహించరని స్పష్టంచేశారు. కే కేశవరావు నేతృత్వంలోని తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ పెద్ది విగ్రహం తొలగింపుపై చర్చించి తక్షణమే ఏర్పాటుచేసేలా ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని డిమాండ్ చేశారు. 24 గంటల్లో అదే ప్రాంతంలో విగ్రహాన్ని తిరిగి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధిలో పెద్ది సుదర్శన్రెడ్డిది కీలక పాత్ర అని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తెలిపారు. మరణించిన నేత విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ నేతలకు ఎందుకు ఇబ్బందని ప్రశ్నించారు. విగ్రహాలను గౌరవ సూచకంగా ఏర్పాటు చేస్తారని, వాటికి అనుమతులు అవసరం లేదని వ్యాఖ్యానించారు. ఇంత మందిని ముందస్తు అరెస్టు చేయడం, ఇంత అరాచకం సృష్టించడం అవసరమా? అని ప్రశ్నించారు.
పెద్ది సుదర్శన్‌రెడ్డి అందరినీ ప్రోత్సహించారని, అలాంటి వ్యక్తి విగ్రహాన్ని అభిమానులు ఏర్పాటు చేసుకుంటే కూల్చడం ఎంతవరకు న్యాయమని మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వ తీరును ప్రజలు సహించబోరని హెచ్చరించారు. నర్సంపేటను మరోసారి సమస్యాత్మక ప్రాంతంగా మార్చే ప్రయత్నం జరుగుతున్నదని ఆరోపించారు. పరిస్థితి చేయి దాటకముందే ప్రభుత్వం స్పందించి పెద్ది విగ్రహాన్ని తిరిగి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ వై సతీశ్‌రెడ్డి మాట్లాడుతూ పెద్ది అంత్యక్రియల్లో పేలని తుపాకులను పేల్చి అవమానించిన ప్రభుత్వం.. ఇప్పుడు విగ్రహాన్ని ధ్వంసం చేసి ప్రజల మనోభావాలను దెబ్బతీసిందని ఆగ్రహం వ్యక్తంచేశారు.