సత్తుపల్లి టౌన్, ఆగస్టు 18 : పేదింటి ఆడబిడ్డల వివాహ సమయంలో వారికి తల్లిదండ్రులకు ఆర్థికంగా అండగా నిలుస్తున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను యథావిధిగా కొనసాగించాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు పార్టీ శ్రేణులతో కలిసి సత్తుపల్లి పట్టణంలో మంగళవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్ నుంచి బోసుబొమ్మ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద బైఠాయించి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను నిర్వీర్యం చేయాలని చూస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రలను తిప్పికొడతామని, ప్రజలకు బీఆర్ఎస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
ఉద్యమ సమయంలో పేద కుటుంబాల కష్టాలను గమనించిన ఉద్యమనేత కేసీఆర్.. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక పేదల కష్టాలను తొలగించాలని నిర్ణయించుకున్నారని అన్నారు. అందులో భాగంగానే పేదింటి ఆడబిడ్డల వివాహాలకు అండగా నిలిచేందుకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను తెచ్చారని గుర్తుచేశారు. ఈ పథకాలకు సంబంధించి న్యాయపరమైన అంశాలుంటే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సకాలంలో స్పందించి పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ‘మేం అధికారంలోకి వస్తే కల్యాణలక్ష్మి నగదుతోపాటు తులం బంగారం కూడా ఇస్తాం’ అంటూ ఇచ్చిన ఎన్నికల హామీ ఏమైందని ప్రశ్నించారు. ఇప్పుడు ఆ హామీని కూడా పక్కనబెట్టి ఏకంగా ఆ పథకాలను ఎత్తివేసే కుట్రలు పన్నుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. సత్తుపల్లి మున్సిపల్ మాజీ చైర్మన్ మహేశ్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు వెంకటరెడ్డి, వెంకటేశ్వరరావు, లింగపాలెం సర్పంచ్ రమేష్, చెక్కిలాల మోహనరావు, కౌన్సిలర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.