భద్రాచలం, ఆగస్టు 18: విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని, పెండింగ్ స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు, విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈ మేరకు భద్రాచలం సబ్ కలెక్టరేట్ ఎదుట మంగళవారం మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు, విద్యార్థులు మాట్లాడుతూ.. సాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ సకాలంలో అందకపోవడంతో వేలాదిమంది విద్యార్థులు చదువులు కొనసాగించలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ముఖ్యంగా పేద, మధ్యతరగతి విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులతో ఉన్నత విద్యకు దూరమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రూ.10,814 కోట్ల పెండింగ్ నిధులు విడుదల చేస్తామన్న ఎన్నికల హామీని అమలుచేయాలని డిమాండ్ చేశారు. అనంతరం సబ్ కలెక్టరేట్ ఏవో భగవాన్రెడ్డికి వినతిపత్రం అందజేశారు. నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.