గజ్వేల్, ఆగస్టు 18: పేదల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను రద్దు చేసేందుకు కాంగ్రెస్ సర్కారు దుర్మార్గంగా ఆలోచిస్తున్నదని, రేవంత్ సర్కారు మెడలు వంచి కల్యాణలక్ష్మి, షాదీముబాకర్ పథకాలు చేసేలా బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు కొనసాగించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం గజ్వేల్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి అంబేద్కర్, ఇందిరాపార్కు చౌరస్తా మీదుగా ఐవోసీ కార్యాలయం వరకు బీఆర్ఎస్ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీవో కార్యాలయం ఎదుట పార్టీ శ్రేణులతో కలిసి ధర్నాలో వంటేరు ప్రతాప్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు.కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాలతో కేసీఆర్ పేదల గుండెల్లో నిలిచిపోయారనే, అందుకే దురుద్దేశంతో ఆ పథకాలను రద్దుచేసేందుకు రేవంత్‌రెడ్డి సర్కారు కుట్రలు చేస్తున్నదని మండిపడ్డారు. రైతుబీమా పథకానికి ప్రభుత్వం ప్రీమియం చెల్లించకపోవడంలో ప్రమాదవశాత్తు రైతులు మృతి చెందితే వారి కుటుంబాలకు బీమా డబ్బులు రాలేని పరిస్థితిని రేవంత్‌రెడ్డి సర్కార్ తెచ్చిందని వంటేరు ప్రతాప్‌రెడ్డి మండిపడ్డారు. వెంటనే ప్రీమియం చెల్లించి రైతు సంక్షేమ పథకాలు కొనసాగించాలని డిమాండ్ చేశారు. న్యూట్రీషన్ కిట్, కేసీఆర్ కిట్‌కు ఇప్పటికే ఈ ప్రభుత్వం మంగళం పాడిందన్నారు. మహిళలను కోటీశ్వరులను చేస్తామంటున్న రేవంత్‌రెడ్డి, లక్ష రూపాయలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాడని ఎద్దేవా చేశారు. అనంతరం ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు. మున్సిపల్ చైర్పర్సన్ చందన, డీసీసీబీ డైరెక్టర్ అంజిరెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, వైస్ చైర్పర్సన్ పద్మబాయి, మండల పార్టీ అధ్యక్షులు మధు, నవాజ్, కుమార్, వెంకట్‌రెడ్డి, నాయకులు దేవీ రవీందర్, అమరావతి, కృష్ణారెడ్డి, మల్లేశం, శ్రీనివాస్‌రెడ్డి, అర్జున్‌గౌడ్, జుబేర్, దుర్గయ్య, రాజురావు, మహిపాల్, కౌన్సిలర్లు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.