టేకులపల్లి, ఫిబ్రవరి 26: టేకులపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో గల అంగన్వాడీ కేంద్రంలో గురువారం సామూహిక సీమంతాలు, అక్షరాభ్యాసాలు నిర్వహించారు. టేకులపల్లి సర్పంచ్ బోడా బాలు నాయక్ చిన్నారులకు అక్షరాభ్యాసాలు, గర్భిణీలకు ఒడి నింపి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ పౌష్టికాహారం ఆవశ్యకతపై వివరించారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందించే పౌష్టికాహారాన్ని తీసుకోవాలని సూచించారు. గర్భిణిగా ఉన్న సమయం నుంచి బిడ్డ పుట్టేవరకు టీకాలు ఇవ్వడం, కాన్పు జరిగేంత వరకు ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను వివరించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సేవలను అర్హులు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యుడు జీజ, ఐడీసీఎస్ సూపర్వైజర్ అనురాధ, అంగన్వాడీ టీచర్లు భద్రమ్మ, పద్మ, ఇందిరమ్మ, ఆయాలు పాల్గొన్నారు.

టేకులపల్లి అంగన్వాడీలో సామూహిక సీమంతం, అక్షరాభ్యాసాలు