భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 1 (నమస్తే తెలంగాణ): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆరునెలల తర్వాత ‘ప్రజావాణి’కి మోక్షం కలిగింది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం తప్పనిసరిగా గ్రీవెన్స్ డే(ప్రజావాణి) నిర్వహించాల్సి ఉంది. కానీ గతంలో పనిచేసిన కలెక్టర్ జితేశ్ వి పాటిల్ కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనేలేదు. కేవలం భూసమస్యల పరిష్కారం కోసం మాత్రమే ఆర్డీవో కార్యాలయాల్లో గ్రీవెన్స్ నిర్వహించుకోవాలని చెప్పడంతో భద్రాచలం, కొత్తగూడెం డివిజన్ల్లో అక్కడ ఆర్డీవోలు మొక్కుబడిగా నిర్వహించారు.
తమ సమస్యలు చెప్పుకోవడం కోసం వచ్చే గ్రామీణ, పట్టణ ప్రజలకు వేదికగా ఉన్న ప్రజావాణిని రద్దు చేయడంతో జనం కలెక్టరేట్లో ఫిర్యాదులు ఇచ్చి వెళ్లిపోయేవారు. వాటి పరిష్కారం అయిందో లేదో కూడా తెలిసేదికాదు. ప్రజావాణిని రద్దు చేయడంతో ప్రజా సమస్యలు గాలికి వదిలేసినట్లయింది. కలెక్టర్ పెద్దగా దృష్టి సారించకపోవడంపై పత్రికల్లో కథనాలు కూడా వచ్చాయి. అయితే కలెక్టర్ ఏకంగా ప్రజావాణిని రద్దు చేశారు. కేవలం ఇన్వార్డులో ఫిర్యాదులు స్వీకరించడం తప్ప ఆరునెలలుగా ప్రజావాణి జరగనేలేదు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన కలెక్టర్ అంకిత్ ప్రజావాణి తిరిగి ప్రారంభించేందుకు చొరవ చూపడంతో ప్రతి సోమవారం ఇక ప్రజావాణికి అధికారులు హాజరుకానున్నారు. అయితే ఆర్డీవో కార్యాలయాల్లో నిర్వహించే గ్రీవెన్స్ ఉంటుందా.. లేదా అనేది వేచిచూడాల్సిందే.
అధికారులు సకాలంలో హాజరుకావాలి:కలెక్టర్ అంకిత్
కొత్తగూడెం టౌన్, మార్చి 1: కలెక్టరేట్లో సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమానికి అన్నిశాఖల జిల్లా అధికారులు సకాలంలో హాజరుకావాలని భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అంకిత్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన అంశాలపై లిఖితపూర్వకంగా ఫిర్యాదులను సమర్పించాలని సూచించారు. ఉదయం 10:30 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని, అధికారులు ఫిర్యాదులను స్వీకరించి, వాటి పరిష్కారానికి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.