తాండూర్ : జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సీఎంఆర్( CMR ), సాదాబైనామా, భూ భారతి దరఖాస్తులు, రీ-సర్వే పనులు తదితర కార్యక్రమాలను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ వి రాములు ( Additional Collector Ramulu )ఆదేశించారు.
మంగళవారం తాండూర్ మండలం కార్తికేయ ఇండస్ట్రీస్ రైస్ మిల్లును రెవెన్యూ ఇన్స్పెక్టర్ బొలిశెట్టి పద్మతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎంఆర్ బకాయిల పురోగతిని సమీక్షించి పెండింగ్ సీఎంఆర్‌ను ఎలాంటి జాప్యం లేకుండా వెంటనే పూర్తి చేయాలని మిల్లర్లను ఆదేశించారు.
సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీతో కలిసి తహసీల్ కార్యాలయాన్ని సందర్శించి పెండింగ్ సాదా బైనామా, భూ భారతి దరఖాస్తులపై సమీక్ష నిర్వహించారు. రాంపూర్ గ్రామంలో జరుగుతున్న రీ-సర్వే పనుల పురోగతిని తెలుసుకున్నారు. కార్యాలయంలో పెండింగ్‌లో ఉన్న వివిధ ధ్రువపత్రాల దరఖాస్తులను నిబంధనలకు లోబడి పరిశీలించి త్వరితగతిన జారీ చేయాలన్నారు. ఆయన వెంట తహసీల్దార్ జ్యోత్స్న, డిప్యూటీ తహసీల్దార్ కల్పన, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.